Aadhar Mobile Number Change : ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ పనిచేయడం లేదా? కొత్త నంబర్‌ను ఇలా అప్‌డేట్ చేసుకోండి
Aadhar Mobile Update : పాత నంబర్ పనిచేయకపోతే.. ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను వేరే దానితో మార్చుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ చాలా సులభమైనదిగా చెప్తున్నారు.

Link New Number to Aadhar : ఆధార్ కార్డ్ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. బ్యాంక్ ఖాతా తెరవడం నుంచి సిమ్ కార్డ్ తీసుకోవడం, గ్యాస్ సబ్సిడీ, పెన్షన్, ఆదాయపు పన్ను రిటర్న్ లేదా ప్రభుత్వ పథకాల ప్రయోజనాల వరకు.. దాదాపు ప్రతిచోటా దీని అవసరం ఉంది. అయితే ఆధార్‌కి మొబైల్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరిగా చేయాల్సిన ప్రక్రియ. ఏదైనా అప్లై చేసేప్పుడు ఆధార్ కార్డ్ లింక్ అయిన నెంబర్‌కే ఓటీపీ వస్తుంది. ఈపీఎఫ్, బ్యాంక్ లావాదేవీల సమయంలో ఆధార్ లింక్ అయిన నెంబర్‌కే ఓటీపీ వస్తుంది. అయితే మీరు ఆధార్‌కి లింక్ చేసిన నెంబర్ ఏదైనా కారణంతో మార్చాలనుకుంటే ఏమి చేయాలో తెలుసా?
మీ నెంబర్ పని చేయనప్పుడు లేదా ఇంకేమైన సమస్యలు ఉన్నప్పుడు ఆధార్‌కు కొత్త నంబర్ లింక్ చేయడం ముఖ్యం. అయితే మొబైల్ నెంబర్ మార్చగలిగే ప్రక్రియ మునుపటిలా కష్టతరమైనది కాదు. కొన్ని సులభమైన దశల్లో మీరు దీన్ని మళ్లీ అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే మీ ఆధార్‌తో కొత్త మొబైల్ నంబర్‌ను ఎలా కనెక్ట్ చేయాలో పూర్తి ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త మొబైల్ నంబర్‌ను ఇలా అప్‌డేట్ చేయండి
ముందుగా మీ పాత నంబర్ ఆధార్‌తో లింక్ చేస్తే కొత్త మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి.. మీరు మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా జనసేవా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ ఆధార్ అప్‌డేట్ ఫారమ్‌ను పూరించండి. మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి ఎంచుకోండి. దీని తరువాత మీరు బయోమెట్రిక్ ధృవీకరణను ఇవ్వాల్సి ఉంది. 75 రూపాయలు చెల్లిస్తే.. ఫారమ్‌ను సమర్పించిన తర్వాత.. అధికారి మీ కొత్త నంబర్‌ను UIDAI సిస్టమ్‌లో నమోదు చేస్తారు. సాధారణంగా 3 నుంచి 5 రోజుల్లో కొత్త నంబర్ లింక్ అవుతుంది. దీని తరువాత మీరు ఏదైనా సర్వీస్ కోసం కొత్త నంబర్‌కు OTPని పొందగలుగుతారు.
ఎలా చెక్ చేసుకోవాలంటే..
చాలా సార్లు నంబర్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం పడుతుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా.. మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి.. మీరు UIDAI వెబ్‌సైట్‌కు వెళ్లాలి. దానిలో ఆధార్‌ని అప్డేట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్, క్యాప్చాను నమోదు చేయాలి. అప్‌డేట్ పూర్తయితే డిటైల్స్ కనిపిస్తాయి. అంతేకాకుండా UIDAI SMS ద్వారా కూడా సమాచారాన్ని అందిస్తుంది.
ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ప్రభుత్వ పథకం, బ్యాంకింగ్ సేవ మరియు డిజిటల్ ధృవీకరణలో OTP అవసరం. కాబట్టి నంబర్ ఆధార్‌తో లింక్ అవ్వకుంటే.. ప్రక్రియ ఆలస్యం అవుతుంది.






















