Banana: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రోజుకో అరటి పండు లాగించేయండి
అరటిపండు అంటే ఇష్టం లేనిది ఎవరికి? ప్రతి ఇంట్లో కనిపించే పండు ఇదే.
అందరికీ అందుబాటు ధరలో ఉండే పండు అరటి పండే. అందుకే ప్రతి ఇళ్లల్లో ఇది కనిపిస్తుంది. కానీ దీన్ని చాలా మంది చులకనగా చూస్తారు. తినడానికి ఇష్టపడరు. నిజానికి రోజుకో అరటి పండు తింటే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని చెబుతోంది ఇక కొత్త అధ్యయనం. ఆరోగ్యాన్ని రక్షించడానికి అవసరమయ్యే పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్,ప్రొటీన్, బి6, విటమిన్ సి అధికంగా ఉంటాయి. అరటిపండ్లు తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా చాలా మేరకు తగ్గుతుంది.
పొటాషియం వల్లే..
అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఒక అరటి పండు తినడం వల్ల 455mg పొటాషియం ఉంటుంది. హృదయ స్పందన అనేది పొటాషియంపై ఆధారపడి ఉంటుంది. రక్తాన్ని పంప్ చేయడానికి గుండెక సహకరిస్తుంది. న్యూరాన్లు, కండరాల పనితీరును సులభతరం చేస్తుంది. రక్తం వడపోతలో మూత్రపిండాలకు సహాయపడుతుంది. శరీరంలో ద్రవాల స్థాయిలను నియంత్రించడంలో కూడా సహకరిస్తుంది.
కొత్త అధ్యయనం ప్రకారం...
అరటిపండు మన గుండెకు ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకునేందుకు పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఎలుకలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పొటాషియం తక్కువగా ఉండే ఆహారాన్ని వాటికి కొన్ని రోజుల పాటూ పెట్టి వాటి ధమనుల కాల్సిఫికేషన్, బృహద్ధమని దృఢత్వం అభివృద్ధి మధ్య సంబంధాన్ని కనుగొనేందుకు ప్రయత్నించారు.పొటాషియం తక్కువైన ఎలుకల్లో బృహత్ ధమని బలహీనంగా మారింది. ఏ ఎలుకలైతే పొటాషియాన్ని అధికంగా తిన్నాయో వాటి బృహత్ ధమని మాత్రం బలంగా ఉంది. ఇదే మనుషులకు వర్తిస్తుంది. అరటిపండు రోజూ తినేవారిలో గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
గుండెపోటును అడ్డుకుంటాయి
అరటపండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె పోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుందని పరిశోధన తేల్చింది. అరటిపండ్లు మాత్రమే కాదు పొటాషియం అధికంగా ఉండే ఇతర ఆహారాలను తినడం వల్ల కూడా ప్రాణాంతకమైన గుండె సమస్యలను రాకుండా అడ్డుకోవచ్చు. ఇవి ధమనులు గట్టిగా ఉండేలా, సంకోచించకుండా కాపాడతాయి. ఒక అరటిపండు తింటే మన శరీరానికి అవసరమైన పొటాషియంలో పది శాతం అందుతుంది. పొటాషియం తక్కువ తినేవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉంటుంది.
అరటి పండ్లు గుండె సంబంధిత ప్రమాదాలను తగ్గించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని కాపాడుతుంది. అరటిపండ్లలో ట్రిఫ్టోఫాన్ అనే అమినోయాసిడ్ ఉంటుంది. ఇదే జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది.
Also read: పచ్చి పాలు తాగడం సురక్షితమేనా? పచ్చిగా తాగడం వల్ల సమస్యలు వస్తాయా?
Also read: మగవారితో పోలిస్తే ఆడవారికే ఎక్కువ నిద్ర అవసరం, ఎందుకో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.