Reduce Anxiety: ఒత్తిడిగా, ఆందోళనగా అనిపిస్తోందా? ఇలా సహజంగా తగ్గించుకునేందుకు ప్రయత్నించండి
ఆధునిక కాలంలో మానసికసమస్యలు అధికమైపోయాయి.
ఆందోళన, గుండె దడ, గాభరా, తీవ్రమైన ఒత్తిడి, ప్రశాంతంగా ఓ చోట కూర్చోలేకపోవడం, ఏదో జరిగిపోతుందనే ఆందోళన, యాంగ్జయిటీ... ఇవన్నీ ఆధునిక కాలంలో వచ్చి పడిన మానసిక సమస్యలు. గణాంకాల ప్రకారం ప్రపంచంలో 18 శాతం కంటే ఎక్కువ మంది మానసిక సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు. ఇవి ముదిరితే మానసికంగానే కాదు, శారీరకంగానూ సమస్యలు తప్పవు. మానసిక ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు దీర్ఘకాలికంగా శ్వాస ఆడకపోవడం, భయం, తలనొప్పి, టెన్షన్, గుండె వేగంగా కొట్టుకోవడం, పల్స్ వేగంగా కొట్టుకోవడం, ఛాతీ నొప్పి వంటి వాటికి గురవుతారు. వీటిని ఇలా వదిలేస్తే సమస్య చాలా ముదిరిపోతుంది. ఒత్తిడి కారణంగానే దాదాపు ఇలాంటి సమస్యలన్నీ కలుగుతాయి. వీటి లక్షణాలు అతిగా అనిపిస్తే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడిని సంప్రదించాక కూడా కొన్ని సహజమైన పద్ధతులను పాటిస్తే ఈ లక్షణాలను తగ్గించుకోవచ్చు. ఎలాగు వైద్యుడు ఇచ్చిన మందులు కూడా వాడతారు కాబట్టి, త్వరగా సమస్య తగ్గుముఖం పడుతుంది.
వ్యాయామం
ఒత్తిడి, మానసిక ఆందోళనల నుంచి త్వరగా బయటపడే మార్గం వ్యాయామం. ఇది కేలరీలను కరిగించడంలోనే కాదు, మానసిక శక్తిని పెంచడంలో కూడా ముందుంటుంది. ఇది శరీరంలో రక్తప్రవాహ వేగాన్ని నియంత్రించి ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. ప్రతి రోజూ కనీసం 30 నుంచి 40 నిమిషాలు వేగంగా నడవడమో లేక ఇతర వ్యాయామాలు చేస్తే మంచిది.
ధ్యానం
ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిది. ప్రతికూల ఆలోచనలను రాకుండా అడ్డుకుంటుంది. ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. రోజూ 15 నుంచి 20 నిమిషాలు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.
అరోమాథెరపీ
సువాసనగల నూనెలను తలకు, ఒంటికి మర్ధనా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి ఆందోళన స్థాయిని తగ్గిస్తుంది. ఉదాహరణకు లావెండర్ నూనె నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది.
హెర్బల్ టీ
ఔషధ టీలు తాగడం వల్ల ఆందోళన స్థాయిలు తగ్గుముఖం పడతాయి. చేమంతి పూలు, పుదీనా, తులసి వంటి హెర్బటీలు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు
ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఒత్తిడిని, యాంగ్జయిటీని తగ్గిస్తాయి. కాబట్టి అవి అధికంగా ఉండే సాల్మన్ చేపలు, టూనా చేపలు, అవిసె గింజలు, వాల్ నట్ లు తినేందుకు ప్రయత్నించాలి.
కెఫీన్ కట్
కాఫీలు తెగ తాగే అలవాటు ఉందా? అందులో ఉండే కెఫీన్ మానసిక సమస్యలను పెంచేస్తుంది. ఒత్తిడిని కూడా పెంచుతుంది. కాఫీ, టీ, ధూమపానం వంటివి మానివేస్తేనే మంచిది.
ఎప్సమ్ సాల్ట్
ఎప్సమ్ సాల్ట్ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని నీటిలో కలుపుకుని ఆ నీటితో తలకు స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఆందోళనను కూడా తగ్గిస్తుంది.
Also read: మంకీపాక్స్ వ్యాపిస్తోంది, ఆ వైరస్‌ను తట్టుకునేందుకు ఈ ఆహారాలను మెనూలో చేర్చుకోండి
Also read: ఇలా స్నానం చేయడం వల్ల అకస్మాత్తుగా గుండె పోటు వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.