SuperFoods: మీ డైట్‌లో ఈ ఆరు సూపర్ ఫుడ్స్ చేర్చుకుంటే ఆరోగ్యానికి తిరుగే ఉండదు
ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా కొన్ని ఆహారపదార్థాలను తినాల్సిందే.
ఆరోగ్యం బావుండాలంటే బలవర్ధకమైన ఆహారానిదే ప్రధానపాత్ర. మంచి ఆహారం తినకుండా మీరెన్ని పనులు చేసినా ఆరోగ్యం పేలవంగా ఉంటుంది. మన శరీరంలోని ప్రతి అవయవానికి బలాన్ని, సౌష్టవాన్ని అందించే ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉండి సూపర్ ఫుడ్స్‌గా పేరు తెచ్చుకున్నాయి.ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు నిండుగా కలిగి ఉంటాయి. వీటిని తరచూ తింటుంటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా రాదు. మీరు ఇప్పటి నుంచి రోజూ లేదా రెండు రోజులకోసారి వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇప్పుడు మీరు తినడం మొదలుపెడితే ఆ ప్రభావం ఏళ్లు గడిచాక కచ్చితంగా కనిపిస్తుంది. వయసుతో పాటూ వచ్చే రోగాలేవీ దాడి చేయకుండా ఉంటాయి. అప్పుడు మీరు మాకు కచ్చితంగా థ్యాంక్స్ చెబుతారు.
అవిసె గింజలు
గోధుమ గింజలకన్నా చిన్నగా ఉంటాయి అవిసె గింజలు. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. శరీరానికి అవసరమయ్యే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో సహజ నూనె ఉత్పత్తిని పెంచుతాయి. చర్మాన్ని తేమవంతంగా ఉంచుతాయి. బరువు తగ్గడానికి సహాయపడే సూపర్ ఫుడ్ ఇది. వీటిలో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి గుండెకు చాలా మేలు చేస్తాయి. జుట్టు రాలే సమస్య కూడా ఆగిపోతుంది.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె మనం వంటల్లో వాడము కానీ, కేరళలో కొబ్బరి నూనెతోనే వండుతారు. ఇది అందాన్ని కూడా పెంచుతుంది. బరువు పెరగకుండా కాపాడుతుంది. అన్నం వండేటప్పుడు రెండు చుక్కల కొబ్బరి నూనె వేయడం వల్ల మధుమేహం ఉన్న వారు కూడా ఆ అన్నాన్ని తినవచ్చు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోజుకో స్పూనైనా వంటల్లో వాడుకోవడం ఉత్తమం.
బొప్పాయి
నిజంగా బొప్పాయి పండును సూపర్ ఫ్రూట్ అని పిలచుకోవాల్సిందే. దీనిలో పపైన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మం ముడతలు రాకుండా, గీతలు పడకుండా అడ్డుకుంటుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఇ అధికంగా ఉంటాయి. మధుమేహం, గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. మహిళలకు బొప్పాయి చాలా మంచిది. మీ రోగినిరోధక శక్తిని పెంచుతుంది.
క్వినోవా
క్వినోవా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. చర్మం ముడతలు, మచ్చలు పడకుండా కాపాడుతుంది. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. మొటిమలు కూడా రానివ్వదు.
కలబంద జెల్
బహుళ ప్రయోజనాలు అందించడంలో కలబంద కూడా మొదటిస్థానంలోనే ఉంటుంది. కలబంద జెల్‌ను రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు వంటివి రావు. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, గుండెల్లో మంట వంటివి తగ్గిపోతాయి. జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
ఆలివ్ నూనె
ఆలివ్ నూనె మధుమేహు రోగులకు ఎంతో మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. కొలెస్ట్రాల్, గుండె, జీర్ణ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆలివ్ నూనెతో వండుకునే వంటలు తినడం లేదా, కనీసం ఒక స్పూనైనా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఇది హైడ్రేటింట్ లక్షణాలతో పాటూ, యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. మీ జుట్టు, గోళ్లకు ఆలివ్ నూనె రాయడం వల్ల అవి మెరుస్తున్నట్టు మారతాయి. అలాగే ఆలివ్ నూనెను పెదవులకు రాసుకుంటూ ఉండాలి.
Also read: చెవి భాగంలో కనిపించే ఈ లక్షణం కూడా గుండెపోటుకు సంకేతమే
Also read: బియ్యపు నీళ్లతో శుభ్రం చేసుకుంటే నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? పట్టుకుచ్చులా మెరుస్తుందా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.