Vision loss: మాంసాహారం తినేవారికి షాకింగ్ న్యూస్, అలా తింటే చూపు మసకబారే అవకాశం, చెబుతున్న అంతర్జాతీయ అధ్యయనం
మాంసాహారాన్ని ఇష్టపడే వారికి ఇది కాస్త కలవర పెట్టే కథనమే.
మీరు నాన్ వెజ్ ప్రియులా? ముక్క లేనిదే ముద్ద దిగదా? అయితే ఈ కథనం మీకోసమే. మాంసాహారం అధికంగా తినేవారి చూపు సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతోంది ఓ కొత్త అధ్యయనం. మాంసాహారాన్ని సరైన పద్ధతిలో వండాక తినాలని, లేకుంటే చూపు మసక బారుతుందని, ఇతర దృష్టి సమస్యలు వస్తాయని తేల్చారు శాస్త్రవేత్తలు. మాంసం నాణ్యత, ఉడిక సమయం ఈ రెండూ చాలా ముఖ్యమైన కారకాలని, మాంసం తినేవాళ్లు ఈ రెండింటి విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
పరిశోధన ఇలా...
ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. పచ్చిమాంసంలో పరాన్నజీవి అయిన టాక్సోప్లాస్మాగోండి ఉంటుందని వారు కనుగొన్నారు. ఈ పరాన్న జీవి కారణంగా రెటీనాపై మచ్చలు వచ్చే అవకాశం ఉందని, చూపు కూడా తగ్గుతుందని గుర్తించారు. ఈ పరిస్థితి ప్రతి 150 మంది ఆస్ట్రేలియన్లలో ఒకరికి వస్తున్నట్టు గుర్తించారు. పరిశోధనలో భాగంగా 5000 మంది రెటీనా చిత్రాలను విశ్లేషించారు. ఆ చిత్రాల ఆధారంగా టాక్సోప్లాస్మోసిస్ సమస్య ఉన్నట్టు గుర్తించారు.
ఎలా తింటే సేఫ్?
మాంసాన్ని పూర్తిగా మానేయమని మాత్రం పరిశోధకులు సిఫారసు చేయడం లేదు. కొన్ని సూచనలు మాత్రం ఇస్తున్నారు. తాజా మాంసాన్ని మాత్రమే షాపు నుంచి తెచ్చుకోవాలి. ఆరు బయట గంటల కొద్దీ నిల్వ ఉంచిన మాంసాన్ని తెచ్చుకోకూడదు. ముఖ్యంగా వండినప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. పసుపు, ఉప్పు వంటి వాటితో మాంసాన్ని శుభ్రం చేయాలి. అలాగే సరిగా ఉడకకుండా తినకూడదు. చాలా సేపు బాగా ఉడికించిన తరువాతే తినాలి. ఇలా అధిక ఉష్ణోగ్రత వద్ద అధిక సమయం ఉడికితే పరాన్నజీవులు, వైరస్‌లు మరణిస్తాయి. వాటి వల్ల ఎలాంటి సమస్యా రాదు.
పరాన్న జీవి సోకితే...
ఈ పరాన్న జీవి అనుకోకుండా శరీరంలో చేరితే కొన్ని రకాల లక్షణాలను చూపిస్తుంది. సాధారణ జ్వరం కలుగుతుంది. కండారల నొప్పి, గ్రంథుల వాపు, తలనొప్పి, కంటి సమస్యలు, కాలేయం వాపు వంటివి కలుగుతాయి. కేవలం టాక్సోప్లాస్మాగోండి పరాన్న జీవి మాత్రమే కాదు, మరికొన్ని పరాన్న జీవులు పచ్చి మాంసంపై జీవించే అవకాశం ఉంది. ట్రిచినెల్లా, టేనియా సగినాటా, టేనియా సోలియం, టేనియా అసియెటెకా వంటివి పచ్చి మాంసంపై జీవించే పరాన్న జీవులు. ఇవి పొట్టలో చేరితే చాలా సమస్యలు మొదలవుతాయి. ఇ. కోలి, గియార్డియా, ఫ్లాట్ వార్మ్‌లు వంటివి కూడా శరీరంలో చేరుతాయి.
Also read: చికెన్ నిల్వ పచ్చడి చేసేయండిలా, టేస్టులో కర్రీని మించిపోతుంది
Also read: ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసా? కేవలం ఒక్క శాతం మంది మాత్రమే చెప్పగలిగారు