Dussehra Special Sweets Recipes : దసరా స్పెషల్ స్వీట్స్.. ఇంట్లోనే చక్కగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీలు ఇవే
Festival Special Recipes : దసరా సమయంలో ఇంట్లో చాలామంది ట్రెడీషనల్ స్వీట్స్ చేసుకుంటారు. అయితే ఈ సారి లడ్డూలకు బదులుగా డిఫరెంట్ స్వీట్స్ ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీలు ఫాలో అయిపోండి.

Vijayadashami Special Sweets : దసరా(Dussehra)ను విజయదశమి అని కూడా పిలుస్తారు. ఈ పండుగను 2025లో అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. దసరా చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఈ పండుగ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలుపడంతో పాటు.. దసరా అనేది ఒకచోట చేరడం.. ఆనందం, సాంప్రదాయ వంటకాలను రిప్రెజెంట్ చేస్తుంది. అందుకే ఈ సమయంలో చాలామంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సమయాన్ని కేటాయిస్తారు. స్వీట్స్ చేసుకుని ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు. అయితే దసరా సమయంలో నోరూరించే స్వీట్స్ ఎలా చేసుకోవచ్చో.. వాటి రెసిపీలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
శ్రీఖండ్
గుజరాత్, మహారాష్ట్రలో దసరా సమయంలో దీనిని కచ్చితంగా తయారు చేసుకుంటారు. కేసర్ శ్రీఖండ్ చేయడం చాలా ఈజీ. ముందుగా పెరుగు తీసుకుని దానిలోని నీరు తీసేయాలి. ఓ గుడ్డలో పెరుగు చుట్టి.. నీరు పోయాక.. దానిని ఫ్రిడ్జ్‌లో రెండు గంటలు పెట్టాలి. అనంతరం ఓ గిన్నెలోకి తీసుకుని దానిలో పంచదార పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. అది పేస్ట్‌గా మారిన తర్వాత కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి మరోసారి బాగా కలపాలి. అంతే టేస్టీ శ్రీఖండ్ డిజెర్ట్ రెడీ. దీని బంగారు రంగు, మృదువైన ఆకృతి ఫెస్టివల్ సమయంలో బెస్ట్ డిజెర్ట్గా నిలుస్తుంది.
కొబ్బరి లడ్డు
(Image Source: freepik)
కొబ్బరి లడ్డూలు కూడా దసరా, దీపావళి సమయంలో ఎక్కువగా చేసుకుంటారు. రుచికి కూడా అద్భుతంగా ఉంటాయి. కొబ్బరి, బెల్లాన్ని తురుమి.. రెండింటీని కలిపి.. ఉడికించాలి. పాకంలో ఉడికి.. మిశ్రమం దగ్గరకి అవుతున్నప్పుడు దించేయాలి. చేతులకు నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని లడ్డూలుగా ఒత్తుకోవాలి. అంతే టేస్టీ కొబ్బిరి లడ్డూలు రెడీ.
గులాబ్ జామున్
(Image Source: Canva)
గులాబ్ జామున్ లేకుండా ఏ ఫెస్టివల్ పూర్తి కాదు. దాదాపు అందరూ వీటిని చేసుకుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఈ టేస్టీ డిజెర్ట్ని ఇంట్లో చేసుకోవడం చాలా తేలిక. ముందుగా గులాబ్ జామున్ మిక్స్‌ని పాలతో కలుపుకోవాలి. మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన పెట్టి.. తర్వాత చిన్న చిన్న ఉండలుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టి.. వేగాక దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న బాల్స్ వేయాలి. మరోవైపు షుగర్ సిరప్ చేసుకోవాలి. దానిలో కాస్త యాలకుల పొడి వేసుకోవచ్చు. గులాబ్ జామున్స్ వేగిన తర్వాత.. వాటిని షుగర్ సిరప్‌లో వేసుకోవాలి. కాసేపు వదిలేస్తే అవి పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. అంతే నోటిలో ఇట్టే కరిగిపోయే గులాబ్ జామున్స్ రెడీ.
రబిడి
(Image Source: Pinterest/ HomeDecoration1995)
రిచ్, క్రీము, మంచి రుచిని ఇచ్చే రబిడి కూడా ఓ డెజర్ట్‌గా చేసుకోవచ్చు. దీనిని చేసుకోవడం కూడా చాలా తేలిక. పైగా ఇది మీ టేబుల్‌పై గ్రాండ్ లుక్‌ని తీసుకొస్తుంది. ముందుగా పాలను మరిగించుకోవాలి. దానిలో బాదం, పిస్తా, జీడిపప్పు వేయాలి. రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఓ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేయాలి. పాలతో ఈ మిశ్రమాన్ని జారుగా కలుపుకోవాలి. అలాగే మరో చిన్న గిన్నెలో ఓ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి పాలతో కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలో ముందుగా కలిపిన గోధుమ పిండి మిశ్రమాన్ని వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అలాగే ఓ కప్పు షుగర్ వేసి కరగనిస్తూ కలపాలి. దానిలో కస్టర్డ్ మిక్స్ వేసి కలిపిన తర్వాత ఉడికించాలి. మిశ్రమం దగ్గరకు అయ్యాక యాలకుల పొడి వేసికలిపి స్టౌవ్ ఆపేయాలి. అంతే టేస్టీ టేస్టీ రబిడి రెడీ.
కాజు కట్లీ
కాజు కట్లీలను చాలామంది ఇష్టంగా తింటారు. జీడిపప్పు పేస్ట్‌తో తయారు చేయగలిగే ఈ స్వీట్ చాలామందికి ఫేవరెట్. ఈ పండుగ సమయంలో మీరు కచ్చితంగా వీటిని కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా జీడిపప్పును ఓ రెండు గంటలు నానబెట్టుకోవాలి. అనంతరం దానిని మిక్సీ చేసుకుని.. దానిలో షుగర్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమం దగ్గర అయ్యేవరకు అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి. ముద్దగా మారిన తర్వాత.. దానిని తీసి.. చపాతీగా లావుగా ఒత్తుకోవాలి. దానిపై సిల్వర్ పేపర్ వేసి.. మీకు నచ్చి షేప్స్‌లో కట్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కాజు కట్లీ రెడీ.
ఈ స్వీట్స్ మీరు తినడం కోసమే కాదు.. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి గిఫ్ట్ చేసేందుకు కూడా అనువైనవి. పైగా వీటిని చాలా సింపుల్‌గా ఇంట్లో చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ పండుగ సమయంలో ఇంట్లో వీటిని చేసి.. ఇంటిల్లీపాదికి పెట్టేయండి.






















