Korralu Recipe: పోషకాలతో నిండిన కొర్రల ఎగ్ ఫ్రైడ్ రైస్, మధుమేహులతో పాటూ ఎవరైనా తినొచ్చు
రుచి కన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యానికి మేలు చేసే కొర్రల ఎగ్ రైస్ రెసిపీ ఇదిగో.
చైనీస్ ఫ్రైడ్ రైస్‌లు, పాలిష్ బియ్యంతో చేసిన బిర్యానీలే కాదు అప్పుడప్పుడు ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాలతో వండే వంటకాలు కూడా తినాలి. సిరిధాన్యాల్లో ఒకటిగా పిలిచే కొర్రలు మన శరీరానికి మేలు చేస్తాయి. వాటితో వండే వంటకాలు కూడా అనేకం ఉన్నాయి. కొర్రలను ఆంగ్లంలో ‘ఫాక్స్ టైల్ మిల్లెట్స్’ అంటారు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు కొర్రలు ఎంతో మేలు చేస్తాయి. కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అల్జీమర్స్ ఉన్నవారు వీటిని తినడం వల్ల సమస్య కాస్త తగ్గుముఖం పడుతుంది. మెదడును చురుకుగా ఉంచేందుకు దోహదం చేస్తుంది.
కొర్రలలో ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ మనకి చాలా అవసరమైన పోషకాలు. కండరాలను ఆరోగ్యంగా ఉంచి, ఆక్సిజన్ సరఫరా సక్రమంగా ఉండేలా చూస్తాయి. కొర్రలు తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇక కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. డయాబెటిస్ ఉన్న వారికి ఇది మేలైన ఆహారం. షుగర్ లెవెల్స్‌ను అదుపులోనే ఉంచుతుంది. మధుమేహం ఉన్న వారు సాధారణ అన్నానికి బదులు రోజూ కొర్రలను తినడం అలవాటు చేసుకుంటే మంచిది. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా కొర్రలు మేలు చేస్తాయి.
కావాల్సిన పదార్థాలు
కొర్రలు - ఒక కప్పు
గుడ్లు - రెండు
ఉల్లిపాయల తరుగు - అరకప్పు
టమాటా తరుగు - పావు కప్పు
అల్లం తరుగు - అర స్పూను
వెల్లుల్లి తరుగు - అరస్పూను
పచ్చిమిర్చి - రెండు
నూనె - సరిపడినంత
ఉప్పు - రుచికి సరిపడినంత
నీళ్లు - తగినన్ని
తయారీ ఇలా
1. వండడానికి ముందు కొర్రలను రెండు గంటల పాటూ నానబెట్టుకోవాలి.
2. నానబెట్టిన కొర్రలను కుక్కర్లో వేసి రెండు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి ఉడికించాలి. మూడు విజిల్స్ వచ్చాక ఆపేయాలి.
3. కుక్కర్లో నీళ్లు ఉండే ఓర్చేయాలి. కొర్రలను ఒక ప్లేటులో వేసి పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి.
4. కళాయిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక అల్లం, వెల్లుల్లి తరుగు వేయాలి.
5. అవి వేగి మంచి వాసన వస్తుంటాయి అప్పుడు గుడ్లు పగుల గొట్టి వేయాలి. బాగా కలిపి వేయించాలి. ఎగ్ బుర్జీలా అవుతుంది.
6. ఇప్పుడు అందులో కొర్ర అన్నాన్ని వేసుకుని కలుపుకోవాలి. అంతే కొర్రల ఎగ్ ప్రైడ్ రైస్ సిద్ధమైనట్టే.
Also read: చవకగా దొరికే ఈ పండుతో సులువుగా బరువు తగ్గొచ్చు, రోజుకో రెండు ముక్కలు తినండి చాలు
Also read: ఉదయాన లేచిన వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తే అది క్యాన్సర్ కావచ్చు, కొత్త అధ్యయన ఫలితం