Breast Milk: తల్లి పాలలో మరో అద్భుత గుణాన్ని కనుగొన్న పరిశోధకులు - డబ్బాపాలిస్తే పిల్లలు ఇది మిస్సవుతారు!
అప్పుడే పుట్టిన శిశువులకు ఆహారం తల్లిపాలు మాత్రమే. వాళ్ళ కడుపు నింపడమే కాదు శరీర ఎదుగుదల విషయంలోని, రోగనిరోధక శక్తి అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.
తల్లిపాలు శిశువుకి పూర్తి ఆరోగ్యాన్ని అందిస్తాయనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే కనీసం రెండేళ్ల వరకు పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం ఆరోగ్యకరమని పెద్దవాళ్ళు సూచిస్తారు. ఇవి శిశువుకి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. వారి ఎదుగుదల విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. తాజాగా తల్లిపాలకు ఉన్న విలువ కొత్త అధ్యయనంతో మరోసారి స్పష్టమైంది. శిశువులో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి కీలకమైన సూక్ష్మపోషకాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. శిశువుల మెదడులో న్యూరాన్లు తల్లి పాలతో ఎలా కనెక్ట్ అవుతాయనే దాని మీద పరిశోధకులు పరిశీలించారు. మైయో ఇనోసిటాల్ అనేది తల్లి పాలలో ఒక చిన్న సైక్లిక్ చక్కెర అణువు. ఇది పండ్లు, ధాన్యాలతో సహా ఇతర ఆహారాల్లో కూడా కనిపిస్తుంది. మెదడు పనితీరులో ఇది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది.
శిశువుల అభిజ్ఞా వికాసానికి తల్లిపాలు ప్రయోజనకరంగా ఉన్నాయని మునుపటి అధ్యయనాలు నిరూపించాయి. రొమ్ము పాలలో బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. శిశువు మెదడు అభివృద్ధికి ఈ సమ్మేళనాలు ఉపయోగపడతాయి. దీనిపై పరిశోధకులు మూడు ప్రాంతాల్లోని తల్లుల చనుబాలు తీసుకుని పరిశోధన జరిపారు. మూడు భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రదేశాల నుంచి నమూనాలు తీసుకుని అధ్యయనం చేయడానికి కారణం ఉంది. ఎందుకంటే నమూనాలలో ఉండే సూక్ష్మపోషకాలు ఏ విధంగా ఉన్నాయో గమనించారు. జాతి, ప్రదేశంతో సంబంధం లేకుండా జీవశాస్త్ర ప్రాముఖ్యత కలిగి ఉంటుందని వాళ్ళు భావించారు.
తల్లి పాలలో మైయో ఇనోసిటాల్ అధికంగా ఉన్నట్టు గమనించారు. కానీ చనుబాలు ఇచ్చే కొద్దీ వాటి సంఖ్య తగ్గిపోతుంది. ఈ మైయో ఇనోసిటాల్ చక్కెర అణువు న్యూరాన్ సినాప్స్ సమృద్ధిని పెంచిది, న్యూరోనల్ కనెక్టివిటీని మెరుగుపరిచిందని పరిశోధకులు గుర్తించారు. శిశువు మెదడులో కనెక్షన్ ఏర్పాటుకు తల్లి పాలు చాలా విలువైనవని తమ అధ్యయనం నిరూపించిందని పరిశోధక బృందంలోని బైడెకర్ వెల్లడించారు. ఇది నిజంగా తల్లి పాల ప్రాముఖ్యతని నొక్కి చెప్తుంది. ఇవి కేవలం కేలరీలు మాత్రమే కాదు చాలా సంక్లిష్టమైన బయోఫ్లూయిడ్. అందుకే తల్లి పాలు శిశువుకి చాలా అవసరం.
పాల ఉత్పత్తి పెంచుకునే మార్గాలు
కొంతమంది తల్లులకి పాలు సరిగా పడవు. దీని వల్ల బిడ్డకు సరిపోకపోవడం వల్ల డబ్బా పాలు పడుతూ ఉంటారు. కొన్ని రకాల ఆహారాలు రోజూ తింటే బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. సోంపు గింజలు నీళ్ళలో మరిగించి ఆ నీటిని రోజూ తాగితే పాలు వృద్ధి చెందుతాయి. రోజుకో గుప్పెడు నానబెట్టిన బాదం పప్పులు తింటే మంచిది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాలింతలకు మేలు చేస్తాయి. పాలిచ్చే తల్లులు రోజూ ఆవు లేదా గేదె పాలు తాగిన మంచి ఫలితం పొందుతారు. రెండు, మూడు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తింటూ ఉండాలి. అప్పుడే బిడ్డకి సరిపడినంత పాలు లభిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ప్రమాదంలో ఆరోగ్యం - వర్షాకాలంలో ఇమ్యునిటీ కోసం ఈ పానీయాలు తాగండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial