Milk: నిద్రపోయే ముందు పాలు తాగడం మంచిది కాదా? ఎప్పుడు పాలు తాగితే మంచిది
పాలు ఏ వేళలో తాగితే మంచిది. నిద్రపోయే ముందు పాలు తాగితే ఏమవుతుంది.
రాత్రి పూట నిద్రపోయే ముందు పాలు తాగడం మంచిది కాదా? అంటే కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందించే పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రాత్రి నిద్రపోయే ముందు తాగితే మాత్రం ఆరోగ్యానికి చెడు చేస్తుందని కాలిఫోర్నియాకి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ మాణికం చెప్తున్నారు. చిన్న పేగులో లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పాలలోని లాక్టోజ్, గ్లూకోజ్, గేలాక్టోస్ తో కలిసి సులభంగా గ్రహించబడుతుంది. ఈ లాక్టేజ్ ఎంజైన ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. 5 సంవత్సరాల కంటే వయస్సు ఎక్కువ ఉన్న వారి శరీరంలో లాక్టేజ్ ఉత్పత్తి తగ్గుతూనే ఉంటుంది. దాదాపు 30 సంవత్సరాల వయస్సులో లాక్టేజ్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. లాక్టేజ్ లేకపోవడం వల్ల పాలు నేరుగా పెద్ద పేగులకు చేరుకుంటాయి. అక్కడ ఉన్న బ్యాక్టీరియా అజీర్ణానికి కారణంఅవుతుంది.
ఒక వ్యక్తి పడుకునే ముందు పాలు తాగకూడదని ఆయన సలహా ఇస్తున్నారు. జీర్ణక్రియలో సమస్యలు ఉన్న వాళ్ళు అసలు పాలు తాగకూడదు. పాలు మంచి నిద్రని ప్రోత్సహించే మెలటోనిన్, సెరటోనిన్ విడుదల చేసే ట్రిప్టోఫాన్‌ను కలిగి ఉన్నప్పటికీ వాటిని తాగే సమయం వేరుగా ఉందని డాక్టర్ మాణికం అభిప్రాయం వ్యక్తం చేశారు. రాత్రి భోజనం తర్వాత పాలు తీసుకోవచ్చు. పడుకునే ముందు పాలు తాగడం వల్ల ఇన్సులిన్ విడుదల ప్రేరేపిస్తుంది. పాలలో ఉండే కార్బో హైడ్రేట్లు సిర్కాడియన్ రిథమ్ దెబ్బతీస్తుంది. ఒక వేళ పాలు తాగాలని అనుకుంటే నిద్రపోవడానికి 2 లేదా 3 గంటల ముందు తాగాలి. నిద్ర పోయే ముందు తాగడకూడదని వైద్యులు చెబుతున్నారు.
రాత్రిపూట పాలు తాగడం వల్ల ప్రోటీన్, పాల కొవ్వులు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటారు. ఒక గ్లాసు పాలలో దాదాపు 120 కేలరీలు ఉన్నాయి. రాత్రి వేళ పాలు తాగొద్దు అనడానికి మరొక ప్రధాన కారణం కూడా ఇది. ఎందుకంటే కేలరీలు సులభంగా కరిగిపోవు. దీని వల్ల బరువు పెరిగిపోతారు. రాత్రి వేళ కంటే పగటి వేళ పాలు తాగడం మంచిది.
పాలు తాగడం వల్ల ప్రయోజనాలు
పాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. ఎముకలు ధృడంగా మారేందుకు సహకరిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. విటమిన్ ఏ, బి 12, పొటాషియం, మెగ్నీషియం,జింక్, అయోడిన్ వంటివి పాల వల్ల లభిస్తాయి. అంతే కాదు రోజూ పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవు. జలుబు, గొంతు నొప్పిగా అనిపించినప్పుడు పాలల్లో కొద్దిగా పసుపు, మిరియాల పొడి వేసుకుని తాగితే త్వరిత ఉపశమనం లభిస్తుంది. పాల్లోని కాల్షియం, సోడియం, శరీరంలోని విష వ్యర్థాలని బయటకి పంపిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.