Pregnancy: ఈ ఆరు అలవాట్లు ఉంటే పిల్లలను కనడం కష్టమైపోతుంది
కొన్ని రకాల చెడు జీవన శైలి అలవాట్లు కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది.
ఎంతోమంది పెళ్లయ్యాక గర్భం ధరించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల గర్భం ధరించలేకపోతున్నారు. స్త్రీ పురుషులిద్దరూ అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగానే సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోతున్నారని వివరిస్తున్నారు వైద్యులు. కొన్ని రకాల అలవాట్లు ఉన్న వారిలో పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు.
ధూమపానం
ధూమపానం చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని అనుకుంటారు అది నిజమే. అంతేకాదు ఇది సంతానోత్పత్తి పై కూడా ప్రభావం చూపిస్తుంది. సిగరెట్ పొగలో శరీరానికి హానికరమైన 4,000 రకాలైన రసాయనాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు, గుండెపై మాత్రమే కాదు, పునరుత్పత్తి వ్యవస్థ పై కూడా ప్రభావం చూపిస్తాయి. పురుషులు, స్త్రీలలో పిల్లలు పుట్టకుండా వంధ్యత్వం బారిన పడేలా చేస్తాయి. పురుషుల్లో తక్కువ స్పెర్మ్ కౌంటుకు కారణం అవుతాయి. వీర్యకణాలు చురుగ్గా కదలకుండా చేస్తాయి. ఇక మహిళల్లో అండాల నాణ్యత పరిమాణంపై ప్రభావం చూపిస్తాయి. అండాల సంఖ్యను కూడా తగ్గిస్తాయి. గర్భం ధరించినా కూడా అబార్షన్ అయ్యే అవకాశాల్ని పెంచుతాయి. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండటం చాలా అవసరం.
వయస్సు
స్త్రీ గర్భం ధరించే వయస్సు కూడా గర్భధారణ పై ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే పురుషులు జీవితాంతం స్పెర్మ్‌ను ఉత్పత్తి చేయగలరు, కానీ స్త్రీలు మాత్రం నిర్ణీత సంఖ్యలో ఉన్న అండాలతోనే జన్మిస్తారు. పుట్టినప్పటి నుంచి వయసు పెరుగుతున్న కొద్దీ అండాల సంఖ్య తగ్గుతుంది కానీ పెరగవు, కాబట్టి అండాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డలను కనడం చాలా ముఖ్యం. ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు అండాశయంలో 20 లక్షల అండాలతో జన్మిస్తుంది. ప్రతి ఏడాది వీటి సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఆమెకు మొదటి పీరియడ్స్ వచ్చే సమయానికి అండాల సంఖ్య కేవలం నాలుగు లక్షలు మాత్రమే ఉంటాయి. ఇక 30 ఏళ్ల తర్వాత ఆ అండాల సంఖ్య ఇంకా తగ్గిపోతాయి. అందుకే 30 ఏళ్లలోపే పిల్లలను కనమని చెబుతున్నారు వైద్యుడు.
ఊబకాయం
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఊబకాయం. ఇది ఒక మహమ్మారి అని చెప్పుకోవచ్చు. BMW 25 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఊబకాయంగా చెబుతారు. ఊబకాయం ఉన్న స్త్రీలలో అండాల నాణ్యత తక్కువగా ఉంటుంది. అలాగే ఊబకాయం బారిన పడిన పురుషుల్లో కూడా వీర్యకణాల నాణ్యత తగ్గిపోతుంది. స్థూల కాయం శరీరంలోని హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది. అధిక రక్తపోటు, గర్భం రాక పోవడం, మధుమేహం వంటి సమస్యలకు కారణం అవుతుంది. పురుషులలో అంగస్తంభన వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారు సరైన BMIను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంటే ఎత్తుకు తగ్గ బరువుతో ఉండాల్సిన అవసరం ఉంది. అధిక బరువును తగ్గించుకోవాలి.
ఒత్తిడి
ఆధునిక కాలంలో కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అధిక ఒత్తిడికి, గర్భం ధరించడంలో ఇబ్బందులకు అవినాభావ సంబంధం ఉంది. అధిక ఒత్తిడి కారణంగా ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా విడుదలయితే మహిళల్లో అండోత్సర్గం సరిగా జరగదు. అలాగే పురుషుల్లో కూడా లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. అధిక ఒత్తిడి వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల గర్భం ధరించడం కష్టంగా మారుతుంది.
నిద్రలేమి
మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. శరీరంలోని కణజాలాలు, అవయవాలు సంపూర్ణ సామర్థ్యంతో పనిచేయాలంటే రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం. అప్పుడే వాటికే విశ్రాంతి దొరుకుతుంది. తగినంత నిద్ర ఉంటే ఎండోక్రైన్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మహిళల్లో ఎండోక్రైన్ వ్యవస్థ గర్భధారణకు అత్యవసరమైనది. నిద్రలేమి వల్ల పురుషులు, స్త్రీలలో హార్మోన్లు అసమతుల్యత రావచ్చు. దీనివల్ల గర్భం ధరించలేకపోవచ్చు.
Also read: మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఈ హెర్బల్ టీ తాగడం అలవాటు చేసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.