Healthy and Instant Breakfast Recipe : ఇన్స్టాంట్ ఇడ్లీ రెసిపీ.. మరమరాల(బొరుగులు)తో ఈజీగా చేసేయొచ్చు
Puffed Rice Idly : ఇడ్లీ తినాలనిపించినప్పుడు ఇడ్లీ పిండి లేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో బొరుగులుంటే చాలు. వేడి వేడి ఇడ్లీ చేసుకుని లాగించేయవచ్చు.
Instant Murmura Idly Recipe : ఇడ్లీ చేయాలంటే ముందురోజే పిండిని సిద్ధం చేసుకోవాలి. లేదంటే పప్పును ముందురోజే నానబెట్టుకోవాలి. ఈ రెండు చేయడం కుదర్లేదు అంటే బయటకు వెళ్లి తినాలి ఇంకో ఆప్షన్ లేదు అనుకుంటున్నారా? ఇంట్లో మరమరాలు ఉంటే చాలు. మీరు హెల్తీ, టేస్టీ, స్మూత్ ఇడ్లీలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదేంటి మరమరాలతో ఇడ్లీని ఎలా తయారు చేస్తామనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ రెసిపీ తయారీ కోసం ఏమేమి పదార్థాలు కావాలో.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మరమరాలు - కప్పు
ఇడ్లీ రవ్వ - అరకప్పు
పెరుగు - అర కప్పు
ఉప్పు - తగినంత
మరమరాలతో ఇడ్లీ తయారీ విధానం
ముందుగా మరమరాలను బాగా కడిగండి. దీనిని మిక్సీలో వేసి.. మెత్తని పేస్ట్‌లా చేయండి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని.. దానిలో ఈ పిండిని వేసి.. రవ్వ, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపండి. పిండి ముద్దలు లేకుండా చూసుకోండి. ఓ పావు గంట దానిని పక్కన పెట్టేయండి. ఈ సమయంలో మీరు దానికోసం చట్నీ లేదా సాంబార్ వంటి ప్రిపేర్ చేసుకోవచ్చు.
అనంతరం ఇడ్లీ కుక్కర్ తీసుకుని పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేయాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై ఇడ్లీ కుక్కర్ ఉంచండి. ఆవిరి మీద ఇడ్లీ ఉడికిన తర్వాత స్టౌవ్ ఆపేయండి. అంతే టేస్టీ టేస్టీ, హెల్తీ, స్మూత్ ఇడ్లీలు రెడీ. వీటిని మీరు స్పైసీ చట్నీతో లేదా వేడి వేడి సాంబార్‌తో కలిపి తింటే చాలా బాగుంటుంది.
టైమ్ లేదనుకున్నప్పుడు
మీరు బ్యాచిలర్‌గా ఉన్నా.. ఫ్యామిలీతో ఉన్నా.. ఆరోగ్యం బాగోకపోయినా.. ఫ్యామిలీ మొత్తానికి ఇడ్లీలు చేయాలనుకున్నప్పుడు ఇన్‌స్టాంట్‌గా ఇడ్లీలు చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని ఫాలో అయిపోవచ్చు. పైగా బొరుగులు ఆరోగ్యానికి చాలామంచివి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో విటమిన్ డి, విటమిన్ బి, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తాయి.
బరువు తగ్గాలనుకుంటే..
పైగా మరమాలతో చేసిన ఇడ్లీలు చాలా ఈజీగా జీర్ణమవుతాయి. దీనిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు కూడా మినపప్పుకు బదులుగా ఇలా మరమరాలతో ఇడ్లీలు చేసుకోవచ్చు. దీనిలో ఫైబర్ మీ కడుపును నిండుగా ఉంచుతుంది. దీనివల్ల మీరు చిరుతిండికి దూరంగా ఉంటారు. దీనిలో మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు మీకు ఇమ్యూనిటీని అందిస్తాయి. సీజనల్ వ్యాధులను దూరం చేసే లక్షణాలు దీనిలో కలిగి ఉంటాయి.