Viral Fever: దేశంలో పెరుగుతున్న వైరల్ ఫీవర్ కేసులు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
మాన్ సూన్ సీజన్ కారణంగా వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ టైమ్ లో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
దేశవ్యాప్తంగా సీజనల్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వర్షాకాలం కావడంతో ఇన్ఫెక్షన్లు, వైరల్, కండ్ల కలక కేసులు దావానంగా వ్యాపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని వల్ల వైరల్ కేసులు మరింత పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి. కోల్ కతా కాన్పూర్, గౌహతితో పాటు పలు చోట్ల వైరల్ ఫీవర్స్, ఫ్లూ విజృంభిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అంటువ్యాధులు బారిన పడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
వర్షాకాలంలో తేమ వాతావరణం, బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో దోమలు తమ ఆవాసాలుగా మారిపోతున్నాయి. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు నీటి ద్వారా వ్యాపిస్తాయి. కలుషితమైన నీటిని తాగడం వల్ల మలేరియా వ్యాప్తి జరుగుతుంది. మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తే వైరల్ ఫీవర్ బారిన పడినట్టు గ్రహించాలి. వెంటనే వైద్యులని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.
వైరల్ ఫీవర్ లక్షణాలు
☀ చెమటలు అధికంగా పట్టడం
☀ ఒళ్ళు నొప్పులు
☀ చలి
☀ కండరాల నొప్పులు
☀ ఆకలి లేకపోవడం
☀ డీహైడ్రేషన్
☀ వికారం
వైరల్ జ్వరం కారకాలు
☀ వైరల్ ఫీవర్ సోకిన వ్యక్తి స్పర్శ లేదా సదరు వ్యక్తి తీసుకున్న ఆహారం తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది
☀ కలుషిత ఆహారం, నీరు తాగడం వల్ల వ్యాధి వ్యాప్తి
☀ దోమలు, కీటకాల కాటు వైరస్ వ్యాపించేలా చేస్తుంది. చలికి కారణం కావచ్చు
☀ ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినా దగ్గినా అతని దగ్గర ఉన్నప్పుడు అంటుకుంటుంది
☀ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
☀ శరీరానికి తగిన విశ్రాంతి అవసరం
☀ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు ద్రవాలు తగినన్ని ద్రవాలు తీసుకోవాలి
☀ ఆరోగ్యకరమైన, తేలికపాటి భోజనం తీసుకోవాలి
☀ సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి
☀ వ్యక్తిగత శుభ్రత పాటించాలి
☀ వైరస్ వ్యాప్తి చెందకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలి
వైరల్ ఫీవర్ తగ్గించుకునేందుకు ఎక్కువ మంది డాక్టర్ ని సంప్రదించకుండా సొంతంగా యాంటీ బయాటిక్స్ వాడుతూ ఉంటారు. కానీ అది ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అజిత్రోమైసిన్, అమోక్సిక్లావ్ వంటి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. అది కూడా మోతాదు గురించి పట్టించుకోకుండా వేసుకుంటూనే ఉంటారు. కానీ అది యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ కి దారి తీస్తుంది. అతిగా వినియోగించడం వల్ల యాంటీ బయాటిక్స్ పని చేయడం మానేసే ప్రమాదం ఉంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సూచన ప్రకారం వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఈ యాంటీ బయాటిక్స్ నివారించాలి.
⦿ అజిత్రోమైసిన్
⦿ అమోక్సిక్లావ్
⦿ అమోక్సిసిలిన్
⦿ నార్ఫ్లోక్సాసిన్
⦿ సిప్రోఫ్లోక్సాసిన్
⦿ ఆఫ్లోక్సాసిన్
⦿ లెవ్ఫ్లోక్సాసిన్
⦿ ఐవర్‌మెక్టిన్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.