Jojoba Oil: మొటిమలు తగ్గాలన్నా, చుండ్రు పోవాలన్నా ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది
మొటిమలతో బాధపడేవారికి ఈ ఆయిల్ అమృతమనే చెప్పాలి.
యువతను వేధిస్తున్న సమస్యలో ముఖ్యమైనవి మొటిమలు, చర్మం పాలిపోయినట్టు అవ్వడం, చుండ్రు... వీటన్నింటికీ ఒక్క నూనెతో చెక్ పెట్టొచ్చు. అదే జోజోబా ఆయిల్. దీన్ని సిమోండ్సియా చినెన్సిన్సిస్ అనే మొక్కల నుంచి తయారుచేస్తారు. ఈ మొక్కలు మనదేశంలో దొరకవు. అమెరికాలోని, మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. ఆ మొక్కల విత్తనాలతో జోజోబా నూనెను తీస్తారు. ఆ నూనెను మాత్రం దిగుమతి చేసుకుంటాం కాబట్టి ధర కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. జోజోబా నూనె జుట్టుకు, చర్మానికి చేసే మేలు ఇంతా అంతా కాదు.
మెరిసే చర్మం
జోజోబా నూనెలో ఏ,ఇ విటమిన్లు, ఒమేగా 6 ప్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి రక్షణలా నిలుస్తాయి. చర్మంలో తేమను పట్టి ఉంచడానికి ఉపయోగపడతాయి. విటమిన్ ఇ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ లక్షణాలు చర్మంపై రక్షిత పొరను ఏర్పాటు చేస్తుంది.
పొడి చర్మానికి...
కొందరిలో పొడి చర్మం చాలా చికాకును కలిగిస్తుంది. అలాంటివారు ఈ నూనెను రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇది తేమను పట్టి ఉంచి చర్మం పొడిబారకుండా కాపాడతుంది.
మొటిమలకు చెక్
చాలా మంది యువత మొటిమలతో ఇబ్బంది పడుతున్నారు. మొటిమలు వచ్చే చర్మానికి జోజోబా ఆయిల్ ఉత్తమ ఎంపిక.దీనిలో యాంటీ బాక్టిరియల్ లక్షణాలు అధికం. బ్యాక్టిరియాతో పోరాడుతుంది. చర్మగ్రంధుల్లోని నూనె,తేమ సమతుల్యతలను కాపాడుతుంది. మొటిమలున్న చోట ఈ ఆయిల్ రాస్తే చాలా మంచిది.
ఏజింగ్‌ను నిరోధిస్తుంది
జోజోబా ఆయిల్ లో హైడ్రేటింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికం. ఇది వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. ఈ నూనెను చర్మానికి రోజూ రాసుకోవడం వల్ల చర్మంపై గీతలు పడడం, ముడతలు పడడం వంటి సమస్యలు రావు. చిన్న చిన్న గాయాలకు చికిత్స చేయడంలో కూడా ముందుంటుంది.
మేకప్ రిమూవర్
చాలా మందికి రోజూ మేకప్ వేసుకునే అలవాటు ఉంది. జోజోబా ఆయిల్ గొప్ప మేకప్ రిమూవర్ గా పనిచేస్తుంది. ముఖాన్ని తేమగా ఉంచుతుంది. చర్మంపై ఉన్న మురికిని, ధూళిని తొలగిస్తుంది.
లిప్‌బామ్
లిప్ బామ్‌గా జోజోబా ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది.పగిలిన పెదాలకు రాస్తే అవి మృదువుగా మారుతాయి. జోజోబా ఆయిల్ ఇంట్లో ఉంటే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.
చుండ్రును తొలగించి
చుండ్రుతో ఇబ్బంది పడుతున్న వారికి జోజోబా ఆయిల్ వరమనే చెప్పాలి. ఈ నూనెలో పల్మిటిక్, స్టెరిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెను తలపై మసాజ్ చేస్తే చుండ్రు, దాని వల్ల వచ్చే దురద తగ్గుతుంది.
Also read: ఆ ఊరికి అల్లుడిగా వెళతారా? కట్నంగా ఏమిస్తారో తెలిస్తే చచ్చినా వెళ్లరు