(Source: Poll of Polls)
Heart Attack Prevention Tips : హార్ట్ ఎటాక్ రావొద్దంటే ఈ ఐదు పనులు చేయకూడదట.. గుండె ఆరోగ్యం కోసం ఫాలో అయిపోండి
Heart Attack : గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Daily Routine for Heart Health : ఈ మధ్యకాలంలో హార్ట్ ఎటాక్ సమస్యల గురించి ఎక్కువగా వినిపిస్తుంది. ప్రతిరోజూ చేసే పనులు, పని ఒత్తిడి, సరైన దినచర్య ఫాలో అవ్వకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం ఇలా అన్నీ కలిసి గుండెపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు ఈ గుండె సమస్యలు కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితంగా ఉండేవి. కానీ ఇప్పటి జీవనశైలివల్ల 30 ఏళ్లలోపు వారు కూడా గుండె ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. అలాగే 30 ఏళ్లు పైబడినవారిలో హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువ అయ్యాయి. ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు కూడా హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలతో సడెన్‌గా ప్రాణాలు వదిలేశారు.
ఈ నేపథ్యంలోనే గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 5 పనులు రెగ్యులర్‌గా చేస్తే.. హార్ట్ ఎటాక్ రాదని చెప్తున్నారు. కాస్త తెలివిగా లైఫ్‌స్టైల్ మార్చుకుంటే గుండె సమస్యలే కాదు.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావని చెప్తున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి? వేటిని ఫాలో అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శారీరక శ్రమ
రోజులో కనీసం 30 నిమిషాలు శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలంటున్నారు. వేగంగా నడవడం, యోగా చేయడం, లేదా రన్నింగ్ వంటివి చేయాలి. లేదా శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచే వాటిపై దృష్టి పెట్టాలి. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 30 నిమిషాల వ్యాయామం కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. యాక్టివ్‌గా ఉన్నప్పుడు గుండె కూడా హెల్తీగా ఉంటుంది.
ఒత్తిడికి బాయ్ చెప్పండి
స్ట్రెస్ ఎక్కువగా తీసుకునేవారిలో గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఒత్తిడి అనేది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. అంతేకాకుండా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెప్తున్నారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు రోజూ 15 నిమిషాల ధ్యానం లేదా డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయమని సూచిస్తున్నారు. ఇవి ఒత్తిడిని సులభంగా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనసును ప్రశాంతంగా ఉంచి.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఫాస్ట్ ఫుడ్
గుండె ఆరోగ్యాన్ని నాశనం చేసేవాటిలో ఫాస్ట్ ఫుడ్ కూడా మేజర్ పాత్ర పోషిస్తుంది. నూనె, నెయ్యి, చక్కెర, ఉప్పుతో నిండిన ఆహారాలు నోటికి రుచిగా ఉంటాయి కానీ.. గుండె ఆరోగ్యానికి మాత్రం పాయిజన్ లాంటివని చెప్తున్నారు. కాబట్టి బయట దొరికే ఫుడ్స్‌కి, ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వాటికి బదులు పండ్లు, ఆకుకూరలు, ఓట్స్, గింజలు తీసుకోవాలంటున్నారు. ఫ్యాట్ తక్కువగా ఉండే ఫుడ్స్, ప్రోటీన్ ఫుడ్స్‌ను డైట్లో చేర్చుకోవాలంటున్నారు. ఇవి మీ గుండె ధమనుల్లోని కొవ్వును తగ్గించి.. రక్తపోటును సమతుల్యం చేస్తాయి.
నిద్ర
తగినంత నిద్ర లేకపోవడం వల్ల హృదయ స్పందనలో మార్పులు రావడంతో పాటు రక్తపోటు, ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. అందుకే కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. అలాగే రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, మేల్కోవడం చేయాలని సూచిస్తున్నారు. మంచి నిద్ర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు.
ధూమపానం, మద్యపానం
ధూమపానం చేసే అలవాటు ఉందా? అయితే దీనిని వెంటనే మానుకోవాలని చెప్తున్నారు. అలాగే మద్యం ఎక్కువగా సేవించే అలవాటు ఉంటే వెంటనే దానిని కంట్రోల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు అలవాట్లు గుండె ధమనులు కుంచించుకుపోయేలా చేస్తాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.
ఈ 5 మార్పులను మీరు కచ్చితంగా ఫాలో అయితే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని చెప్తున్నారు నిపుణులు. అలాగే ఎలాంటి ఇబ్బందులు గుర్తించినా వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.






















