Group-4: గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్, బూట్లు ధరిస్తే పరీక్షకు 'నో' ఎంట్రీ!
గ్రూప్-4 పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) కీలక సూచనలు చేసింది. రేపు ఉదయం 8గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించగా.. పరీక్షకు 15నిమిషాల ముందే 9.45కి గేట్లు మూసివేయనున్నట్లు పేర్కొంది.
గ్రూప్-4 పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) కీలక సూచనలు చేసింది. రేపు ఉదయం 8గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించగా.. పరీక్షకు 15నిమిషాల ముందే 9.45కి గేట్లు మూసివేయనున్నట్లు పేర్కొంది. పేపర్-2కి తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అనుమతిస్తామని.. 2.15కి గేట్లు మూసివేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు వాచ్, హ్యాండ్ బ్యాగ్, పర్సులను పరీక్ష హాలులోకి అనుమతించబోమని పేర్కొంది. చెప్పులే వేసుకోవాలని.. ఎవరూ బూట్లు ధరించొద్దని సూచించింది. అక్రమాలు చేస్తే క్రిమినల్ కేసు, శాశ్వత డీబార్ చేస్తామని హెచ్చరించింది.
గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేయనున్నారు. అంటే ఉదయం జరిగే పేపర్-1కు 9.45 గంటలు, మధ్యాహ్నం జరిగే పేపర్-2కు 2.15 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఉదయం జరిగే పేపర్ 1కు ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం జరిగే పేపర్-2కు 1 గంట నుంచి అభ్యర్థులను అనుమతిస్తారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. పేపర్ 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
గ్రూప్-4 అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
➥గ్రూప్ 4 పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. అందువల్ల నిర్ణీత సమయానికి ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
➥ అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్‌కు ఫొటో గుర్తింపుకార్డు చూపించాలి. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
➥ ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, విలువైన, నిషేధిత వస్తువులు తీసుకెళ్లొద్దు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి.. షూ వేసుకొని వెళ్లొద్దు.
➥ అభ్యర్థికాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు ఆ అభ్యర్థిని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తారు.
➥ ఈ పరీక్షకు భారీగా అభ్యర్థులు హాజరు కానుండటంతో ఈసారి వేలిముద్రను తప్పనిసరి చేశారు. నామినల్ రోల్‌లో సంతకం తరువాత ఎడమచేతి బొటన వేలిముద్ర కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.
➥ పేపర్-1 (జనరల్ స్టడీస్) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అందువల్ల పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో చేరుకోండి.
➥ ప్రతి సెషన్ పరీక్ష ముగిశాక ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేసి వేలిముద్ర వేయాలి. అరగంటకోసారి అభ్యర్థులకు సమయాన్ని గుర్తుచేస్తూ బెల్ మోగిస్తారు. పరీక్ష ముగియడానికి 5 నిమిషాల ముందు బెల్ మోగిస్తారు.
➥ అభ్యర్థులు ప్రశ్నపత్రంపై సమాధానాలను మార్క్ చేయకూడదు. గ్రూప్-4 OMR పత్రంలో హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నంబరు, పరీక్ష కేంద్రం కోడ్, అభ్యర్థి పేరుతో పాటు సంతకం చేయాలి.
➥ ఓఎంఆర్ పత్రంలో బ్లూ/బ్లాక్ పెన్‌తో పేరు, కేంద్రం కోడ్, హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాలి.
➥ హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ/ బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌కాకుండా ఇంక్‌పెన్, జెల్‌పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ పత్రం చెల్లుబాటు కానిదిగా గుర్తిస్తారు.
గ్రూప్-4కు తనిఖీలు ఇలా..
1)గేటు దగ్గర, పరీక్ష కేంద్రంలో హాల్‌టికెట్‌ను పరిశీలిస్తారు.
2)రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు(ఫొటో తప్పనిసరి)
3)పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్‌లోని పేరును పరిశీలిస్తారు.
4)నామినల్ రోల్, ప్రభుత్వ ఐడీలోని ఫొటోను వెరిఫై చేస్తారు.
5)అభ్యర్థి సంతకాన్ని సరిపోలుస్తారు.
6)చివరిగా.. అభ్యర్థి వేలిముద్రలను స్వీకరిస్తారు.