Mental Health: మూడీగా ఉంటూ మనసులోనే మథన పడుతున్నారా? అయితే, ప్రమాదంలో పడినట్లే
వ్యక్తిగత విషయాలు, ఆరోగ్య సమస్యల గురించి ఓపెన్ గా మాట్లాడటానికి చాలా మంది భయపడతారు. అవి తమ మనసులోనే దాచుకుంటూ మూడీగా ఉంటారు. కానీ దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనలో చాలా మంది తమ ఆరోగ్య పరిస్థితులు బయటకి చెప్పేందుకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. తమలోనే దాచుకుంటూ మథన పడిపోతూ ఉంటారు. దాని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారు. తమలో ఉన్న ఆరోగ్య ఇబ్బందులు చెబితే ఎక్కడ ఎదుటి వారికి చులకనవుతామో, అందరూ చిన్న చూపు చూస్తారేమో, లోపాన్ని ఎత్తి చూపించి అవహేళనగా మాట్లాడతారో అని భయపడుతూ మూడీగా ఉండిపోతారు. ఇంట్లో పెద్ద వాళ్ళకి కూడా తమ బాధని చెప్పుకోవడానికి జంకుతారు. అటువంటి మనస్తత్వం కారణంగా లక్షలాది మంది తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నట్టు ఒక అధ్యయనం వెల్లడించింది.
ఈ సందర్భంగా నిపుణులు సుమారు 1,016 మంది పెద్దలపై ఈ అధ్యయనం జరిపారు. మానసిక ఆరోగ్యం, బరువు, వైకల్యం వంటి సమస్యలు బయటికి చెప్పుకోడానికి 36 శాతం మంది ఇబ్బంది పడినట్లు తేలింది. ఇక 18 శాతం మంది తమ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడానికి సుముఖంగా లేకుండా ఉన్నారు. ఇంకొంత మంది అయితే ఇతర వ్యక్తులని నమ్మడానికి అసలు ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు వేరే వ్యక్తులతో తమ విషయాలని పంచుకోవడం వల్ల వారి నుంచి వచ్చి ప్రతిస్పందన బాధకి గురి చేసింది. దాని వల్ల తమ సొంత విషయాలు ఇతరులతో పంచుకోవడానికి భయపడుతూ తమలోనే బాధ అనుభవిస్తున్నారు.
రుతుస్రావం, వృద్ధాప్య సమస్యలు, వ్యక్తిగత పరిశుభ్రత వంటి విషయాలు షేర్ చేసుకోవడానికి అసలు సుముఖత చూపించడం లేదు. కొంతమంది సెలబ్రెటీలు తమ ఆరోగ్య పరిస్థితులు స్వయంగా బహిరంగంగా చెప్పినప్పటికీ సాధారణ ప్రజలు మాత్రం వాటి గురించి సమాజంలో మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి మరింత మానసిక ప్రోత్సాహం అవసరం ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నోరు తెరిచి వారి సమస్యలు చెప్పుకోకపోవడం వల్ల వ్యాధి ఎక్కువ అవడం తప్ప వేరే ఎటువంటి ప్రయోజనం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. మానసిక లేదా శారీరక రుగ్మతలు భిన్నంగా ఉన్నప్పటికీ చికిత్స చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు.
వైద్య, సాంకేతిక పరంగా ప్రపంచం ఇంత అభివృద్ధి చెందినప్పటికి కొంతమంది మంది మాత్రం ఇంకా తమ ఆరోగ్య భయాలని వీడటం లేదు. దీని మీద ప్రభుత్వాలు, తోటి వ్యక్తులు, ఇంట్లో పెద్దలు తమ తోటి వారికి అర్థం అయ్యేలాగా పరిస్థితుల ప్రభావాన్ని వివరంగా చెప్పాలసిన బాధ్యత ఉంది. ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాటి మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తమ పరిస్థితి కారణంగా జీవితంలో ఎన్నో కోల్పోతున్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 12 శాతం మంది తమ పీరియడ్స్ కారణంగా స్కూల్ లేదా పనికి వెళ్ళకుండా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
సమస్యల నుంచి బయట పడలేక కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటువంటి పరస్థితి వల్ల వాళ్ళు డిప్రెషన్ కి గురై జీవితాన్నే కోల్పోతున్నారు. తమకి ఇష్టమైన వారితో మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల 23 శాతం మంది ఆందోళన నుంచి ఉపశమనం పొందగలిగారు. వాటిలో మూడవ శాతం మంది మానసిక నిపుణులతో మాట్లాడటానికి ఆసక్తి చూపించారు. తమ మనసులోని భావాలు, బాధని దాచుకోవడం వల్ల ప్రతి 20 మందిలో ఒకరు మృత్యువాత పడినట్లు కూడా తేలింది. రుతుస్రావం, మెనోపాజ్ వంటి విషయాల గురించి ఇప్పటికీ బహిరంగంగా మాట్లాడటాన్ని అవమానంగానే భావిస్తున్నారు. ఇలాంటి ధోరణి మారాలంటే చిన్నప్పటి నుంచే తల్లి దండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తూ వారితో ఓపెన్ గా మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: వామ్మో కళ్ళలో ఏకంగా 23 లెన్స్‌లు - వీటితో ఎన్ని అనర్థాలో తెలిస్తే నమ్మలేరు!
Also Read: బిర్యానీ ఆకు రుచే కాదు బోలెడు ఆరోగ్యాన్ని ఇస్తుందండోయ్