Child Nutrition Tips : పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా లేదా? అయితే కారణం ఇదే కావొచ్చు.. తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
Healthy Diet for Kids : మైక్రోన్యూట్రెంట్స్ పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు కీలకమని చెప్తున్నారు నిపుణులు. వీటి లోపం వల్ల కలిగే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫుడ్స్ ఏంటో చూసేద్దాం.

Micronutrients for Child Growth : పిల్లల్లో పెరుగుదల కేలరీలపై ఆధారపడి ఉండదని.. పోషకాహారంతో కూడిన ఆహారమే వారి గ్రోత్‌కి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అందుకే పిల్లలకు ఎలాంటి పోషకాలు అందిస్తున్నామనేది పేరెంట్స్ తెలుసుకోవాలంటున్నారు. వారికి పెట్టే ఆహారం విషయంలో కచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలంటున్నారు డాక్టర్ కుశల్ అగర్వాల్. ఎందుకంటే పిల్లల పెరుగుదలకు మైక్రోన్యూట్రెంట్స్ చాలా ముఖ్యమట. విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మపోషకాలు కలిగిన ఫుడ్స్ ఇవ్వడం అవశ్యకమని చెప్తున్నారు. ఇవి పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిని పెంపొందించడంలో హెల్ప్ చేస్తాయని చెప్తున్నారు. వీటిని అందించకుంటే వారిపై చాలా ప్రభావం ఉంటుందని.. వాటి ఎఫెక్ట్ దీర్ఘకాలం ఉంటుందంటున్నారు కుశల్.
మైక్రోన్యూట్రెంట్స్ ఎందుకు ముఖ్యమంటే..
సూక్ష్మపోషకాలు (Micronutrients) ఎముకలను బలంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో, ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో మంచి ఫలితాలు ఇస్తాయి. శరీరంలో లెక్కలేనన్ని రసాయన ప్రతిచర్యలకు మద్దతు ఇస్తాయి. పిల్లలు వేగంగా పెరిగే వయసులో పోషకాహార లోపం లేకుండా పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.
ఐరన్, కాల్షియం, విటమిన్ డి, జింక్, అయోడిన్, విటమిన్ ఎ, బి విటమిన్ వంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి అంది మంచి పెరుగుదలకు దోహదం చేస్తాయి. వీటిలో ఒక్కటి లోపించినా.. అది ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంతో పాటు.. రోగనిరోధక శక్తిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతేకాకుండా పిల్లలు నీరసంగా ఉంటారు. చురుకుగా అస్సలు ఉండలేరు.
పిల్లలలో సాధారణ లోపాలు
పిల్లలకు మైక్రోన్యూట్రెంట్స్ అందించకుంటే సహజంగా కొన్ని లోపాలు వస్తాయి. దీనివల్ల వారిలో కొన్ని సమస్యలు కనిపిస్తాయి. ఆ సమస్యలు ఏంటో.. వేటివల్ల అవి వస్తాయో చూసేద్దాం.
- ఐరన్ లోపం : ఎదిగే పిల్లల్లో ఎక్కువగా కనిపించే లోపం ఇది. తగినంత ఐరన్ అందకుంటే... పిల్లల్లో రక్తహీనత వస్తుంది. దీనివల్ల అలసట, పాలిపోవడం, ఏకాగ్రత లేకపోవడం, దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తిపై ప్రభావం పడడం జరుగుతాయి.
- విటమిన్ డి, కాల్షియం లోపం : ఎముకలు, దంతాలకు విటమిన్ డి, కాల్షియం అవసరం. వీటి లోపం ఉంటే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. భంగిమ సరిగ్గా ఉండదు. ఎక్కువ దూరం నడవలేరు. నెమ్మదిగా నడుస్తారు. తక్కువ సూర్యరశ్మి, ఎక్కువ ఇంట్లోనే ఉండడం కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది.
- జింక్ లోపం : జింక్ పిల్లల పెరుగుదల, గాయం నయం చేయడానికి చాలా అవసరం. జింక్ లోపం ఉన్న పిల్లలు నెమ్మదిగా పెరుగుతారు. తరచుగా అనారోగ్యానికి గురవుతారు.
- విటమిన్ ఎ లోపం : కంటి చూపును రక్షించడానికి విటమిన్ ఎ చాలా అవసరం. ఇది రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. దీని లోపం ఉంటే కంటి చూపు మందగించడంతో పాటు.. తట్టు, అతిసారం వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.
- అయోడిన్ లోపం : థైరాయిడ్ పనితీరు, మెదడు అభివృద్ధికి అవసరం. స్వల్ప లోపం కూడా IQ, అభిజ్ఞా పనితీరును ప్రభావితం చేస్తుంది.
లోపాలను ఇలా గుర్తించండి..
మైక్రోన్యూట్రెంట్స్ లోపాలు ఉంటే పిల్లల్లో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. తరచుగా జలుబు చేయడం, త్వరగా అలసిపోవడం, తోటివారితో పోలిస్తే పెరుగుదల నెమ్మదిగా ఉండడం జరుగుతుంది. గోళ్లు పెళుసుగా మారి జుట్టు పొడిబారిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్లోని ఈ సంకేతాలను విస్మరించకండి. ఎందుకంటే వీటిని ముందుగా గుర్తించకుంటే ఇవి మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా మారవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
ఈ సమస్యలు గుర్తిస్తే తల్లిదండ్రులు కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందంటున్నారు పీడియాట్రిక్ డాక్టర్ కుశల్ అగర్వాల్. పిల్లలకు ఎంత తినిపిస్తున్నామని కాకుండా.. వారికి పెట్టే ఆహారాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, మిల్లేట్స్, పాల ఉత్పత్తులు, ప్రోటీన్లతో నిండిన ఆహారం మైక్రోన్యూట్రెంట్స్తో నిండి ఉంటుంది అంటున్నారు.
పిల్లలకు పెట్టాల్సిన ఆహారాలివే
గుడ్లు, చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు పిల్లల పెరుగుదలకు నేరుగా మద్దతునిస్తాయి. వీటివల్ల పిల్లలకు విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. ఉప్పు, పాలు, మిల్లేట్స్ వంటివి కూడా ప్రధానమైనవే. ఇవి అయోడిన్, విటమిన్ డి, ఐరన్ లోపం లేకుండా చేస్తాయి. పోషకాహార లోపాలను కవర్ చేయడానికి ఇవి మంచి ఫుడ్స్. విటమిన్ డి కోసం పిల్లలు ఆరుబయట ఆడుకునేలా చూడండి. రోజుకు 20–30 నిమిషాలు అయినా ఎండలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి పిల్లల ఎదుగుదలకు మద్ధతునివ్వడమే కాకుండా యాక్టివ్‌గా, మైండ్ చురుకుగా ఉండేలా హెల్ప్ చేస్తాయంటున్నారు.






















