ఐరన్ మాత్రలు మింగుతున్నారా? అవి ఎప్పుడు వేసుకుంటే సమర్థంగా పనిచేస్తాయో తెలుసా?
ఆహారం ద్వారా సరైన పోషకాలు అందనప్పుడు వాటిని సప్లిమెంట్ల రూపంలో ఇస్తున్నారు వైద్యులు.
పోషకాహారలోపం పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా పెరిగిపోతోంది. జంక్ ఫుడ్‌కు దగ్గరై ఆరోగ్యకరమైన ఆహారానికి దూరమైన పెద్దలు విటమిన్లు, ఖనిజాల లోపానికి గురవుతున్నారు. వారికి సప్లిమెంట్లు రాసిస్తున్నారు వైద్యులు.అయితే అవి ఎప్పుడెప్పుడు వేసుకుంటే సమర్థంగా పనిచేస్తాయో తెలుసుకోండి.
ఐరన్
మన శరీరానికి ఇనుము అత్యవసరం. అది తగ్గితే రక్తహీనత సమస్య వస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఐరన్ చాలా అవసరం. అయితే ఐరన్ ట్యాబ్లెట్లు ఎప్పుడుపడితే అప్పుడు వేసుకుంటే ఫలితం ఉండదు. పరగడుపున నీటితో మింగితే చాలా మంచిది. లేదా నిమ్మరసంతో వేసుకున్నా మంచి ఫలితాలే వస్తాయి. ఐరన్ మాత్రలు, విటమిన్ సి కలిస్తే శరీరం ఆ సప్లిమెంట్లను త్వరగా శోషించుకుంటుంది. అయితే ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నాక క్యాల్షయిం ట్యాబ్లెట్ వేసుకోకూడదు. అలాగే పాలు, పెరుగు వంటివి తినకూడదు. ఎందుకంటే క్యాల్షియం శరీరం ఐరన్‌ను గ్రహించకుండా అడ్డుపడుతుంది.
విటమిన్ ఏ
విటమిన్ ఏ శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్. అనేక రకాల ఆహారాల్లో ఇది దొరుకుతుంది. రోజుకో క్యారెట్ తిన్నా కూడా శరీరానికి కావాల్సిన విటమిన్ ఏ అందుతుంది. ఆ పని కూడా చేయడం లేదు చాలా మంది. అయితే విటమిన్ ఏ ట్యాబ్లెట్లు గర్భిణులు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. డోసు అధికంగా తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు లోపాలు ఏర్పడవచ్చు. వీరు పదివేల ఐయూ కన్నా ఎక్కువ డోసు వేసుకోకూడదు. పొగ తాగే వారు కూడా విటమిన్ ఏ అధికంగా తీసుకోకూడదు. అలా చేస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
బి విటమిన్లు
ఇవన్నీ నీటిలో కరిగేవి విటమిన్లు. వీటిని రోజూ తీసుకోవాలి. ఇందులో ముఖ్యమైనది బీ12. ఇది లోపిస్తే మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. దీన్ని ఆహారంతో పాటూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. శరీరం వెంటనే గ్రహిస్తుంది. అయితే బి12 వేసుకునేటప్పుడు విటమిన్ సి తీసుకోకూడదు. ఈ రెండింటి మధ్య కనీసం రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే బి12ను శరీరం గ్రహించకుడా విటమిన్ సి అడ్డుపడుతుంది.
ఇలా సప్లిమెంట్ల రూపంలో తీసుకునే కన్నా ఆహార రూపంలోనే పోషకాలు తీసుకోవడం అన్ని విధాలా ఉత్తమం. ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తింటే చాలు శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా వరకు అందుతాయి. నట్స్, సీడ్స్ తినడం కూడా అవసరం.
Also read: ఒత్తిడి లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందా? అలాంటప్పుడు ఏం చేయాలి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.