Menopause: అన్నం అధికంగా తింటే మహిళల్లో మెనోపాజ్ త్వరగా వచ్చేస్తుందా?
ఆహారానికి, మన శరీర క్రియలకు చాలా దగ్గర సంబంధం ఉందని మరోసారి రుజువైంది.
మనం తినే ఆహారమే శరీర ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆహారానికీ శరీరంలో వయసును బట్టి జరిగే మార్పులకు కూడా దగ్గర సంబంధం ఉన్నట్టు కొత్త అధ్యయనం తేల్చింది. అన్నం అధికంగా తినే మహిళల్లో మెనోపాజ్ దశ త్వరగానే వచ్చేస్తుందని యూకేలో నిర్వహించిన ఒక అధ్యయనం ద్వారా తెలుస్తోంది. అన్నమే కాదు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం తినే వారిలో మెనోపాజ్ కాస్త ముందస్తుగా వస్తుందని చెబుతోంది ఆ అధ్యయనం. దాదాపు 914 మంది మహిళలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అన్నం, పాస్తాలాంటి వాటిలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ మూడు పూటలా కార్బోహైడ్రేట్లు నిండిన ఆహారాన్ని తినడం వల్ల రావాల్సిన వయసు కంటే ఏడాదిన్నర ముందుగానే మెనోపాజ్ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రిఫైన్డ్ కార్బో హైడేట్లకు మెనోపాజ్ ను వేగవంతం చేసే గుణం అధికం.
అలాగే కొన్ని రకాల ఆహారాలు అధికంగా తినడం వల్ల మెనోపాజ్ చాలా ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఆయిలీ ఫిష్, పచ్చి బఠానీలు, బీన్స్ వంటివి అధికంగా తినేవారిలో ఈ మార్పు కనిపిస్తుంది. వారసత్వం కూడా దీనిపై ప్రభావం చూపిస్తుంది.తల్లి, అమ్మమ్మ, మేనత్తలు ఏ వయసులో మెనోపాజ్ కు గురవుతారో, వారి పిల్లలు కూడా అదే వయసులో అయ్యే అవకాశం ఉంది. ఈ అధ్యయనం వల్ల ఆహారానికి, మెనోపాజ్‌కు మధ్య ఉన్న సంబంధం బయటపడింది. ఆహారం వల్ల మెనో పాజ్ ముందే వస్తుందన్న విషయం తేలింది. ఆహారమొక్కటే మెనోపాజ్ ముందస్తుగా రావడానికి కారణమని చెప్పలేం, దీనికి ఇతర కారణాలు కూడా జత కావచ్చని చెబుతున్నారు పరిశోధకులు.
ఇవే రిస్క్...
మెనోపాజ్ ముందస్తుగా రావడం వల్ల, ఆలస్యంగా రావడం వల్ల కూడా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ముందస్తుగా వచ్చే మహిళల్లో ఆస్టియోపొరోసిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. అదే ఆలస్యంగా వచ్చే వారిలో రొమ్ము, అండాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.
ఆహారపు అలవాట్లు మార్చుకోవాలా?
ఈ అధ్యయనాన్ని బట్టి వెంటనే మహిళలు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని చెప్పలేం అంటున్నారు అధ్యయనకర్తలు. ఈ విషయంలో మరింత లోతైన అధ్యయనం అవసరం అంటున్నారు. కాకపోతే కార్బోహైడ్రేట్లు అధికంగా తినడం తగ్గించుకుంటే మంచిదేనని, బరువు కూడా త్వరగా పెరగరని చెబుతున్నారు.