Sleep: అయిదు గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
నిద్రకు చాలా మంది తక్కువ విలువ ఇస్తారు. కానీ విలువ ఇవ్వాల్సిందే ఆహారానికి,నిద్రకు,వ్యాయామానికి.
పెరిగిన పనిగంటలు, ఒత్తిళ్లు కలిసి నిద్రపట్టనివ్వవు. పనుల కోసం నిద్రను త్యాగం చేసి అర్థరాత్రయిన బెడ్ మీదకు చేరని వాళ్లు ఎంతోమంది. పైగా తాము ఎంతో కష్టజీవులమని తమలో తామే ఫీలవుతుంటారు. ఇలా నిద్రను త్యాగం చేయడం వల్ల తమ ఆరోగ్యానికి తామే చిల్లు పెట్టుకుంటున్నట్టు లెక్క. కేవలం నాలుగైదు గంటలు నిద్రపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా అయిదు లేదా, అంతకన్నా తక్కువ సమయం నిద్ర పోవడం వల్ల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. కొత్త అధ్యయనంలో నిద్ర తక్కువవడం వల్ల కలిగే అనారోగ్యాలు బయటపడ్డాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోయి, ఆ ప్రభావం అన్ని అవయవాలపై పడుతుంది. అవయవాల పనితీరు కూడా మందగిస్తుంది.
ప్రమాదమే...
అన్ని వయసుల వారి నిద్ర సమయాలపై అంతర్జాతీయ అధ్యయనం సాగింది. ఇందులో పాతికేళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వయసు వరకు ఉన్న ఏడు వేల మంది పాల్గొన్నారు. ఈ అధ్యయనంలో ఎవరైతే అయిదు గంటల కన్నా తక్కువ నిద్రపోతారో వారిలో ఏవైనా రెండు ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా 50 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్నవారిలో నిద్ర తక్కువైతే ఈ వ్యాధులు త్వరగా వచ్చే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వయసు మధ్య ఉన్న స్త్రీ పురుషలిద్దరిలోనూ ఈ వ్యాధులు వస్తున్నట్టు గుర్తించారు.
యాభై ఏళ్ల వయసు ఉన్నవారిలో ఎవరైతే ఐదు గంటలు లేదా అంతకంటే తక్కువ నిద్రపోతున్నట్లు చెప్పారో వారు 20 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. అలాగే పాతికేళ్ల వయసులో అయిదు గంటల కన్నా తక్కువ నిద్రపోయిన వారిలో 40 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఇలా తక్కువ నిద్రపోవడం వల్ల వారిలో మరణ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.
అధిక ఆదాయ దేశాల్లో మల్టీమోర్బిడిటీ పెరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు. నిద్ర తగ్గిన వారిలో కచ్చితంగా రెండు ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని అంటున్నారు. అందుకే కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలకు నిద్ర తగ్గకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి హాని చేస్తాయి. కంటి నిండా నిద్ర, పోషకాహారం, వ్యాయామంతోనే ఆరోగ్యం లభిస్తుంది.
Also read: సముద్రగర్భంలో టైటానిక్ టూర్, ముప్పయ్యేళ్ల కష్టాన్ని ఖర్చు చేసి శిధిలాలను చూసి వచ్చిన మహిళ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.