Caffeine: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్
కాఫీ ఎక్కువ మొత్తంలో తాగితే అందులో ఉండే కెఫీన్ కూడా అధిక మోతాదులో శరీరంలో చేరుతుంది. దీని వల్ల చాల సమస్యలు ఎదురవుతాయి.
ఆహారం అంటే కేవలం తినేవి మాత్రమే కాదు, తాగేవి కూడా. మనం తాగే ద్రావకాలు కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా గుండె, జీవక్రియలపైనే ప్రభావం కనిపిస్తుంది. మనదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బులు పెరిగిపోతున్నాయి. అందుకే నిత్యం గుండె జబ్బుల విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. గుండెకు హానికలిగించే ప్రతివిషయాన్ని పరిశోధకులు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో కొత్త విషయాన్ని చెప్పింది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. కాఫీ అతిగా తాగిన వారి హృదయ స్పందనల్లో తేడా వస్తున్నట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కు చెందిన పరిశోధకులు తేల్చారు.
ఆల్కహాల్ మాత్రమే కీడు చేస్తుందని అనుకుంటారు చాలా మంది. మోతాదుకు మించి తాగితే కాఫీ కూడా గుండెకు ప్రమాదకారిగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు కాఫీతోనే తమ రోజును మొదలుపెడతారు. దాన్ని తప్పుబట్టడం లేదు పరిశోధకులు. మితంగా తాగితే కాఫీ ఎంతో ప్రయోజనకారి అని కూడా చెబుతున్నారు. రోజుకు రెండు కప్పుల కాఫీకే పరిమితం కావలని సలహా ఇస్తున్నారు.
అంతకు మించి తాగిన వారిలో కొన్నాళ్లకు గుండె కొట్టుకునే వేగంలో తేడా రావొచ్చని అంటున్నారు. ఈ అధ్యయనం కోసం 38 వయస్సు గల 100 మందిపై పరిశోధన సాగింది. వీరందరికీ రోజూ అధికంగా కాఫీని ఇచ్చి తాగమని చెప్పారు. కొన్ని రోజుల పాటూ ఇలా చేశారు. ఆ తరువాత వారి హార్ట్ బీట్ ను పరిశీలించారు. 54 శాతం మందిలో స్పందనల రేటు పెరిగినట్టు కనుగొన్నారు.
భయం అవసరం లేదు...
కాఫీలో ఉండే కెఫీన్ సరైన మోతాదులో శరీరంలో చేరితే ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అధికంగా చేరితే మాత్రం ఇలా గుండె సమస్యలకు దారితీయచ్చు. కాఫీ అధికంగా తాగుతున్న వారిలో ఇప్పటికే హార్ట్ బీట్ లో తేడా వచ్చి ఉండచ్చు. అయితే వీటికి చికిత్స అవసరం లేదు. కాఫీ తాగడం తగ్గించేస్తే తిరిగి గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. ఎందుకంటే గుండెపై కెఫీన్ ప్రభావం దీర్ఘకాలికంగా ఉండదు.
రోజుకు రెండు కప్పులతో కాఫీని సరిపెట్టుకుంటే ఎంతో ఆరోగ్యం. దీని వల్ల శక్తి పెరుగుతుంది, కొవ్వు కరుగుతుంది, డిప్రెషన్ దరిచేరదు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది, కాలేయాని కాపాడుతుంది.... ఇలా చాలా లాభాలు ఉన్నాయి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also read: భార్య పుట్టినరోజు మర్చిపోతే నేరమే, అరెస్టు కూడా తప్పకపోవచ్చు, ఎక్కడంటే...
Also read: సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్ల కోసం ఈ డేటింగ్ యాప్, ఎంత మంది సభ్యులున్నారంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి