Ayurvedam: గాయాలు, దెబ్బలు త్వరగా తగ్గాలా? ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి
చిన్న చిన్న గాయాలు తగలడం సహజమే. అవి త్వరగా తగ్గాలంటే ఇలా చేయండి.
పిల్లలు ఆడుకుంటూ పడిపోవడం లేదా పెద్దలు పనిచేస్తున్నప్పుడు ఏదైనా గీరుకు పోవడం వంటివి జరుగుతూనే ఉంటాయి. ఆ గాయాలను అలా వదిలేస్తే ఇన్ఫెక్షన్ల బారినపడి చిన్న గాయం కూడా తీవ్రంగా మారొచ్చు. కాబట్టి దానికి కచ్చితంగా ప్రధమ చికిత్స చేయడం అవసరం. ముఖ్యంగా అది పెద్దది కాకుండా చూసుకోవాలి. ఇలా గాయాలు, కోతలు తగిలినప్పుడు ఆయుర్వేదం చాలా సింపుల్ చిట్కాలను చెబుతోంది. వాటి ద్వారా ఆ గాయాలను త్వరగా తగ్గేలా చేసుకోవచ్చు. వాటికి ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా, సెప్టిక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఆ గాయాలను మానేలా చేసుకోవచ్చు.
ప్రతి వంటింట్లో పసుపు కచ్చితంగా ఉంటుంది. ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఈ కర్కుమిన్ అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. గాయాలు తగిలిన చోట పసుపును అద్దండి. ఇది వాపు, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఎలాంటి బాక్టీరియా, వైరస్ అక్కడ చేరకుండా త్వరగా తగ్గేలా చేస్తుంది.
ప్రతి ఇంట్లో కొబ్బరి నూనె ఉండడం సహజం. గాయాల నుండి రక్తస్రావం అవుతున్నప్పుడు కొబ్బరి నూనెను గాయం పై వేయండి. ఇలా చేయడం వల్ల రక్తస్రావం తగ్గడమే కాదు. దుమ్ము, మురికి వంటివి గాయం పైన పడకుండా ఈ నూనె అడ్డుకుంటుంది. కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువ. ఇవి ఇన్ఫెక్షన్ల నుండి గాయాలను కాపాడతాయి. కాబట్టి గాయం త్వరగా తగ్గిపోతుంది.
వేప ఆకుల్లో కూడా క్రిమినాశక గుణాలు ఎక్కువ. వేప ఆకుల పేస్టును గాయాలకు అప్లై చేయడం ద్వారా వాటికి ఇన్ఫెక్షన్ల సోకకుండా జాగ్రత్త పడొచ్చు. అలాగే ఈ వేప... నొప్పిని తగ్గించడంలో కూడా ముందు ఉంటుంది. గాయాలు, మచ్చలు కూడా పడకుండా వేప కాపాడుతుంది.
టీ ట్రీ ఆయిల్ అనేది మార్కెట్లలో దొరుకుతుంది. దీనికి యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు అధికం ఈ గాయాలకు టీ ట్రీ ఆయిల్ రాయడం వల్ల అవి అక్కడ చేరిన బ్యాక్టీరియా, వైరస్‌లను చంపేస్తాయి. సెప్టిక్, సెప్సిస్ అయ్యే అవకాశాలను తగ్గిస్తాయి.
గాయాలు తగిలినప్పుడు వాటిని అలా వదిలేయకుండా పైన ఆయుర్వేదం చెప్పిన చిట్కాలను పాటించి, అవి త్వరగా తగ్గేలా జాగ్రత్త పడండి. లేకుంటే ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు.
Also read: జాగ్రత్త పడండి, పెరిగిపోతున్న మధుమేహం కేసులు - భవిష్యత్తులో 130 కోట్ల మందికి డయాబెటిస్