Ocean’s Deepest Secrets : మనిషికి తెలియని రహస్య ప్రపంచం.. అసలు సముద్రంలో ఏముంది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు
Hidden Secrets of Ocean Floor : సముద్రం ఎన్నో రహస్యాలకు, వనరులకు, భూగర్భ నిర్మాణాలకు సమూహాం. మరి ఈ సముద్ర లోతుల్లో ఏముందో ఓసారి చూసేద్దాం.

Unseen World Beneath the Ocean : భూమిపై దాదాపు 71% నీరు ఉంది. అయినప్పటికీ సముద్రాల్లోని లోతైన భాగాలు ఇప్పటికీ మానవుని కళ్లు, సాంకేతికతకు అందనంత దూరంలోనే ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం.. సముద్రంలో లోతైన ప్రదేశాలకు చేరుకోవడం నేటికీ చాలా కష్టమైన పనిగా చెప్తున్నారు. ఇవి వాతావరణం, ఒత్తిడి పరంగా మాత్రమే కాకుండా.. ఎన్నో జలచరాలు, భూగర్భ నిర్మాణం కూడా రహస్యాలతో నిండి ఉన్నట్లు చెప్తున్నారు. దీని కారణంగానే సముద్రంలో ఎవరూ చూడని ప్రపంచం నేటికీ మానవులకు ఒక రహస్యంగానే ఉందని అంటున్నారు.
సముద్రంలోకి మనిషి వెళ్లలేడా?
ఇప్పటివరకు సముద్రంలో కేవలం 20% మాత్రమే కనుగొన్నారు. ఇంకా 80% మనకి తెలియనిది ఉంది. సముద్ర ఉపరితలం నుంచి లోతైన భాగంలో ఒత్తిడి, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మానవుడు భరించలేనివిగా ఉంటాయి. ఉదాహరణకు మెరియానా ట్రెంచ్, ఇది భూమిపై లోతైన కందకంగా పరిగణిస్తారు. దీని లోతు దాదాపు 11 కిలోమీటర్లు. ఇంత లోతులో నీటి ఒత్తిడి మానవ శరీరం తట్టుకోలేదు. అందుకే మానవ అన్వేషణ, పరిశోధన ఇప్పటికీ.. నీటి ఉపరితలంపై, కొద్దిగా లోపలికి మాత్రమే పరిమితమైంది.
సముద్ర రహస్యాలు
సముద్రాల లోతుల్లో ఇంకా వెలుగులోకి రాని అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. లెక్కలేనన్ని వింత, అద్భుతమైన జీవులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని బయటకి వస్తాయి. అలాంటి వాటిలో డూమ్స్ డే ఫిష్ కూడా ఒకటి. కొన్నిసార్లు సముద్రంలో జరిగే చర్యలకు ఇవి రియాక్ట్ అవుతాయి. మరికొన్ని ఇప్పటికీ అంతుచిక్కలేదు. సముద్రంలోపల నివసించే జీవులు ఎక్కువ కాంతి లేకుండా ఉంటాయి. వాటి శరీర నిర్మాణం కూడా అసాధారణంగా ఉంటుంది. దీనితో పాటు.. సముద్రం అడుగున తెలియని సముద్ర పర్వతాలు, గుంటలు, అగ్నిపర్వత నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీటి గురించిన విషయాలు శాస్త్రవేత్తల దగ్గర కూడా లేవు.
సముద్రం లోతైన భాగాలలో ఖనిజాలు, సహజ వనరులు పుష్కలంగా ఉంటాయి. చాలా ప్రదేశాలలో లోహాలు, వాయువులు, అరుదైన ఖనిజాలు కనిపిస్తాయి. దీనితో పాటు సముద్రం లోతుల్లో పాత ఓడల శిధిలాలు, సముద్రంలో జరిగిన ప్రమాదాల శాసనాలు, మానవ నాగరికత గుర్తులు కూడా దాగి ఉండవచ్చు. అందుకే సముద్రం.. శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది.
సాంకేతికత, అన్వేషణ
ఇటీవలి కాలంలో సోనార్, రోబోటిక్ సబ్‌మెరైన్‌లు, అండర్‌వాటర్ డ్రోన్‌ల వంటి సాంకేతికతలు సముద్రంలోని లోతైన చిత్రాలు తీసుకురావడానికి సహాయం చేశాయి. అయినప్పటికీ సముద్రం విస్తరణ కారణంగా.. ఇప్పటికీ వాటిలో చాలా పెద్ద భాగం చూడలేకపోతున్నాము. విషయాలు తెలుసుకోలేకపోతున్నాము. రాబోయే దశాబ్దాల్లో కొత్త సాంకేతికత, అంతరిక్షం వంటి పరిశోధనల ద్వారా సముద్రంలోని రహస్యాల గురించి మరింత సమాచారం పొందవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






















