Cauliflower: క్యాలీఫ్లవర్ ఆకులు పడేస్తున్నారా? దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక మీదట అలా చెయ్యరు
క్యాలీఫ్లవర్ వండుకుని తింటారు. కానీ కోసే ముందు దాని ఆకులు మాత్రం తీసి బయట పడేస్తారు. నిజానికి క్యాలీఫ్లవర్ ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.
శీతాకాలంలో ఎక్కువగా లభించే కూరగాయ క్యాలీఫ్లవర్. ఇందులో ఎక్కువగా పురుగులు ఉండటం వల్ల వీటిని తినడానికి త్వరగా కొందరు ఇష్టపడరు. కానీ క్యాలీఫ్లవర్ తో చేసిన కూరలు, వేపుళ్ళు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. దీనితో చేసే చిరుతిండి గోబీ చాలా మంది ఫేవరెట్. క్యాలీఫ్లవర్ లో పువ్వు వండుకుంటారు గాని దాని పక్కన ఉన్న ఆకులు, కాడలు మాత్రం విసిరేస్తారు. కానీ ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. వాటి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.
ప్రోటీన్లు సమృద్ధి
పిల్లల పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇది తరచూ తినడం వల్ల పిల్లలు బరువు, ఎత్తు పెరుగుతారు. హిమోగ్లోబిన్ అభివృద్ధికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
ఫైబర్ మెండు
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని సలాడ్ వంటి వాటి మీద డ్రెస్సింగ్ గా చేసుకోవడానికి చక్కగా బాగుంటాయి. మంచి ఆకుపచ్చ రంగు ఉండటం వల్ల చూసేందుకు కూడా కంటికి ఇంపుగా కనిపిస్తుంది. అంతేకాదు స్నాక్స్ రూపంలో కూడా వీటిని తీసుకోవచ్చు .
విటమిన్ ఎ ఎక్కువ
కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రకారం క్యాలీఫ్లవర్ ఆకుల్లో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. రే చీకటి తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇందులోని సీరం రెటీనాల్ స్థాయిలను ప్రభావంతంగా పెంచుతుందని నిపుణులు వెల్లడించారు.
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ నష్టం, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి బయట పడేందుకు సహాయం చేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది .
కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. రుతుక్రమం ఆగిపోయి మెనోపాజ్ వచ్చిన మహిళలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మెనోపాజ్ లో వచ్చే సమస్యలను అడ్డుకోవడంలో సహాయపడతాయి. ఎముకలను దృఢంగా మార్చేందుకు అవసరమైన కాల్షియం అందిస్తుంది .
క్యాలీఫ్లవర్ వల్ల ప్రయోజనాలు
క్యాలీఫ్లవర్ లో పీచు,నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. జీర్ణక్రియ సమస్యల్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. క్యాన్సర్ నుంచి రక్షణగా నిలుస్తాయి. ఊబకాయం, మధుమేహం బాధితులకు ఇది చక్కని ఆహారం. విటమిన్ సి, పీచు పుష్కలంగా ఉండటం వల్ల కిడ్నీ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో పోషకాలు ఎక్కువ కేలరీలు తక్కువ. రెగ్యులర్ గా క్యాలీఫ్లవర్ తినడం వల్ల అధిక బరువుని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులోని గుణాలు శరీరంలోని మలినాలు, వ్యర్థాలను బయటకి పంపించడంలో సహాయపడతాయి. రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది గొప్ప ఔషధంఅనే చెప్పాలి. దీన్ని తీసుకోవడం వల్ల కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అంతేకాదు జుట్టు ఆరోగ్యానికి మంచి చేస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలని కోరుకుంటూ క్రమం తప్పకుండా క్యాలీఫ్లవర్ ఆకులు రసం చేసుకుని తాగితే మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.