Heart Attack: చెవి భాగంలో కనిపించే ఈ లక్షణం కూడా గుండెపోటుకు సంకేతమే
గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని తేలికగా తీసుకోరాదు.
గుండెపోటు వయసుతో సంబంధం లేకుండా దాడి చేసి ప్రాణాలు తీస్తోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది గుండె పోటు వల్ల మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ప్రపంచంలో ప్రతి ఏటా సంభవిస్తున్న మరణాల్లో 31 శాతం గుండె వ్యాధుల వల్లే. ఈ గణాంకాలు చూస్తుంటే గుండెవ్యాధులు ఎంతగా జనాల ప్రాణాలు తీస్తున్నాయో అర్థమవుతుంది. యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం గుండెపోటు అధిక శాతం ఛాతీ మధ్యలో లేదా, ఎడమ వైపు నొప్పిని లేదా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఆ నొప్పి కొన్ని నిమిషాల నుంచి గంటల వరకు ఉంటుంది. ఒక్కోసారి తగ్గి మళ్లీ వస్తుంది. ఒత్తిడిగా అనిపించడం, గుండెను పిండినట్టు అనుభూతి కలుగుతుంది. బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. శరీరమంతా చెమట పట్టేస్తుంది. సాధారణంగా గుండె పోటు వచ్చినప్పుడు కలిగే లక్షణాలు ఇవన్నీ.
అమెరికాన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం గుండెపోటు లక్షణాలు స్త్రీలు, పురుషులకు వేరువేరుగా ఉంటాయి. అయితే ఇద్దరిలో ఒక లక్షణం మాత్రం కచ్చితంగా ఒకేలా ఉంటుంది. అది ఛాతీనొప్పి లేదా ఛాతీలో అసౌకర్యం. స్త్రీలలో శ్వాస అందకపోవడం, శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది పడడం, వాంతులు, వికారం, దవడ లాగడం లేదా నొప్పి పెట్టడం, వెన్నులో నొప్పి కూడా కనిపిస్తాయి.
చెవిలో లక్షణం...
గుండె పోటు చెవి ద్వారా కూడా సంకేతాన్ని పంపిస్తుంది. ఇది స్త్రీ,పురుషులు ఇద్దరిలో కనిపిస్తుంది. ఈ అసాధారణమన సంకేతాన్ని ‘ఫ్రాంక్స్ సైన్’ అని పిలుస్తారు. చెవి కింద మెత్తగా ఉండే ప్రాంతాన్ని ‘ఇయర్ లోబ్’ అంటారు. ఇక్కడే అమ్మాయిలు రంధ్రం చేసి చెవిరింగులు పెట్టుకుంటారు. ఈ లోబ్ కాస్త నొత్త పడినట్టు వంపు తిరిగి ఉన్నట్టు కనిపిస్తే గుండె పోటు వచ్చే అవకాశం ఉన్నట్టు భావించాలి. ఇయర్ లోబ్ ఆకారంలో మార్పు రావడం అనేది అకాల వృద్ధాప్యాన్ని సూచిస్తుంది. అలాగే చర్మ,గుండె సంబంధిత జబ్బులతో సంబంధం కలిగి ఉన్నట్టు ఆరోగ్య అధ్యయనాలు చెబుతున్నాయి.
వీరిలోనే ఎక్కువ...
మాయో క్లినిక్ చెప్పిన ప్రకారం గుండె పోటు వచ్చే అవకాశం 45 ఏళ్లకు మించిన వయసున్న మగవారిలో, 55 ఏళ్లు దాటినా ఆడవారిలో వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు కూడా గుండెపోటుకు గురయ్యే ఛాన్సులు ఎక్కువే. అలాగే అనారోగ్య ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం చేసేవారిలో, వ్యాయామం చేయని వారిలో, అధిక ఒత్తిడికి గురయ్యే వారిలో కూడా గుండె పోటు వచ్చే అవకాశం పెరుగుతుంది.
Also read: బియ్యపు నీళ్లతో శుభ్రం చేసుకుంటే నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? పట్టుకుచ్చులా మెరుస్తుందా?
Also read: మధుమేహం రాకుండా ఉండాలన్నా, వచ్చాక అదుపులో ఉండాలన్నా దివ్యౌషధం ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.