వ్యాధుల నివారణకు గుడ్డు వేరీ గుడ్డు, తినడం మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా?
గుడ్డు పోషకాల నిధి మాత్రమే కాదు ఇతర పౌష్టికాహారంతో పోలిస్తే చవక కూడా. వీటిని తీసుకోవడం కూడా సులభం.
గుడ్డు ఆరోగ్యానికి చాలామంచిది. కానీ, చాలామంది కొవ్వు పట్టేస్తుందనే భయంతో గుడ్డును ముట్టుకోరు. చెప్పాలంటే.. చికెన్, మటన్ చేయలేని పనులెన్నో గుడ్డు చేసేస్తోంది. మీ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి గుడ్డును చిన్న చూపు చూస్తే.. పెద్ద సమస్యలే వస్తాయి. ఎన్నో వ్యాధుల నుంచి రక్షించే గుడ్డును తీసుకోకపోతే.. ఆరోగ్యం హాంఫట్టే. అందుకే, గుడ్డు గురించి మీకు ఇప్పటివరకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ ఇస్తు్న్నాం. మిస్ కాకుండా చదివేయండి. వీలైతే ఇప్పటి నుంచే మీ డైట్‌లో గుడ్డును చేర్చుకోండి.
గుడ్డు లో ఏముందో తెలుసా?
⦿ గుడ్డు పోషకాల నిధి మాత్రమే కాదు, ఇతర పౌష్టికాహారంతో పోలిస్తే చవక కూడా. వీటిని తీసుకోవడం కూడా సులభం. గుడ్డును ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ ఏ సమయంలోనైనా గుడ్డును తినొచ్చు.
⦿ వీటిలోని పోషకాల వల్ల వీటికి భోజనంలో ఒక ప్రత్యేక స్థానం ఇవ్వవచ్చు. గుడ్డులోని పచ్చసొన మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇందులో బోలెడు విటమిన్స్, మినరల్స్‌తో నిండి ఉంటాయి. గుడ్డులో విటమిన్ సి, విటమిన్ బి3 మినహా మిగిలిన అన్ని పోషకాలు ఉంటాయి.
⦿ రోజూ ఆహారంలో గుడ్డు తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత చాలా కొద్ది సమయంలోనే మీరు శక్తి సంతరించుకోవడం మొదలు పెట్టినట్టు గమనించుకోవచ్చు.
మంచి ప్రొటీన్ సోర్స్
⦿ కండర పుష్టికి, ఎముకల బలానికి ప్రొటీన్ చాలా అవసరం. తగినంత ప్రొటీన్ తీసుకున్నపుడే పిల్లల్లో పెరుగుదల, కండరాలు బలాన్ని సంతరించుకోవడానికి చాలా అవసరం. గుడ్లలో చాలా మంచి ప్రొటీన్ రిసోర్స్.
⦿ గుడ్డు నుంచి లభ్యమయ్యే ప్రొటీన్ వల్ల బరువు కూడా పెరగదని న్యూట్రిషనిస్ట్‌లు తెలుపుతున్నారు. బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్డు తీసుకునే వారిలో పోషకాలు అందడమే కాదు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ వల్ల రోజంతా తీసుకునే ఆహారం ద్వారా వచ్చే కాలరీలు దాదాపు 400 వరకు తగ్గినట్టు ఒక అధ్యయనంలో తేలిందని ఆహార నిపుణులు అంటున్నారు.
⦿ కండలు పెంచుకోవాలని అనుకునే వారు కొన్ని ప్రత్యేక వర్కవుట్స్ తోపాటు ప్రొటీన్ ఇన్ టేక్ మీద ప్రత్యేక దృష్టి పెడతారు. ఇలాంటి వారికి గుడ్డు సహజమైన ప్రొటీన్ సోర్స్. పోస్ట్ వర్కవుట్ స్నాక్ తీసుకోవాలనుకునే వారు చక్కగా ఉడికించిన గుడ్డు తీసుకోవడం బావుంటుంది.
⦿ రెండు మీల్స్ మధ్య ఎక్కువ గ్యాప్ వచ్చినపుడు షుగర్ లెవెల్స్ లో తేడా రాకుండా ఉండడానికి ప్రొటీన్ కలిగిన స్నాక్ ఏదైనా తీసుకోవడం అనేది ఒక హెల్దీ ఆప్షన్. రెడీమేడ్‌గా దొరకే స్నాక్స్‌లో షుగర్స్ ఉంటాయి. కనుక వాటిని తీసుకోవడం వల్ల షుగర్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో గుడ్డు తినడం మంచిది.
⦿ గుడ్డులో విటమిన్ డి ఉంటుంది. ఇది చాలా రకాల అనారోగ్యాలతో పోరాడడానికి ఉపయోగపడుతుంది. రోజువారీ విటమిన్ డి అవసరంలో 29 శాతం కేవలం రెండు గుడ్లు తినడం ద్వారా శరీరానికి అందించవచ్చు.
⦿ చలికాలంలో విటమిన్-డి సప్లిమెంట్లు వాడుకోవడం తప్పనిసరి. విటమిన్-డి తగినంత లేకపోవడం అనేది గుండె జబ్బులు కొన్నిరకాల క్యాన్సర్లు, లేదా మల్టీపుల్ స్క్లీరోసిస్ వంటి రకరకాల అనారోగ్యాల కారణంగా కూడా కావచ్చు.
⦿ కొలైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుడ్డులో పుష్కలంగా ఉంటుంది. ఇది మెమొరీలాస్ అవకుండా నివారిస్తుంది. ఇది మాత్రమే కాదు వయసు పై బడుతున్న కొద్దీ వచ్చే మాక్యూలార్ డీజనరేషన్, కంటి చూపు కు రక్షణ ఇచ్చే జియాక్సథిన్, ల్యూటిన్ వంటి యాంటి ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.
నిరోధక శక్తికి
గుడ్డులో ఉండే పోషకాలు రోగనిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయి. ఏ,డి,ఇ తో పాటు జింక్, సెలెనియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవ్వన్నీ కూడా నిరోదక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. విటమిన్ , ఐరన్, జింక్, సెలెనియం ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీల ఉత్పత్తికి సహకరిస్తాయి.
మరి కొలెస్ట్రాల్?
గుడ్లతో కొవ్వు పెరుగుతుందనే భయం అక్కర్లేదు. ఆహార నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజూ గుడ్లు ఆహారంలో భాగం చేసుకునే వారు ఇతర పదార్థాలను కొంచెం తగ్గించి తీసుకోవాలి. గుడ్లు పరిమితికి మించి తినే వారిలో గుండె జబ్బుల ప్రమాదం ఉంటుంది. అయితే తీసుకునే భోజనంలో ఉండే కొలెస్ట్రాల్ కచ్చితంగా రక్తంలో కొలెస్ట్రాల్ పెంచుతుందని చెప్పలేం. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి ఇంకా చాలా పరిస్థితులు కారణమవుతాయి.
గుడ్డు తినండిలా
⦿ స్కాంబుల్డ్ ఎగ్స్‌ను పుట్టగొడుగులు, టమాటలతో కలిపి బ్రెడ్ టోస్ట్ తో తినొచ్చు.
⦿ గుడ్డును బేక్ చేసి టామోట సాస్‌తో తినొచ్చు
⦿ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక మంచి డిన్నర్ ఆప్షన్. అయితే ఇందులో తాజా కూరగాయలను కూడా కలుపుకుంటే మరింత ఆరోగ్యం రుచి కూడా.
⦿ ఉడికించి, ఆమ్లెట్ చేసి, స్క్రాంబుల్ చేసి, బేక్ చేసి, ఫ్రై చేసి ఎలా తిన్నా కూడా గుడ్డులోని పోషకాల్లో తేడా ఏమీ రాదు. కనుక నచ్చినట్టు గుడ్డు తినెయ్యండి.
Also read: ‘లివర్ సిర్రోసిస్’ అంటే ఏమిటీ? అది కాలేయ క్యాన్సర్‌గా మారకూడదంటే ఏం చేయాలి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.