Snake Bite First Aid : పాము కరిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే, ఆ తప్పులు అస్సలు చేయకూడదు.. ప్రాణాలకే ప్రమాదమట
Snake Bite : పాము కరిస్తే ఆ ప్రాంతాన్ని గట్టిగా కట్టడం లేదా నోటితో విషాన్ని పీల్చడం చేస్తారు. ఈ రెండూ మంచిది కాదని.. ఈ మిస్టేక్స్ వల్ల ప్రాణాలకే ప్రమాదమని అంటున్నారు.

First Aid for Snake Bite : వర్షాకాలంలో వాననీరు పేరుకుపోవడం, వరదలు వంటివి రావడం జరుగుతాయి. ఆ సమయంలో టౌన్, విలేజ్ అనే తేడాలు లేకుండా పాములు సంచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పొలాలకు, అడవులకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. వర్షాలు, వరదలు వచ్చే సమయంలో పాములు కనిపించడం సాధారణమవుంది. ఆ సమయంలో కొందరు పాము కాటుకు గురవుతారు. అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రాణహాని జరగకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాము కాటు వేసినప్పుడు రక్త ప్రవాహాన్ని ఆపవద్దు
పాము కాటు వేసినప్పుడు చాలామంది ఆ ప్రాంతాన్ని గట్టిగా కట్టేస్తారు. ఇలా చేస్తే శరీరంలోని ఇతర అవయవాలకు విషం వ్యాపించకుండా ఉంటుందని చెప్తారు. చాలామంది దీనినే ఫాలో అవుతారు. అయితే ఇలా కట్టడం అస్సలు మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. MSD మాన్యువల్ (2025), WHO తాజా పరిశోధనల ప్రకారం.. ఈ పద్ధతి అస్సలు మంచిది కాదట. అంతేకాకుండా ఇది తీవ్రమైన ప్రమాదానికి దారితీస్తుందని చెప్తున్నారు.
రక్త ప్రవాహాన్ని ఆపడం వల్ల సమస్య
గట్టిగా కట్ట వల్ల రక్త ప్రవాహం పూర్తిగా నిలిచిపోయే ప్రమాదముంది. దీని వలన ప్రభావిత అవయవానికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఇది కణజాలాలకు తీవ్రమైన నష్టం (కణజాల నెక్రోసిస్) కలిగిస్తుంది. దీనివల్ల అవయవాన్ని తొలగించాల్సిన వస్తుంది. అలాగే గట్టిగా కట్టిన పట్టీని తీస్తున్నప్పుడు.. పేరుకుపోయిన విషం ఒకేసారి శరీరంలోకి వేగంగా వెళ్తుంది. దీనివల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. 2025 జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ చేసిన అధ్యయనంలో ఇలా పాము కాటుకు కట్టు కట్టిన 30 శాతం మందిపై రీసెర్చ్ చేసి.. రోగులలో ఆ అవయవాలు శాశ్వతంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అదే సమయంలో సరైన ప్రాథమిక చికిత్స చేసి.. యాంటివెనమ్ ఇవ్వడం ద్వారా రోగులలో 90 శాతం కంటే ఎక్కువ రికవరీ రేటు ఉన్నట్లు కనుగొన్నారు.
పాము కాటు చేయకూడని తప్పులివే
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాము కాటు వేస్తే.. ఆ ప్రాంతాన్ని గట్టిగా కట్టకూడదట. దీనివల్ల రక్త ప్రవాహాన్ని నిలిచిపోతుంది. అంతేకాకుండా అవయవానికి నష్టం కలిగిస్తుంది. అలాగే విషాన్ని నోటితో పీల్చడం కూడా మంచిది కాదు. దీనివల్ల నోటిలో విషం అంటుకుని ప్రమాదాన్ని పెరుగుతుంది. అలాగే పాటు కాటు వేసిన ప్రాంతాన్ని కోయడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే రక్తస్రావం పెరిగి, విషం వ్యాపిస్తుంది. అలాగే ఐస్ పెట్టడం వల్ల కూడా కణజాలాలు దెబ్బతింటాయి.
పాము కాటు వేసినప్పుడు ఇలా ప్రాథమిక చికిత్స చేయండి
మరి పాటు కాటు వేస్తే ప్రాథమిక చికిత్స ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారా? WHO మార్గదర్శకాల ప్రకారం.. పాము కాటు వేస్తే రోగి భయపడకుండా.. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే భయపడటం, ఎక్కువగా టెన్షన్ పడుతూ కదలడం వల్ల విషం వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలాగే వాపు రాకముందే ప్రభావిత అవయవానికి కట్టినవి తీసేయాలి. దీనివల్ల రక్త ప్రవాహం ఆగిపోకుండా ఉంటుంది. కాటు వేసిన ప్రదేశాన్ని సబ్బు, నీటితో నెమ్మదిగా శుభ్రం చేయాలి. కానీ రుద్దకూడదు. అలాగే వీలైనంత త్వరగా రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వైద్యులు యాంటివెనమ్ ఇవ్వడం లేదా ఇతర చికిత్సలు చేస్తారు.






















