Heart Attack : COVID వ్యాక్సిన్ గుండెపోటుకు కారణమా? AIIMS వైద్యుల క్లారిటీ.. షాకింగ్ విషయాలు ఇవే
COVID Vaccine and Heart Health : కోవిడ్ టీకా వల్ల గుండెపోటు మరణాలు పెరగలేదని.. అసలైన కారణాలు ఇవేనంటూ ఎయిమ్స్ వైద్యులు శాస్త్రీయ ఆధారాలతో నిరూపించారు. దీనిలో చాలా షాకింగ్ విషయాలు ఉన్నాయి. అవేంటంటే..

COVID Vaccine Heart Attack Connection : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటుతో అకాల మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో వస్తోన్న ప్రశ్నలకు, కొవిడ్ వ్యాక్సినేషన్‌కు ఉన్న సంబంధంపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) సీనియర్ వైద్యులు కీలక సమాచారం అందించారు. కోవిడ్ వ్యాక్సిన్‌కు.. హఠాత్తుగా వచ్చే గుండెపోటు పోటుకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే శాస్త్రీయ గణాంకాల ప్రకారం.. కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా వస్తోన్నాయి అనుకున్న గుండెపోటు కేసులు కూడా తగ్గాయట.
కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధమే లేదు
AIIMS ఢిల్లీకి చెందిన సీనియర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ ప్రకారం.. "జనవరి 2021లో భారతదేశంలో కరోనా టీకాలు వేయడం ప్రారంభించారు. ఆ సమయంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే రెండు ప్రధాన టీకాలు ఉపయోగించారు. ఈ రెండు వ్యాక్సిన్ల ట్రయల్స్ భారతదేశంలోనే జరిగాయి. కోవిషీల్డ్ ప్రభావం 63% ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 13 బిలియన్లకు పైగా డోసులు ఇచ్చారు. WHO 12 వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపింది. మొదట వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలు నష్టాల కంటే ఎక్కువ ఉన్నాయా లేదా అని నిర్ణయించుకోవాలి? దీనికి సమాధానం ఏమిటంటే.. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలు.. వాటి నష్టాల కంటే చాలా ఎక్కువ. ప్రతిచర్య రేటు చాలా తక్కువగా ఉంది". అంటూ ఓ ఉదాహరణ ఇచ్చారు.
"కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కలిగే తీవ్రమైన ప్రతిచర్యలు 10 లక్షల మందిలో 30 నుంచి 70 మందిలో మాత్రమే కనిపించాయి. అదేవిధంగా.. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు భారతదేశంలో టీకాలు వేయలేదు.. ఎందుకంటే ఆ వయస్సులో వ్యాక్సినేషన్ ప్రమాదం.. ప్రయోజనం కంటే ఎక్కువ కాబట్టి. కోవిడ్‌కు వ్యతిరేకంగా శాస్త్రీయ ఆధారం ఉంది". అన్నారు.
మరి గుండెపోటుకు కారణమేంటి?
AIIMS ఢిల్లీకి చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ నారంగ్ ప్రకారం.. "భారతదేశంలో యువతలో హఠాత్తుగా గుండెపోటు రావడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. గుండె కండరాలు మందంగా మారడం, మాలిక్యులర్ మార్పులు, రక్తం గడ్డకట్టడం. వృద్ధులలో గుండెపోటుకు ప్రధాన కారణం గడ్డకట్టడం. కోవిడ్ తర్వాత ప్రజలలో ఆరోగ్య స్పృహ పెరిగింది. సోషల్ మీడియా వినియోగం కూడా పెరిగింది. కాబట్టి భారతదేశంలో కోవిడ్ తర్వాత హఠాత్తుగా గుండెపోటు కేసులు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే అది నిజం కాదు". అంటూ క్లారిటీ ఇచ్చారు.
హఠాత్తుగా వచ్చే గుండెపోటును నివారించడానికి 8 ముఖ్యమైన చర్యలను సూచించారు. వాటిలో "మొదటిది ధూమపానం మానేయాలి. రెండవది ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. మూడవది సమతుల్య ఆహారం తీసుకోవాలి. నాల్గవది ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఐదవది నిద్రను నెగ్లెక్ట్ చేయొద్దు. ఆరవది మద్యానికి దూరంగా ఉండాలి. ఏడవది ఊబకాయాన్ని నియంత్రించాలి. ఎనిమిదవది ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాలి". అంటూ సూచనలు ఇచ్చారు.

కోవిడ్ వ్యాక్సిన్ లక్షలాది మంది ప్రాణాలను కాపాడిందని వారు పేర్కొన్నారు. వ్యాక్సిన్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే సడన్ కార్డియాక్ డెత్, వ్యాక్సిన్‌కు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని మరీ చెప్పారు. ఈ ప్రశ్నపై ICMR అధ్యయనం చేసిందని.. దీనిలో భాగంగా కోవిడ్ సమయంలో గుండెపోటుతో మరణించిన, తరువాత గుండెపోటుతో మరణించిన వారి 300 నమూనాలు చెక్ చేసినట్లు తెలిపారు. పరిశోధనలో ఎక్కువ మరణాలకు కారణం కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని తేలిందని.. దీనికి ప్రధాన కారణం ధూమపానం, మద్యపానమేనని క్లారిటీ ఇచ్చారు. అలాగే థ్రోంబోసిస్ (రక్త గడ్డకట్టడం) కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మాత్రమే కాదు.. రేబిస్ లేదా ఇతర టీకాల వల్ల కూడా సంభవిస్తుంది. ఇది జీవసంబంధ ప్రతిస్పందన మాత్రమేనని తెలిపారు. కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్‌ను నిందించడం సరికాదని.. ఇది పూర్తిగా సురక్షితం, ప్రభావవంతమైనదని తెలిపారు.






















