ఆ దేశాన్ని వణికిస్తోన్న అంతుచిక్కని ఫంగల్ ఇన్ఫెక్షన్ - ఇది లైంగికంగానే సంక్రమిస్తోందట, జాగ్రత్త
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మొదటిసారిగా లైంగికంగా సంక్రమించే అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ బయటపడింది. దీని నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అరుదైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు. ఇది లైంగికంగా మాత్రమే సంక్రమిస్తుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. NYU లాంగోన్ హెల్త్‌కు చెందిన వైద్యులు JAMA డెర్మటాలజీ జర్నల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా ఈ అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ 30 ఏళ్ల వ్యక్తికి సోకినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అతడు ఇంగ్లండ్, గ్రీన్, కాలిఫోర్నియా దేశాల్లో పర్యటించాడని, ఆ సమయంలో చాలా మందితో అతడు లైంగికంగా కలిశాడని తెలిపారు. దీంతో అతడికి ఈ అరుదైన ఇన్ఫెక్షన్ సోకిందన్నారు.
13 కేసుల్లో 12 పురుషులకే
న్యూయార్క్‌కు తిరిగి వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి కాళ్లు, గజ్జలు, పిరుదుల మీద ఎరుపు రంగులో దద్దుర్లు, దురదతో బాధపడ్డాడు. దీంతో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాడు. ఈ టెస్టుల్లో లైంగికంగా సక్రమించే అరుదైన ఫంగస్ సోకినట్లు తేలింది. ట్రైకోఫైటన్ మెంటాగ్రోఫైట్స్ రకం VII ఉందని పరీక్షల్లో వెల్లడైంది. అమెరికాలో ఈ అరుదైన ఫంగస్ ను గుర్తించడం ఇది తొలిసారి. కాగా ఫ్రాన్స్ గత ఏడాది ఇలాంటి 13 కేసులు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. వీరిలో 12 మంది పురుషులే. వీరికి కూడా ఆ ఫంగస్ లైంగికంగానే సంక్రమించినట్లు తేలింది.
నాలుగున్నర నెలలు..
అయితే ఈ అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకిన అమెరికన్ వ్యక్తికి యాంటీ ఫంగల్ మందులను వాడటంతో ఈ ఇన్ఫెక్షన్ నయం అయ్యింది. కానీ పూర్తిగా తగ్గడానికి దాదాపు నాలుగున్నర నెలల సమయం పట్టిందని వైద్యులు వెల్లడించారు. లైంగికంగా సంక్రమించే వ్యాధులు, ఇన్ఫెక్షన్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని డెర్మటాలాజిస్టులు చెబుతున్నారు. మందులతో నయం అయ్యే ఈ వ్యాధులపట్ల ప్రజలను భయాందోళనకు గురిచేయడం సరికాదన్నారు.
లైంగికంగానే కాదు.. వీటి వల్ల కూడా సోకవచ్చు
ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ నిజంగా లైంగిక సంక్రమణ ద్వారా సోకిందనడానికి ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేవన్నారు వైద్యులు. చాలా వరకు లైంగిక సంపర్కం ద్వారానే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సంక్రమించే అవకాశం ఉన్నప్పటికీ.. ఆవిరి స్నానాల వల్ల కూడా ఈ ఫంగస్ సోకే అవకాశం ఉన్నట్లు తెలిపారు. లైంగిక భాగస్వాముల్లో ఎలాంటి రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ సంకేతాలు లేకపోవడం వల్ల ఈ విషయాన్ని తోసిపుచ్చారు. గజ్జల్లో వచ్చే సాధారణ రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ కంటే దద్దుర్లు, తామర మంటతో ఉంటుందన్నారు. ఈ లైంగిక ఫంగల్ ఇన్ఫెక్షన్ సంక్రమణ ప్రాణాంతకం కానప్పటికీ.. ఫంగస్ సోకిన ప్రదేశంలో ఏర్పడిన మచ్చలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
ఎన్‌బిసి న్యూస్‌లోని ఒక నివేదిక ప్రకారం, అతను 2023లో ట్రైకోఫైటన్ ఇండోటినీ వల్ల సంభవించిన విభిన్న రింగ్‌వార్మ్ ఇన్‌ఫెక్షన్ మొదటి రెండు కేసులను ముందే గుర్తించారు. ఇవి STIలుగా పరిగణించలేదు. అప్పటి నుంచి, NYU లాంగోన్ హెల్త్‌లోని కాప్లాన్ బృందం న్యూయార్క్ నగరంలో పురుషులు, స్త్రీలలో ట్రైకోఫైటన్ ఇండోటినీ రింగ్‌వార్మ్ మొత్తం 11 కేసులను గుర్తించింది. ప్రస్తుతానికి, ట్రైకోఫైటన్ మెంటాగ్రోఫైట్స్ రకం VII చికిత్స అందుబాటులో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Read Also: నాన్‌వెజ్ ఎక్కువగా తింటున్నారా? అయితే మీ లివర్ మటాషే.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు