Chalimidi: శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం, ఇలా రెండు రకాలుగా చేసుకోవచ్చు
చలిమిడి పాతకాలం నుంచి వస్తున్న ఓ తెలుగువారి వంటకం. దీని తయారీ ఇప్పుడు చాలా మంది మర్చిపోయి ఉంటారు.
తెలుగు సంవత్సరాదిలో ఉగాది తరువాత వచ్చే తొలి పండుగ శ్రీరామనవమి. శ్రీరాముని జన్మదిన, వివాహ మహోత్సవం రెండూ ఇదే రోజు నిర్వహిస్తారు. సీతారాములకు అంగరంగా వైభవంగా వివాహాన్ని జరిపిస్తారు. శ్రీరామనవమి రోజు వడపప్పు, పానకంతో పాటూ కనిపించే మరో నైవేద్యం చలిమిడి. తెలుగు సాంప్రదాయంలో చలిమిడికి ప్రముఖ స్థానం ఉంది. కూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు పుట్టింటి వారు చలిమిడినిచ్చి పంపుతారు. అలాగే గర్భవతి అయినప్పుడు కూడా చలిమిడి పెడతారు. శుభకార్యాల్లో చలిమిడి పెట్టడం ఆనవాయితీ అయింది. ఇలా చలిమిడి పెట్టడం కూతురికి మంచిదని, వాడుక భాషలో కడుపు చల్లదనానికి చెబుతారు. ఇది పుట్టింటికి, అత్తింటికీ కూడా క్షేమదాయకమని చెప్పుకుంటారు.
చలిమిడిని రెండు రకాలు చేయచ్చు.
1. పచ్చి చలిమిడి
2. పాకం చలిమిడి
ఈ రెండింటి మీకు నచ్చిన పద్దతిలో చలిమిడిని తయారు చేసుకోవచ్చు.
పచ్చి చలిమిడి తయారీ
దీన్ని తయారు చేయడం చాలా సులువు.
1. ముందు బియ్యాన్ని నీటిలో నానబెట్టాలి. నీరు ఓర్చేసి బియ్యం కాస్త పొడిగా మారాక పిండి పట్టాలి.
2. ఆ బియ్యంపిండి ఉండల్లేకుండా ఓ సారి చల్లించుకోవాలి.
3. పచ్చి కొబ్బరి ముక్కలను చిన్న కోసుకుని నెయ్యిలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
4. బెల్లాన్ని పొడిలా తరగాలి.
5. కప్పు బియ్యం పిండికి అరకప్పు బెల్లం అవసరం అవుతుంది.
6. బియ్యం పిండిలో బెల్లం పొడి వేసి తగినన్ని నీళ్లు కలుపుతూ ముద్దలా చేసుకోవాలి.
7. పైనా వేయించిన కొబ్బరి ముక్కలు చల్లుకోవాలి. అంతే పచ్చి చలిమిడి సిద్దమైనట్టే.
పాకం చలిమిడి
దీనికి కాస్త సమయం పడుతుంది.
కావాల్సిన పదార్థాలు
తడి బియ్యం పిండి - ఒక కప్పు
బెల్లం - పావు కిలో
కొబ్బరి ముక్కలు - అరకప్పు
నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు
గసగసాలు - ఒక టీస్పూను
తయారీ ఇలా
1. ముందుగా గిన్నలో బెల్లం, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. బెల్లం పాకంగా మారే వరకు అలాగే ఉంచాలి.
2. బెల్లం పాకం రెడీ అయ్యాక అందులో ఒక టీస్పూను నెయ్యి వేసి కలపాలి.
3. తరువాత కప్పు బియ్యం పిండిని వేసి ఉండలు కట్టకుండా గరిటెతో కలపాలి.
4. మరోపక్క నెయ్యిలో కొబ్బరి ముక్కలు, గసగసాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. కావాలంటే జీడి పప్పులు కూడా వేసుకోవచ్చు.
5. బెల్లం, బియ్యం పిండి మిశ్రమంలో వేయించిన కొబ్బరిముక్కలు, గసగసాలు వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు చిన్న మంట మీద ఉంచి తరువాత కట్టేయాలి. పాకం చలిమిడి రెడీ అయినట్టే.
మీకు నచ్చితే పంచదారతో కూడా చేసుకోవచ్చు. కానీ పంచదారతో పోలిస్తే బెల్లమే ఆరోగ్యానికి మంచిది.
Also read: ప్రపంచం అంచులకు వెళ్లిన ఫీలింగ్ కావాలా, ధనుష్కోడిలోని ఆ ప్రాంతానికి వెళితే సరే
Also read: వేసవి సెలవుల్లో హంపి ట్రిప్ అదిరిపోతుంది, అక్కడ కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవిగో