Green Tea: గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ తప్పులు చేయకండి
గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ దాన్ని సరైన పద్ధతిలోనే తాగితేనే మేలు జరుగుతుంది.
ట్రెండు మారింది. ఎక్కువమంది కాఫీ, టీలు కన్నా గ్రీన్ టీని తాగడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎంతో సహాయపడుతుంది. అందుకే చాలామంది గ్రీన్ టీకే ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అయితే ఎంతో మందికి తెలియని విషయం గ్రీన్ టీ తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది బరువు తగ్గాలన్న ఆలోచనతో ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తున్నారు. రోజుకి నాలుగైదుసార్లు గ్రీన్ టీ తాగే వాళ్ళు కూడా ఉన్నారు. గ్రీన్ టీ తాగేందుకు ఒక పద్ధతి ఉంది. అలా ఫాలో అయితేనే ఈ టీ వల్ల కలిగే లాభాలన్నీ మన శరీరానికి అందుతాయి.
గ్రీన్ టీ తాగితే ఆరోగ్యకరమే, కానీ దాన్ని తాగాల్సిన సమయం వేరే ఉంది. పొట్ట నిండా భోజనం చేశాక చాలామంది గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఆహారంలో ఉండే ప్రోటీన్లను శరీరం శోషించుకోకుండా గ్రీన్ టీ అడ్డుకునే అవకాశం ఉంది. కాబట్టి భోజనం చేశాక ఎప్పుడూ గ్రీన్ టీ తాగవద్దు. అలాగే గ్రీన్ టీ తాగాక కనీసం గంట గ్యాప్ ఇచ్చాకే భోజనం చేయాలి. గ్రీన్ టీ తాగినప్పుడు గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. వేడిగా గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి అందే లాభాలు చాలా తక్కువ. అలాగని చల్లగా తాగిన పెద్దగా ఉపయోగం ఉండదు. గోరువెచ్చగా తాగితేనే బోలెడన్ని లాభాలు శరీరానికి అందుతాయి. ఎంతో మంది చేసే పని పరగడుపున ఖాళీ పొట్టతో గ్రీన్ టీ ను తాగేస్తూ ఉంటారు. ఇలా చేయడం చాలా తప్పు. ఖాళీ పొట్టతో గ్రీన్ టీ తాగడం వల్ల ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ చేసాక ఒక గంట గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ ని తాగడం ఉత్తమం. ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి భోజనం చేశాక వీటిని తాగడం ముఖ్యం.
గ్రీన్ టీ అంత రుచిగా ఉండదు. అందుకే ఎంతోమంది దాని రుచిని ఇష్టపడరు. అందుకే కొంతమంది గ్రీన్ టీలో తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతే. తేనె వల్ల కూడా ఆరోగ్యమే. అయితే గ్రీన్ టీ చాలా వేడిగా ఉన్నప్పుడు తేనే కలపకూడదు. అది గోరువెచ్చగా అయ్యాకే తేనె కలుపుకొని తాగితే మంచిది. గ్రీన్ టీ తాగేటప్పుడు ఎలాంటి ట్యాబ్లెట్లను వేసుకోకూడదు. ఒకవేళ వేసుకోవాల్సిస్తే కనీసం ఒక గంట గ్యాప్ ఇచ్చాకే వేసుకోవాలి. కొన్నిసార్లు టాబ్లెట్లు గ్రీన్ టీ కలిసి కొన్ని రసాయన మిశ్రమాలను సృష్టించవచ్చు. ఇది అనారోగ్యానికి కారణం అవుతాయి. కాబట్టి కేవలం నీటితోనే టాబ్లెట్లను వేసుకోవాలి.
గ్రీన్ టీ ఆరోగ్యకరమైనదే అయినా... దీనిలో కూడా కెఫిన్ ఉంటుంది. కాబట్టి రోజుకు రెండు కప్పులు కన్నా తాగకుండా ఉండడమే మంచిది. ఎక్కువ మంది నాలుగైదు కప్పులు తాగేస్తూ ఉంటారు. దీనివల్ల శరీరంలో కెఫీన్ అధికంగా పేరుకు పోతుంది. ఇది మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పుతోనే గ్రీన్ టీని సరిపెట్టుకోవాలి. గ్రీన్ టీని ఆదరాబాదరగా తాగితే ఉపయోగం ఉండదు. చాలా రిలాక్స్‌గా కూర్చుని సిప్ చేస్తూ ఉండాలి. ఇలా తాగడం వల్ల మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా, ప్రశాంతంగా ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. Gr