CMR College Issue: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ
Medchal News: సంచలనం రేపిన సీఎంఆర్ కాలేజీ వివాదంలో మరో మలుపు తిరిగింది. మూడు రోజుల పాటు కాలేజీకి యాజమాన్యం సెలవులు ప్రకటించింది.
CMR College Issue:తెలంగాణ సంచనలంగా మారిన సీఎంఆర్ కాలేజీ హాస్టల్‌లో వీడియోల చిత్రీకరణ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్‌లో దొరికిన ఫింగర్ ప్రింట్స్, అనుమానితుల వేలి ముద్రలను మ్యాచ్ చేస్తూ ఎంక్వయిరీ చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజీ హాస్టల్ నెలకొన్న వివాదం ఎంత సంచలనంగా మారిందో చెప్పనవసరం లేదు. జనవరి 1 రాత్రి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. బాత్రూమ్‌లో స్నానాలు చేస్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు వీడియోలు తీశారనే ప్రచారం ఆందర్నీ పరుగులు పెట్టించింది. అప్పటికే అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసులు చెప్పినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు. విద్యార్థి సంఘాలతో కలిసి కాలేజీ ముందు ధర్నాలు చేశారు.
విద్యార్థుల ధర్నాలతో వివాదం మరింత ముదురుతోందని గ్రహించిన సీఎంఆర్ కాలేజీ యాజమాన్యం సెలవులు ప్రకటించింది. మూడు రోజుల పాటు కాలేజీలకు సెలవులు ప్రకటించి హాస్టల్ ఖాళీ చేయించింది. పరిస్థితి చక్కబడిన తర్వాత పునః ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇంతలో కేసు విచారణ పూర్తి చేసి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఏంటని తేల్చేయాలని పోలీసులు చూస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. స్పాట్‌లో ఉన్న వేలి ముద్రలతో ఈ అనుమానితుల వేలి ముద్రలను కూడా సరిపోలుస్తున్నారు. అరెస్టు అయిన వారిలో హాస్టల్ వార్డెన్ కూడా ఉన్నారు.
హాస్టల్‌లో బాత్రూమ్ వెంటిలేటర్ల నుంచి వీడియోలు షూట్ చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 31 ఘటన జరిగిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని జనవరి 1 అర్థరాత్రి నుంచి ధర్నా చేస్తున్నారు. కొందర్ని అదుపులోకి తీసుకున్నామని అసలు వాస్తవమేంటో తేల్చేస్తామని పోలీలసులు చెప్పారు. ఉదయానికల్లా అసలు నిందితులను అరెస్టు చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే అనుకున్నట్టుగా ఉదయానికి పోలీసులు అప్‌డేట్ ఇవ్వకపోయేసరికి మళ్లీ ధర్నా చేశారు. దీంతో పోలీసులు హాస్టల్ వార్డెన్ సహా మరికొందర్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విద్యార్థులు శాంతించారు. ఇది మరింత ఉద్ధృతం కాకుండా ఉండేందుకు కాలేజీ యాజమాన్యం సెలవులు ప్రకటించింది.