Prostate Cancer: అబ్బాయిలూ జాగ్రత్త.. పాలతో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు? ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
మీరు పాలు ఎక్కువగా తాగుతారా? మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, జాగ్రత్త అది ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు.
మహిళలతో పోల్చితే.. పురుషుల్లో క్యాన్సర్ ముప్పు తక్కువే. అయితే, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల పురుషులు కూడా వివిధ రకాల క్యాన్సర్లకు గురవ్వుతున్నారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate Cancer)పురుషులకు పెద్ద గండంగా మారింది. ఎందుకంటే.. దీని లక్షణాలు అంత సులభంగా భయపడవు. పైగా.. ఏయే కారణాల వల్ల ఈ క్యాన్సర్ వస్తుందనే విషయం మీద కూడా స్పష్టత లేదు. అయితే, పురుషులు ఎలాంటి చిన్న మూత్ర సంబంధిత సమస్య ఉన్నా వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. అయితే, కొన్ని ఆహారాల వల్ల కూడా పురుషులకు Prostate Cancer ముప్పు ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
ప్రోస్టేట్ అంటే వీర్యగ్రంథి. అందులో ఏదైనా కణుతులు ఏర్పడితే అవి క్యాన్సర్‌గా ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ప్రచురితమైన ‘ఎపిడెమియోలాజికల్ రివ్యూస్’లో పేర్కొన్న వివరాల ప్రకారం.. పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకొనే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate Cancer) ముప్పు రెండితలు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, పాల ఉత్పత్తుల్లో ఏ సమ్మేళనం క్యాన్సర్‌కు దారి తీస్తుందనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అయితే, ఇటీవల జరిపిన ఓ అధ్యయనాల్లో.. కాల్షియం, ఫాస్ఫరస్‌లు ముఖ్యమైన కారణమని తెలిసింది. అలాగే, పాలల్లో ఉండే కొవ్వు కూడా పురుషులకు ప్రమాదకరమైనది భావించారు.
2019లో అమెరికా శాస్త్రవేత్తలు ఒక మిలియన్ కంటే ఎక్కువమంది పురుషుల ఆహారపు అలవాట్లను పరిశీలించిన 47 అధ్యయనాల డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా పాలు, చీజ్, వెన్న, పెరుగు వంటి పాల ఉత్పత్తులను క్రమం తప్పకుండా తీసుకునే వారికి ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate Cancer) వచ్చే అవకాశం 7 నుంచి 76 శాతం వరకు ఉన్నట్లు తెలుసుకున్నారు. పాల ఉత్పత్తులు కాల్షియం, గ్రోత్ హార్మోన్ స్థాయిలను పెంచుతాయని, వీటి వల్ల ప్రోస్టేట్ కణితులు ఏర్పడే ప్రమాదం ఉందని భావించారు. అయితే, యూకేకు చెందిన ఓ క్యాన్సర్ పరిశోధక సంస్థ స్పందిస్తూ.. పాల ఉత్పత్తులు ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ప్రత్యక్షంగా కారణమవుతుందా, లేదా అనేది పరిశోధనల్లో నిరూపించబడలేదని స్పష్టం చేసింది. ఇందుకు తగిన సాక్ష్యాలు అవసరమని పేర్కొంది.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త:
⦿ కొన్ని డయబెటీస్ లక్షణాలు ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate Cancer) బాధితుల్లోనూ కనిపిస్తాయి.
⦿ ముఖ్యంగా రాత్రిపూట అతిగా మూత్రం వస్తుంది.
⦿ పదే పదే టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుంది.
⦿ మూత్ర విసర్జన చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది.
⦿ మూత్రం చాలా నెమ్మదిగా పడుతుంది. (ధార బలహీనంగా ఉంటుంది).
⦿ మూత్రాన్ని విసర్జించేందుకు ఎక్కువ ఒత్తిడి పెట్టాల్సి వస్తుంది.
⦿ మూత్రాశయం నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
⦿ ప్రోస్టేట్ క్యాన్సర్ ముదిరిన తర్వాతే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభంలో కనిపెట్టడం కష్టం.
⦿ ఎముక, వెన్ను, లేదా వృషణాల నొప్పి, ఆకలి లేకపోవటం క్యాన్సర్‌కు సంకేతం.
⦿ అకస్మాత్తుగా బరువు తగ్గుతున్నా సరే క్యాన్సర్‌గా అనుమానించాలి.
⦿ ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate Cancer)ను మొదట్లోనే కనిపెట్టినా.. వెంటనే చికిత్స అవసరం లేదు.
⦿ రేడియోథెరపీ, హార్మోన్ థెరపీని శస్త్రచికిత్స ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స చేస్తారు.
ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate Cancer)ను ముందుగా కనుగొంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ క్యాన్సర్ సోకినా ఎక్కువ కాలం జీవిస్తారు. అయితే, క్యాన్సర్‌ను గుర్తించని వ్యక్తులకు అది ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
గమనిక: వివిధ అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. అందులో పేర్కొన్న అంశాలతో ‘ఏబీపీ దేశం, ఏబీపీ నెట్‌వర్క్’కు ఎటువంటి సంబంధం లేదని గమనించగలరు.