Healthy Heart : గుండె పదిలమేనా? ఈ లక్షణాలు కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త!
ఎంతో మంది యువకులు చాలా ఆరోగ్యకరమైన జీవన శైలి కలిగిన వారు కూడా గుండె పోటుతో అకస్మాత్తుగా మరణిస్తున్నారు. ఇది అకస్మాత్తుగా జరిగేది కాదని కొన్ని చిన్న సూచనలను నిర్లక్ష్యం చెయ్యడం వల్లే ఇలా జరుగుతోందట.
ఈ మధ్య కాలంలో ఎవరు.. ఎప్పుడు.. గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ సమస్యతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాళ్లు, అథ్లెట్లు, జిమ్ చేసేవారు వర్కవుట్ సమయంలో కుప్పకూలడం చూస్తున్నాం. ఇలా జరగడానికి ముందే కొన్ని చిన్నచిన్న సూచనలు కనిపిస్తాయట. వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఇలా ప్రాణాల మీదకు వస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ లక్షణాలు, సూచనల గురించిన అవగాహన అందరికీ అవసరం. గుండె పోటు ఎవరికైనా, ఎపుడైనా రావచ్చు. గుండెకు సంబంధించిన సమస్యలను మొదట్లో గుర్తించడమే ప్రమాదాన్ని తప్పించడంలో కీలకమవుతుంది. ముఖ్యంగా అథ్లెట్లు మరియు బాడీబిల్డర్లు విస్మరించకూడని నాలుగు ముఖ్యమైన లక్షణాలు ఇవే.
ఛాతిలో చెప్పేందుకు వీలు లేని చిన్న అసౌకర్యం (Unexplained Chest Pain or Discomfort)
గుండెపోటుకు అత్యంత సాధారణ లక్షణం గుండె నొప్పి. ఇది గుండె భారంగా ఉన్నట్టు, కాస్త కలుక్కుమన్న భావన కలిగిస్తుంది. గుండె నొప్పి కేవలం ఛాతిలోనే వస్తుందని అనుకుంటే పొరపాటే. చేతులు, భుజాలు, వెన్ను, లేదా మెడ, దవడ భాగాల్లో కూడా ఈ నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి నొప్పి ఎక్కువగా శారీరక శ్రమ తర్వాత కనిపిస్తే తప్పకుండా జాగ్రత్తగా పడాలి.
నీరసం, బలహీనత (Unexplained Fatigue or Weakness)
సాధారణంగా శారీరక శ్రమ లేదా వ్యాయామం తర్వాత కొద్దిపాటి అలసటగా అనిపించడం, శక్తి సన్నగిల్లినట్టు అనిపించడం కూడా గుండె సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. మామూలు సందర్భాల్లో ఇలాంటి నీరసం అనిపించకపోతే ప్రమాద సూచిక కావచ్చు. తప్పకుండా జాగ్రత్తపడల్సిన అవసరం ఉంటుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (Shortness of Breath)
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం, ముఖ్యంగా చిన్న పనులు చేసినా ఆయాసంగా అనిపించడం గుండెపోటు లేదా గుండె సమస్యల సూచనగా భావించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య వర్కవుట్ సమయంలోనూ, విశ్రాంతిగా ఉన్న సమయంలో కూడా అనిపిస్తే అది తీవ్రమైన అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
గుండె లయ తప్పడం (Irregular Heartbeats or Palpitations)
గుండె వేగంగా కొట్టుకోవడం లేదా గుండె దడగా అనిపించడం, గుండె పట్టేసినట్టు అనిపించడం లేదా గుండె బలహీనంగా కొట్టుకోవడం కూడా ప్రమాద సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తున్నాపుడ అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. గుండె లయతప్పడాన్ని అసలు నిర్లక్ష్యం చెయ్యకూడదు.
ఇతర ముఖ్య సూచనలు
- శరీరంలో ఏదైనా భాగంలో స్పర్శలేనట్టు లేదా తిమ్మిరిగా (numbness) అనిపించడం కూడా ప్రమాదా సూచనే.
- గుండెపోటు ముందు శరీరంలో వేడి పెరిగిపోయి చాలా ఎక్కువగా చెమట పడతాయి.
- వికారంగా అనిపించడం, వాంతులు, తలనొప్పి, తలతిరుగుతున్నట్టు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విశ్రాంతిగా ఉండాలి. డాక్టర్ ను సంప్రదించాలి. అతి త్వరలో గుండెపోటు రాబోతోందనేందుకు ఈ లక్షణాలు ప్రమాద సూచనలు.
- ఇలాంటి లక్షణాలను ఎవరిలో కనిపించినా ప్రమాదమే. ముఖ్యంగా అథ్లెట్లు మరియు బాడీబిల్డర్లకు ప్రమాదం మరింత ఎక్కువ. సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం.
Also Read : వానల్లో, వరదల్లో తిరుగుతున్నారా? అయితే జాగ్రత్త.. మాంసాన్ని తినేసే బాక్టీరియా సోకొచ్చు.. విజయవాడలో ఏమైందంటే