Sleeping Pills: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే
నిద్రలేమి సమస్య దేశంలో భారీగా పెరిగిపోతోంది. ఈ సమస్యకు స్లీపింగ్ పిల్స్ సరైన పరిష్కారమా?
నిద్రలేమితో బాధపడుతున్న జనాభా సంఖ్య పెరిగిపోతోంది. దాదాపు 10 నుంచి 30 శాతం మందిలో ప్రస్తుతం నిద్రపట్టకపోవడం అనేది కనిపిస్తోంది. అందులో రెండు శాతం మంది మాత్రమే వైద్యుల వద్దకు వెళ్లి తమ సమస్యకు పరిష్కారాన్ని కోరుతున్నారు. నిద్ర లేమి వల్ల ఊబకాయం, రక్తపోటు, మధుమేహం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. పెరిగిన ఒత్తిడి, కుటుంబ సమస్యలు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా నిద్రలేమికి కారణం అవతాయి. వ్యక్తి వ్యక్తికి మధ్య నిద్రలేమి కలగడానికి కారణాలు వేరువేరుగా ఉంటుంది. అయితే నిద్రలేమికి మందు కేవలం నిద్రమాత్రలేనా? నిద్రమాత్రలు ఎంత కాలం వాడొచ్చు? అధిక కాలం పాటూ వాడితే ఏమవుతుంది?
ఎవరికి ఇస్తారు?
ఒత్తిడి కారణంగా నిద్రలేమి బారిన పడిన వారికి, యాంగ్జయిటీ వంటి మానసిక ఆందోళనల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి స్లీపింగ్స్ పిల్స్ ను రాస్తారు. ఎన్ని రోజులు వాడాలో కూడా చెబుతారు. కానీ చాలా మంది ఆ ప్రిస్క్రిప్షన్ తో నెలల తరబడి వాడుతున్నారు. అంతేకాదు నిద్ర లేమి సమస్య ఉన్న తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా వాటిని సూచిస్తున్నారు. ఇలా వైద్యుడిని కలవకుండా నిద్రమాత్రలు మింగడం చాలా ప్రమాదం.
ఎంత కాలం వాడొచ్చు?
నిద్ర మాత్రలు రెండు వారాల నుంచి నెల రోజుల వరకు మాత్రమే వినియోగించాలి. ఎక్కువ రోజులు వినియోగించడం వల్ల వాటికి బానిస అయ్యే అవకాశం ఉంది. అంటే కేవలం ఆ మాత్రలు వేసుకుంటేనే నిద్ర వచ్చే పరిస్థితులకు దారితీస్తుంది. నిద్రలేమిని కేవలం నిద్రమాత్రలతోనే కాదు, యోగా, ధ్యానం, సాత్వికాహారం, పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగితే చాలా మంచిది. నిద్రలేమి సమస్య త్వరగానే తగ్గుతుంది. అధికంగా వాడడం వల్ల కొంతమందిలో మైకం కమ్మినట్టు అవ్వడం, తరచూ తలనొప్పి రావడం, మలబద్ధకం, డయేరియా, నాడీ సంబంధిత సమస్యలు, కండరాల బలహీనత, లైంగిక ఆసక్తి తగ్గడం వంటివి కలుగుతాయి.
ఆరోగ్యకరమైన వ్యక్తి నిద్రతో పోలిస్తే స్లీపింగ్ పిల్స్ వాడిన వారు ప్రశాంతంగా నిద్రపోతారన్నది కేవలం అపోహ. ఆరోగ్యకరమైన వ్యక్తి నిద్రలో జారడానికి పట్టే సమయం కన్నా స్లీపింగ్స్ పిల్స్ వాడే వ్యక్తి త్వరగా జారుకుంటాడు. అంతకుమించి ఈ మాత్రలు వాడడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. పైగా నష్టాలే. కాబట్టి ఆరోగ్యంగా తయారవ్వడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
Also read: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’
Also Read: మానసికంగా కుంగిపోతున్నారా? మీ హ్యాపీ హార్మోన్ సరిగా పనిచేయడం లేదేమో