Chicken Pickel: చికెన్ నిల్వ పచ్చడి చేసేయండిలా, టేస్టులో కర్రీని మించిపోతుంది
నాన్‌వెజ్ ప్రియుల కోసం మరో టేస్టీ రెసిపీ ఇది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేలా చికెన్ పచ్చడి చేయడం ఎలాగో చెప్పాం.
ఆవకాయల్లాగే చికెన్‌తో కూడా నిల్వ పచ్చడిని టేస్టగా చేసుకోవచ్చు. ఒకసారి చేసుకుంటే నాలుగైదు నెలలు చెక్కుచెదరకుండా ఉంటుంది. రుచిలో చికెన్ కర్రీకి ధీటుగా ఉంటుంది. ఒక్కాసారి తింటే మళ్లీ మళ్లీ మీరే తింటారు. ఈ నాన్ వెజ్ నిల్వ పచ్చళ్లు బయట రెడీమేడ్ గా దొరుకుతున్నాయి. కానీ ధరలు మాత్రం అధికంగా ఉంటాయి. అదే ఇంట్లోనే చేసుకుంటే తక్కువ ధరలోనే అయిపోతాయి. చికెన్ నిల్వ పచ్చడి మార్కెట్లో కిలో రూ.800 నుంచి 1200 వరకు ఉంది. అదే ఇంట్లో అయితే రూ.350తో అయిపోతుంది. చికెన్ కర్రీ వండడం కన్నా పచ్చడి చేసుకోవడమే సులువు.
కావాల్సిన పదార్థాలు
చికెన్ - ఒక కిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - పావుకిలో
కారం - ముప్పావు కప్పు
ఉప్పు - మీ రుచికి సరిపడా
నిమ్మరసం - అర కప్పు
పసుపు - ఒక టీస్పూను
నూనె - అర లీటరు
గరం మసాలా పొడి - రెండు టీస్పూనులు
జీల కర్ర పొడి - ఒక టీ స్పూను
ధనియాల పొడి - ఒక టీస్పూను
తయారీ ఇలా
1. చికెన్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ తడి లేకుండా పళ్లెంలో ఆరబెట్టుకోవాలి.
2. కళాయిలో అరలీటరు నూనె వేసి వేడెక్కాక చికెన్ ముక్కలు వేసి బాగా వేయించాలి. మంట మీడియంలో పెట్టుకుంటే చికెన్ ముక్కలు బాగా వేగుతాయి.
3. చికెన్ ముక్కలు వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ నూనెలో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.
4. ఆ ముద్ద వేగాక అందులో కారం, ఉప్పు, జీతకర్ర పొడి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
5. ఆ మిశ్రమం ఇగురులా బాగా ఉడికాక అందులో చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి.
6. స్టవ్ కట్టేసి మిశ్రమం చల్లారాక అందులో నిమ్మరసం వేసి మళ్లీ బాగా కలపాలి. అంతే చికెన్ పికెల్ రెడీ.
7. ఒక డబ్బాలో ఈ పచ్చడిని వేసి గాలి చొరబడకుండా ఉంచాలి. మరుసటి రోజు ముక్క బాగా ఊరుతుంది. రుచి కూడా బావుంటుంది.
వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకుని తింటే ఆ రుచే వారు. చికెన్ కూర కూడా ఈ పచ్చడి ముందు దిగదుడుపే. ఎండలు బాగా ఉన్న సమయంలో ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. మూత మాత్రం టైట్ పెట్టుకోవాలి. తడి తగలకుండా చూసుకోవాలి.
Also read: ఇకపై కాలిఫోర్నియాలో తేనెటీగలు చేపలతో సమానం, తేల్చి చెప్పిన కోర్టు, అసలు కథేంటంటే
Also read: వందేళ్ల తరువాత మళ్లీ కనిపించిన ‘లిప్‌స్టిక్’ మొక్కలు, ఎక్కడో తెలుసా?