Hong Kong: హాంకాంగ్ టూర్ కు వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే, మీరు ఉచితంగా విమాన టికెట్లు పొందవచ్చు!
పర్యాటకులను ఆకర్షించేందుకు హాంకాంగ్ సర్కారు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 5 లక్షల కాంప్లిమెంటరీ విమాన టిక్కెట్లను ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
కరోనా కారణంగా ఇంత కాలం కఠిన ఆంక్షలను విధించిన హాంకాంగ్ సర్కారు.. తాజాగా వాటిని సడలించింది. ఈ నేపథ్యంలోనే పర్యాటక రంగానికి మరింత బూస్టింగ్ ఇచ్చే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 254.8 మిలియన్ డాలర్ల విలువైన 500,000 విమాన టిక్కెట్‌లను పర్యాటకులకు ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించింది.
వాస్తవానికి కరోనా ఆంక్షలు తొలగించినా, అనుకున్న స్థాయిలో పర్యాటకులు హాంకాంగ్ కు రావడం లేదు. పూర్తి స్థాయిలో కరోనా అంతం కాలేదనే భావనతో పాటు ఉక్రెయిన్ వివాదం కారణంగా పర్యాటకులు ఇక్కడికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. విమాన సంస్థలు కూడా ఇప్పుడిప్పుడే తమ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, గతంలో మాదిరిగా ప్రయాణీకులు రావడం లేదు. ఉక్రెయిన్ వివాదం కూడా పర్యాటకులు రాకపోవడానికి మరో కారణం. ఈ సమస్యల కారణంగా హాంకాంగ్ లో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు బ్రిటిష్ ఎయిర్ లైన్ వర్జిన్ అట్లాంటిక్ తాజాగా ప్రకటించింది. ఆసియా ఏవియేషన్ హబ్ లో 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న వర్జిన్ అట్లాంటిక్ తన హాంకాంగ్ ప్రధాన కార్యాలయాన్ని మూసివేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. లండన్- హీత్రూ మధ్య విమానాలను ఆపరేట్ చేయనున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో ఎలాగైనా హాంకాంగ్ లో పర్యటక రంగానికి పూర్వ వైభవం తెచ్చే దిశగా అక్కడి ప్రభుత్వం మమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే కాంప్లిమెంటరీ విమాన టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నది. తాజాగా హాంకాంగ్ టూరిజం బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేన్ చెంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. " ప్రభుత్వం ఇన్ బౌండ్ ప్రయాణికుల కోసం అన్ని కోవిడ్-19 ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మేం పర్యాటక రంగాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే విమానాశ్రయ సంస్థ, ఎయిర్ లైన్స్ సంస్థలతో మాట్లాడి కాంపిమెంటరీ టికెట్లు అందించే ప్రయత్నం చేస్తుంది. కరోనా సమయంలో హాంకాంగ్ ఎయిర్ లైన్స్ కు సహాయం చేయడానికి కొనుగోలు చేసిన కాంప్లిమెంటరీ టిక్కెట్‌లను ఎయిర్ పోర్ట్ అథారిటీ.. ఇన్ బౌండ్, అవుట్ బౌండ్ ప్రయాణికులకు ఇప్పుడు అందజేస్తుంది” అని వెల్లడించారు.
చైనా జీరో కోవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండటం వలన, హాంకాంగ్ ఇటీవలి వరకు కొన్ని కఠినమైన ఆంక్షలను కొనసాగించింది. తాజాగా ఈ ఆంక్షలను సడలించింది. హాంకాంగ్ కు వచ్చే సందర్శకులు హోటల్ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. కోవిడ్ పరీక్ష పత్రాలను చూపించాల్సి అవసరం లేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఉచిత విమాన టికెట్ల ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో పర్యాటకులు హాంకాంగ్ కు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. విమానాల ప్రయాణాలకు సైతం డిమాండ్ పెరుగుతుందట. మొత్తంగా హాంకాంగ్ సర్కారు ప్రయత్నాలు సరైన ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పుకోవచ్చు.
Also Read: ప్రపంచంలో గురుత్వాకర్షణ పని చేయని వింత ప్రదేశాలు ఇవే, గాల్లో తేలినట్లే!
Also Read: పెంపుడు కుక్కల స్థానంలో రోబోటిక్ డాగ్స్, చైనాలో నయా ట్రెండ్! ఎందుకలా?