New Study: సెరెబ్రల్ పాల్సీ... పిల్లల్లో వచ్చే ఆ మహమ్మరి వారసత్వంగా రావచ్చు
పిల్లలకు వచ్చే మహమ్మరి అనారోగ్యాల్లో సెరెబ్రల్ పాల్సీ ఒకటి.
సెరెబ్రల్ పాల్సీ చిన్న పిల్లలకు శాపంలో మారే ఓ రుగ్మత. ఇది ప్రాణాంతకం కాకపోవచ్చు, కానీ చికిత్స లేని ఓ ఆరోగ్య స్థితి. దీన్ని వ్యాధి అని పిలవలేం. మెదడులో ఒక భాగం పనిచేయకపోవడం వల్ల ఇది వస్తుంది. ప్రతి వెయ్యి మంది పిల్లల్లో అయిదు నుంచి ఎనిమిది మందిలో ఈ సెరెబ్రల్ పాల్సీ కనిపిస్తోంది. ఇది మెదడులో సెరిబ్రమ్ అనే భాగం దెబ్బతినడం వల్ల కలుగుతుంది. కొందరికి గర్భంలో ఉండగానే ఇది జరుగుతుంది. దీన్ని మెదడు పక్షవాతం అని కూడా పిలవవచ్చు. అయితే దీనిపై బోస్టన్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో పరిశోధనలు సాగాయి. ఈ అధ్యయనంలో సెరెబ్రల్ పాల్సీ బారిన పడిన ప్రతి నలుగురి పిల్లల్లో ఒకరికి అది వారసత్వం జన్యువుల వల్ల వచ్చినట్టు తేలింది.
సెరిబ్రల్ పాల్సీ అనేది ప్రసవ సమయంలో జరిగే అంతర్గత గాయాల వల్ల వస్తుందని భావన ఉంది. దీంతో చాలా కుటుంబాలు ప్రసవం చేసిన వైద్యులపై కేసులు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత మంది గర్భధారణ సమయంలో తాము సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగి ఉంటుందని తమను తామే నిందించుకున్నవారు కూడా ఎక్కువే. అధ్యయనంలో భాగంగా 50 మందిపై పరిశోధనపై చేశారు. వీరిలో సగటు వయసు పదేళ్లు. వీరిలో 20 మంది నెలలు నిండకుండానే పుట్టడం, మెదడు బ్లీడింగ్, మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం వంటి కారణాలను కలిగిఉన్నారు. 24 మందిలో ఎలాంటి కారణాలు లేవు. వారిలో ఓ ముగ్గురిలో జన్యుపరైన కారణాల వల్ల సెరెబ్రల్ పాల్సీ వచ్చినట్టు గుర్తించారు. దీన్ని బట్టి ఇది కూడా వారసత్వంగా వస్తుందని నిర్ధారించినట్టే.
ఇవీ కూడా కారణాలే...
1. నెలల నిండకుండా 28 వారాలకు ముందే పుట్టే పిల్లల్లో సెరెబ్రల్ పాల్సీ వచ్చే అవకాశం ఉంది.
2. అలాగే ప్రసవసమయంలో, లేదా గర్భం లోపల ఉన్నప్పుడు నాలుగు నిమిషాలకన్నా ఎక్కువ సమయం మెదడుకు ఆక్సిజన్ అందకపోయినా కూడా నాడీ వ్యవస్థ దెబ్బతిని ఈ రుగ్మత రావచ్చు. దీని కారణంగా అంగవైకల్యం వస్తుంది.
3. మెదడుకు ఆక్సిజన్ అందక సెరిబ్రమ్ అనే భాగం దెబ్బతినడం వల్ల కూడా సెరెబ్రల్ పాల్సీ వస్తుంది. దీనికి ఎలాంటి చికిత్స లేదు.
లక్షణాలు ఇలా ఉంటాయి...
1. పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగరు.
2. కండరాలు బలహీనంగా, నియంత్రణ లేకుండా ఉంటారు.
3. నడక సరిగా రాదు, మునివేళ్లపై నడవడం, సిజర్ వాకింగ్ చేయడం చేస్తారు.
4. కోపం రావడం, చాలా చురుగ్గా కదలడం, అసాధారణంగా స్పందించడం వంటివి ఉంటాయి.
5. కండరాలు బిగుసుకుపోతాయి. తమ పని కూడా తాము చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు.