Bongulo Chicken: వెదురు బొంగు కొనుక్కోండి, ఇంట్లోనే ఇలా బొంగులో చికెన్ వండేయండి
బొంగులో చికెన్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. కానీ సిటీలో ఎవరు అమ్ముతారు?
అరకు స్పెషల్ వంటకం బొంగులో చికెన్. దీని కోసం చాలా దూరం ప్రయాణం చేసి వెళ్లి మరీ బొంగులో చికెన్ లేదా బొంగులో బిర్యానీ తింటారు. ఇప్పుడు ఆన్ లైన్ ఆర్డర్లలో కూడా కొన్ని రెస్టారెంట్లు బొంగులో వంటకాలను అందిస్తున్నాయి. కానీ ధర మాత్రం సామాన్యులకు అందుబాటులో లేనంత ఎక్కువ పెట్టాయి. అయిదు వందల రూపాయల ఖర్చుపెడితే ఒక వ్యక్తి పొట్ట నిండేంత బొంగులో బిర్యానీ కూడా రావడం లేదు. ఇక బొంగులో చికెన్ అయితే చాలా తక్కువగా అందిస్తున్నారు. కాబట్టి కాస్త కష్టపడితే మీరే దీన్ని వండేసుకోవచ్చు.
బార్బెక్యూ గ్రిల్...
ఇప్పుడు ఆన్ లైన్లో బార్బెక్యూ గ్రిల్ అందుబాటులో ఉంటోంది. ఇందులో కాస్త బొగ్గులు వేసి కాల్చుకోవచ్చు. ‘చార్‌కోల్ బార్బెక్యూ గ్రిల్’ కొనుక్కుంటే బాల్కనీలో కూడా దీన్ని పెట్టుకోవచ్చు. మొక్కజొన్న పొత్తులు, చిలగడ దుంపలు కూడా కాల్చుకోవచ్చు దీనిపై. ధర రెండువేల రూపాయలు ఉంటుంది. ఇక బార్బెక్యూ వంటలు ఎలాగూ వండుకోవచ్చు. ఇందులోనే బొంగులో చికెన్ కూడా వండుకోవచ్చు.మీరు కొనే బొంగు సైజును బట్టి చికెన్ వండుకోవాలి. పెద్దదతై అరకిలో చికెన్ పడుతుంది. అదే చిన్నదైతే పావు కిలో పడుతుంది.
కావాల్సిన పదార్థాలు
చికెన్ - పావు కిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
ఉల్లి తరుగు - రెండు స్పూనులు
జీలకర్ర పొడి - అర స్పూను
ధనియాల పొడి - అరస్పూను
కారం - ఒక స్పూను
పసుపు - అరస్పూను
ఉప్పు - రుచికి సరిపడా
చికెన్ మసాలా - అర టీస్పూను
గరం మసాలా - అర టీస్పూను
నూనె - రెండు స్పూనులు
తయారీ ఇలా...
1. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ వేసి పైన చెప్పిన మిగిలిన పదార్థాలన్నీ బాగా కలుపుకోవాలి. నూనె కూడా వేసి కలపాలి. ఒక పావుగంట సేపు మారినేషన్ కోసం వదిలేయాలి.
3. ఇప్పుడు వెదురు బొంగులో చికెన్ మిశ్రమాన్ని కుక్కాలి.
4. ఒకవైపు బొంగు ఎలాగు మూసే ఉంటుంది. ఇక రెండో వైపు ఎండు విస్తరాకులు లేదా, పచ్చి అరిటాకులు మడతబెట్టి అడ్డుగా కుక్కాలి.
5. ఇప్పుడు దాన్ని నిప్పులపై వేయాలి. అరగంట సేపు అలా ఉంచితే చికెన్ లోపల బాగా ఉడికిపోతుంది. బొంగు బాగా నల్లగా మాడిపోతుంది.
6. వేడి చల్లారాక మడతబెట్టిన ఆకులను తీసేసి ప్లేటులో ఒంపితే టేస్టీ బొంగులో చికెన్ రెడీ. పచ్చి ఉల్లిపాయలతో దీన్ని తింటే ఆ రుచే వేరు.
Also read: మొటిమలు తగ్గాలన్నా, చుండ్రు పోవాలన్నా ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది