Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?
ధనియాల పొడి అనగానే కూరల్లో చల్లుకునేదే అనుకుంటారు చాలా మంది. కానీ అన్నంలో కలుపుకుని తినేలా చేసుకోవచ్చు.
ధనియాల పొడిని టేస్టీగా చేసుకుంటే ఇడ్లీకి కారంపొడి జతలా దీన్ని కూడా తినవచ్చు. ధనియాల పొడి అనగానే కూరల్లో, సాంబారులో వేసుకునేదే అనుకుంటారు. కానీ అన్నంలో కలుపుకుని తినేలా, ఇడ్లీకి, దోశెకి జతగా దీన్ని వాడుకోవచ్చు. ధనియాలు ఎంత ఆరోగ్యమో అందరికీ తెలిసిందే. అనేక చర్మ సమస్యలకు ధనియాలలోని సుగుణాలు చెక్ పెడతాయి. చర్మంపై దురదలు, వాపులను, దద్దుర్లు లాంటివి రాకుండా అడ్డుకుంటాయి. దీనిలో లినోలీయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో ఇనఫ్లమ్మేషన్ ను తగ్గిస్తుంది. అంతేకాదు మధుమేహం ఉన్న వారు రోజూ ధనియాల పొడి తింటే చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. శరీరం ఆ ఇన్సులిన్ గ్రహించేలా మేలు చేస్తుంది. కాబట్టి డయాబెటిక్ రోగులు తమ ఆహారంలో ధనియాల పొడిని తినడం చాలా అవసరం. హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి బారిన పడిన వారు కూడా ధనియాల పొడిని రోజూ తినడం చాలా అవసరం. అందానికి కూడా ఇది మేలు చేస్తుంది. చర్మం, జట్టు ఆరోగ్యంగా మారుతుంది. అన్నం తినే ముందు రెండు మద్దలు ఈ పొడితో తింటే చాలు. బోలెడంత ఆరోగ్యం.
కావాల్సిన పదార్థాలు
ధనియాలు - వంద గ్రాములు
ఎండుమిర్చి - పది
శెనగపప్పు - ఒక టీస్పూను
మినపప్పు - ఒక టీస్పూను
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడినంత
నూనె - సరిపడినంత
వెల్లుల్లి - పది రెబ్బలు
తయారీ ఇలా...
1. ధనియాల పొడి చేయడం ఎంత సులువో. స్టవ్ మీద కళాయి పెట్టాలి. ఒక స్పూనె నూనె వేయాలి.
2. నూనె వేడెక్కాక తరువాత ధనియాలు వేసి వేయించాలి. అందులోనే ఎండు మిరపకాయలు కూడా వేసి వేయించాలి.
3. అలాగే శెనగపప్పు, మినపప్పు కూడా వేసి వేయించాలి.
4. ఏవీ మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోతే రుచి మారిపోతుంది.
5. ఆ మిశ్రమం వేడి తగ్గాక మిక్సీలో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి, చిటికెడు పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి చేయాలి.
6. గాలి చొరబడని కంటైనర్లలో వేసి దాచి పెట్టుకోవాలి. రోజుకు రెండు ముద్దలు ఈ పొడితో తింటే చాలా ఆరోగ్యం.
Also read: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే