Self Wedding: తనను తానే పెళ్లి చేసుకుని కొత్త ట్రెండ్ సెట్ చేసిన యువతి, అందుకు కారణాలు ఇలా చెబుతోంది
తనను తానే పెళ్లి చేసుకుని ‘సోలోగమీ’ ట్రెండ్ ను సెట్ చేసింది ఓ యువతి. ఆమె పెళ్లి హాట్ టాపిక్‌గా మారిపోయింది.
గుజరాత్ లోని వడోదరకు చెందిన అమ్మాయి క్షమ బిందు. వయసు 24 ఏళ్లు. ఆమె తనను తానే పెళ్లి చేసుకుంది. అందమైన పెళ్లి వస్త్రాల్లో కనువిందు చేసింది. మెహెందీ, హల్దీ... ఇలా పెళ్లికి సంబంధించిన అన్ని వేడుకలను వైభవంగా నిర్వహించుకుంది. దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్యే పెళ్లిని పూర్తి చేసింది. క్షమాకు వివాహం చేసుకోవాలనిపించింది కానీ వేరే వ్యక్తిని చేసుకోవాలని అనిపించలేదు. అందుకే తనకు తాను నిబద్ధతగా ఉండాలని స్వీయ వివాహాన్ని ప్లాన్ చేసుకుంది. ఇలా ఎందుకు అని అడిగిన వారికి తన అందమైన ఆలోచనలను పంచుకుంది.
తనను తానే ప్రేమించాలని...
లోకం మనల్ని ప్రేమించే ముందు ముందు మనల్ని మనం సంపూర్తిగా ప్రేమించాలి. మన మీద మనకి ప్రేమ, శ్రద్ధ లేని నాడు, ఎవరు మనల్ని ప్రేమించినా విలువ లేనట్టే అని వివరిస్తోంది క్షమా. అనేక విషయాలలో మనకంటే మెరుగైన వ్యక్తులు చాలా మంది ఉంటారు. దానర్థం మనం పనికిరాని వారు అని కాదు. మనల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి. మీ సామర్థ్యాలు ప్రత్యేకమైనవని, మీ లక్షణాలు ఉత్తమమైనవని మీరు నమ్మాలి. మనల్ని మనం సంపూర్ణంగా ప్రేమించినప్పుడు మీరు ఇతరులతో పోటీ పడాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది అని చెబుతోంది. వేరే వాళ్లని పెళ్లి చేసుకుంటే తనని తాను ప్రేమించే అవకాశాన్ని కోల్పోతుందని అందుకే ఇలా పెళ్లి చేసుకున్నట్టు చెబుతోంది క్షమ.
మీరే మొదటి ప్రాధాన్యత...
‘వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మొదటి ప్రాధాన్యత మీకు మీరు ఇచ్చుకోగలరా? మీ అవసరాలను పట్టించుకోగలరా? కుదరనే కుదరదు’ అంటోంది. ప్రపంచానికి దూరంగా ఉండి మనల్ని మనం మొదటి స్థానంలో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటే అంత ఆనందం దక్కుతుంది.
వారిని పట్టించుకోవద్దు
కఠినమైన మాటలతో, నెగిటివ్ ఆలోచనలతో మిమ్మల్ని అణిచేయడానికి చాలా మంది ఉంటారు. వారిని పట్టించుకోవద్దు, వారి మాటలను వినిపించుకోవద్దని వివరిస్తోంది క్షమ. మనం చేయాలనుకున్నది మంచి పని అయితే, అది ఇతరుకుల హాని చేయనిది అయితే, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అంటోంది.
‘ఆరోగ్యపరంగా, ఆహారపరంగా, అవసరాల పరంగా అన్ని రకాలు ఇఫ్పుడు నేను నాకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. నన్ను నేను గౌరవించుకుంటాను. ప్రేమిస్తాను. నేను సింగిల్ గానే సంతోషంగా ఉండగలను’ అని తన పనిని సమర్థించుకుంది క్షమ.
Also read: మాంసాహారం తినేవారికి షాకింగ్ న్యూస్, అలా తింటే చూపు మసకబారే అవకాశం, చెబుతున్న అంతర్జాతీయ అధ్యయనం