Coffee Benefits: రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే ఎన్నేళ్లు బతుకుతారో తెలుసా? ఇది మీరు ఊహించి ఉండరు!
మీరు రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే, తప్పకుండా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. కాఫీ తాగని వారు మాత్రం ఇది మిస్సవుతున్నట్లే.
Coffee | మీకు రోజూ కాఫీ తాగే అలవాటు ఉందా? రోజుకు ఎన్ని కప్పులు లాగిస్తుంటారు? ఇప్పుడు ఈ లెక్కలు ఎందుకు అనేగా మీ సందేహం. ఈ లెక్క వెనుకే ఒక సీక్రెట్ దాగి ఉంది. దాన్ని ఇటీవలే ఓ అధ్యయనంలో బయటపెట్టారు. ఇంతకీ ఏమిటా రహస్య అనుకుంటున్నారా? మాయల పకీరు ప్రాణం.. చిలుకలో ఉన్నట్లుగా.. మన ఆయుష్షు కూడా కాఫీలోనే ఉందట. మీ ఆయుష్షను మరో మూడేళ్లు బోనస్ కావాలంటే.. రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే చాలట. అర్థం కాలేదు కదూ.. అయితే, స్టడీలో ఏం చెప్పారో చూద్దాం.
ఒక అధ్యయనం ప్రకారం రోజుకు మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల మీ జీవితానికి సంవత్సరాలు బోనస్‌గా లభిస్తాయట. బ్రిటన్‌లో నిర్వహించిన ఓ స్టడీ ప్రకారం.. కాఫీ ఎక్కువగా తాగే యూకే ప్రజల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం 15 శాతం వరకు తక్కువగా ఉందట. కాఫీ బీన్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను పెంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, వాపులు, కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయని పరిశోధకులు తెలిపారు.
దీని ఆధారంగా మీ హృదయానికి కాఫీ మంచిదని తెలుస్తోంది. అలాగే, జంక్ ఫుడ్, స్మోకింగ్ వంటి దురలవాట్లు గల వ్యక్తులకు కూడా కాఫీతో ప్రయోజనాలు పొందవచ్చని స్టడీ వెల్లడించింది. మెల్‌బోర్న్‌లోని బేకర్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ పీటర్ కిస్ట్లర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘కాఫీ హార్ట్ బీట్‌ను పెంచుతుంది. కాబట్టి, అది గుండె సమస్యలను ప్రేరేపిస్తుంది లేదా మరింత తీవ్రతరం చేస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ, కాఫీ తాగడం వల్ల ఎటువంటి హాని జరగదని, గుండె ఆరోగ్యానికి కాఫీ ప్రయోజనాలతో సంబంధం ఉందని మేం తెలుసుకున్నాం’’ అని తెలిపారు.
Also Read: 21 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ అవయదాతలే, ఇందుకు ప్రత్యేక చట్టం - మీరు సిద్ధమేనా?
కాఫీ అలవాటు వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యల గురించి తెలుసుకోడానికి మూడు అధ్యయన బృందాలు గత పదేళ్లలో యూకేలోని 3.82 లక్షల మంది డేటాను పరిశీలించాయి. రోజుకు రెండు, మూడు కాఫీలు తాగే వ్యక్తులకు వివిధ ఆరోగ్య ప్రయోజనాలు లభించినట్లు తెలుసుకున్నారు. అయితే, కాఫీ అతిగా తాగేవారి కంటే.. రోజుకు సరాసరి ఒక కప్పు కాఫీ మాత్రమే తాగే వ్యక్తుల్లోనే కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ సమస్యలు అతి తక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నారు. డాక్టర్ క్లిస్ట్లర్ మాట్లాడుతూ.. ‘‘కాఫీ మెదడను చురుగ్గా, శరీరాన్ని యాక్టీవ్‌గా ఉంచుతుంది. మిమ్మల్ని మానసికంగా దృఢంగా ఉంచుతుంది. చాలామంది వ్యక్తల జీవితాల్లో ఇది చాలా ముఖ్యమైనది’’ అని తెలిపారు. అయితే, కాపీకి గుండె జబ్బులకు మధ్య సంబంధాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నట్లు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కాన్ఫరెన్స్‌లో నిపుణులు వెల్లడించారు.
Also Read: డయాబెటిస్ బాధితులకు ఈ సమ్మర్ పెద్ద సవాలే, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!
గమనిక: అధ్యయనంలో పేర్కొన్న వివరాలను ఈ కథనంలో యథావిధిగా అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు. గుండె సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పకుండా వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే కాఫీ తదితర ఆహారపానీయలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం వైద్యానికి ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు.