చిన్న బెల్లం ముక్కతో వేయించిన శెనగలు తింటే ఎన్ని లాభాలో, ఆ సమస్యలన్నీ దూరం
చిరుతిళ్లుగా బెల్లం,వేయించిన బఠానీలు, శెనగలు, వేరు శెగనలు తినే కాలం కాదు ఇది.
పూర్వం చిరుతిళ్లంటే చాలా ఆరోగ్యకరమైనవి. పటిక పంచదార, బెల్లం ముక్క, కొబ్బరి ముక్క, ఉడకబెట్టిన వేరు శెనగలు ఇలా అన్నీ ఆరోగ్యకరమైనవే. కానీ ఇప్పుడు చిరుతిళ్లంటే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, సమోసాలు. నేటి చిరుతిళ్లు తినడం వల్ల శరీరానికి నష్టమే కానీ ఎలాంటి లాభమూ లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే అమ్మమ్మల నాటి ఆహారాన్ని ఎంచుకోవాలి. శెనగలను వేయించి, చిన్న బెల్లం ముక్కతో కలిపి తింటే ఆ రుచే వేరు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి. ఎన్నో అనారోగ్యాలు రాకుండా ఇవి అడ్డుకుంటాయి. ముఖ్యంగా పురుషులు వీటిని కచ్చితంగా తినాలని చెబుతున్నారు.
జీర్ణక్రియకు...
వేయించిన శెనగలు, బెల్లం కలిపి తినడం వల్ల అధిక మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. ఇది మలబద్ధకం, అలసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ నాళం ద్వారా ఆహారాన్ని సులువుగా ప్రయాణం చేయడానికి సహకరిస్తుంది.
యూరినరీ ఇన్ఫెక్షన్
బెల్లం, శెనగలు రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యూరినరీ ఇన్ఫెక్షన్‌ను దూరంగా ఉంచుతాయి. వీటిని తినడం వల్ల మూత్రనాళంలో మంటను దూరం చేస్తుంది.
కండరాలు దృఢంగా...
ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల కండరాలకు అదనపు శక్తి లభిస్తుంది. అవి మరింతగా బలంగా మారుతాయి. వ్యాయామం చేశాక ఎనర్జీ డ్రింకులు తాగే బదులు శెనగలు, బెల్లం తినడం వల్ల శక్తి వెంటనే అందుతుంది.
రోగనిరోధక శక్తి
శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే త్వరగా అనారోగ్యం బారిన పడతాము. వ్యాధులతో పోరాడే శక్తి ఈ రోగనిరోధక వ్యవస్థకు ఇవ్వాలంటే రోజూ బెల్లం, వేయించిన శెనగలు కలిపి తినాలి. ఈ చిరు తిండి ఏ వాతావరణంలోనైనా, సీజన్లో అయినా మీరు తినవచ్చు.
మెరిసే ముఖానికి...
బెల్లంలో ఇనుము అధికంగా ఉంటుంది. రక్తం పెరిగేందుకు ఇవి చాలా అవసరం. రక్తం తగ్గితే చర్మం పేలవంగా మారుతుంది. వీటిని తినడం వల్ల చర్మం రంగు కూడా మెరుపును సంతరించుకుంటుంది. ముఖంపై ఉన్న మచ్చలు కూడా పోతాయి.
బరువు తగ్గేలా
వేయించిన శెనగలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. అదనపు కొవ్వును చేరకుండా కాపాడుతుంది. తద్వారా బరువు తగ్గేలా చేస్తుంది. వీటిని మితంగా తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.
మెదడుకు మంచిది
ఈ రెండింటిలో ఉండే పోషకాలు మెదడును బలోపేతం వచేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. విటమిన్ బి6 బెల్లంలో ఉండే ముఖ్యమైన పదార్థం. ఇది మనస్సును ఉత్తేజంగా మారుస్తుంది.
దంతాలు దృఢంగా
ఆహారం తినాలంటే దంతాలు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. శెనగలు, బెల్లం చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వీటిలో ఫాస్పరస్ ఉండడం వల్ల దంతాలు గట్టిగా మారుతాయి.
గుండె జబ్బులు
బెల్లంలో పొటాషియం ఉంటుంది. గుండె సమస్యలను దూరంగా చేయడంలో ఇది ముందుంటుంది. గుండె పోటు, హృదయ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది.
Also read: పోషకాల పాలకూర రైస్, పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ
Also read: మీ డైట్‌లో ఈ ఆరు సూపర్ ఫుడ్స్ చేర్చుకుంటే ఆరోగ్యానికి తిరుగే ఉండదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.