Health Tips: ఈ స్పెషల్ ఛాయ్ తాగారంటే తలనొప్పి చిటికెలో మటుమాయం
తలనొప్పిగా అనిపిస్తే టాబ్లెట్ వేసుకుంటారు. కానీ ఈ స్పెషల్ టీ తాగితే మాత్రం క్షణాల్లో తగ్గిపోతుంది.
టీ, కాఫీ లేని జీవితం ఉండదేమో. సరదాగా ఉన్నప్పుడు, చిరాకుగా అనిపించినప్పుడు, రిలాక్స్ కోసం, ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఇలా ఒకటి కాదు రెండు కాదు వివిధ రకాల కారణాల వల్ల టీ, కాఫీ తాగుతూనే ఉంటారు. టీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇష్టపడే పానీయం. సాధారణంగా ఇళ్ళల్లో అల్లం, యాలకులు వేసి టీ పెట్టుకుని తాగుతూ ఉంటారు. అదే బయట అయితే మసాలా టీ, గరం ఛాయ్, ఇరానీ ఛాయ్ అని ఇలా రకరకాలుగా దొరికేస్తూనే ఉంటాయి. పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు కొద్దిగా టీ చుక్కలు గొంతులో పడితే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
బిజీ బిజీ లైఫ్, పని ఒత్తిళ్ల నుంచి అలసిపోయి ఇంటికి రాగానే వేడి వేడి టీ తాగితే చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా విపరీతమైన తల నొప్పి వచ్చేస్తుంది. ఆ తల నొప్పి నుంచి బయట పడేందుకు అల్లం వేసి టీ పెట్టవోయ్ అని ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తారు. అయితే దీని వల్ల రిలాక్స్ అవుతావేమో కానీ తలనొప్పి మాత్రం కాస్త అలాగే ఉంటుంది. అందుకే ఈ స్పెషల్ ఛాయ్ తాగారంటే మాత్రం ఎంతటి తలనొప్పి అయినా చిటికెలో మాయం అయిపోతుంది. ఈ అద్భుతమైన హెర్బల్ టీ ఎలా చేయాలో చూద్దాం.
స్పెషల్ టీకి కావాల్సిన పదార్థాలు
2 కప్పుల నీళ్ళు
1 అంగుళం అల్లం ముక్క
కొన్ని తులసి ఆకులు
ఒక టీ స్పూన్ వామ్ము
½ టీ స్పూన్ చామంతి(చమోమిలి) పూలు
కొన్ని పిప్పరమెంటు ఆకులు
కొద్దిగా తేనె
తయారీ విధానం
స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. అవి బాగా మరుగుతున్నప్పుడు అల్లం, తులసి ఆకులు వేసి మరిగించాలి. తర్వాత వామ్ము, చామంతితో పాటు పిప్పరమెంటు ఆకులు జోడించాలి. ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుని కప్పులోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె కలిపి తాగొచ్చు.
ఈ టీ తలనొప్పిని ఎలా తగ్గిస్తుంది?
అల్లం, చమోమిలి రెండూ నాడీ వ్యవస్థని సడలించి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉన్న ఔషధ గుణాలు తలనొప్పిని పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. తులసి, చమోమిలికి ఆందోళన తగ్గించే గుణాలు ఉన్నాయి. చామంతి పూలని ఎన్నో దశాబ్దాలుగా ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని ఇది పరిష్కరిస్తుంది. అంతే కాదు ఇవి కాలానుగుణంగా వచ్చే అలర్జీలని కూడా నయం చేస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటితో పాటు పొట్ట ఉబ్బరం సమస్యని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఈ హెర్బల్ టీలో వామ్ము జోడించడం వల్ల అది జీర్ణక్రియకి ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తుంది. తలనొప్పిని తగ్గేందుకు కూడా సహాయకారిగా వ్యవహరిస్తుంది. చామంతి పూలు వేసిన టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడుతుంది. చర్మానికి మేలు చేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: తల స్నానం చేసేటప్పుడు ఈ నాలుగు తప్పులు చెయ్యొద్దు