బాదుషాను ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే కొన్ని పదార్థాలు కచ్చితంగా కావాలి. అవేంటంటే..

అరకప్పు మైదా, పావు కప్పు నెయ్యి, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు, చిటికెడు బేకింగ్ సోడా, నీరు కలపడానికి సరిపడా ఉండాలి.

వేయించడానికి నూనె, పంచదార 1 కప్పు, నీరు అరకప్పు, యాలకుల పొడి అర టీస్పూన్, నిమ్మరసం చిటికెడు.

ముందుగా గిన్నెలో మైదా, బేకింగ్ సోడా, నెయ్యి, పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో నీరు వేయాలి.

పిండి అంటుకోకుండా, సాఫ్ట్​గా, ఉండలు లేకుండా కలపి పావు గంట పక్కన పెట్టేయాలి.

పిండిని చిన్న ఉండలుగా చేసి.. కాస్త పొడుగ్గా వత్తి.. మధ్యలో చేతితో నొక్కుతూ బాదుషా రూపంలో చేసుకోవాలి.

డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్​ని మీడియం మంటపై వేడి చేయాలి. నూనె బాగా వేడిగా ఉంటే లోపల ఉడకదని గుర్తించుకోవాలి.

బాదుషాలను నూనెలో వేసి.. చిన్నగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక బయటకు తీసేయాలి.

ఓ పాన్​లో కప్పు షుగర్, అరకప్పు నీరు వేసుకోవాలి. అది కాస్త పాకంలా వచ్చాక దానిలో యాలకుల పొడి, నిమ్మరసం వేసి ఆపేయాలి.

బాదుషాలను వాటిలో వేసి నాననివ్వాలి. వేడి వేడి బాదుషాలను వెచ్చని సిరప్​లో వేసుకుంటే మంచిది.

అంతే టేస్టీ టేస్టీ బాదుషాలు రెడీ. వీటిని మీరు స్పెషల్ అకేషన్​లో చేసుకోవచ్చు.