IDBI Recruitment 2021: ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్..
IDBI Recruitment 2021: ఐడీబీఐ సంస్థలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు గడువు ఆగస్టు 18తో ముగుస్తుంది.
బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్దమయ్యే వారికి ఐడీబీఐ (ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై కేంద్రంగా ఉన్న ఐడీబీఐ సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 920 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు ఆగస్టు 18వ తేదీతో ముగియనున్నట్లు పేర్కొంది.
Also Read: North Central Railway Recruitment 2021: నార్త్ సెంట్రల్ రైల్వేలో 1664 అప్రెంటిస్ పోస్టులు..
దరఖాస్తు ఫీజు..
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, మిగతా వారంతా రూ.1000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాల కోసం ఐడీబీఐ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ idbibank.in ను సంప్రదించవచ్చని తెలిపింది.
వయో పరిమితి, విద్యార్హత..
2021 జూలై 1వ తేదీ నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి ఉంది. ఇక విద్యార్హత విషయానికి వస్తే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు సరిపోతాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
సెప్టెంబర్ 5న పరీక్ష..
ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తుంది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ పరీక్ష సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహించనుంది. ఈ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహించనుంది. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనే మూడు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు (ఒక్కో ప్రశ్నకి ఒక మార్కు) ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలుగా ఉంది.
వేతనం రూ.29000..
ఎంపికైన వారి కాంట్రాక్టు ఏడాది పాటు ఉంటుందని నోటిఫికేషన్‌లో చెప్పింది. వారి పనితీరు సంతృప్తికరంగా ఉంటే మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉందని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.29000 వేతనం చెల్లిస్తామని చెప్పింది. రెండో ఏడాది నెలకు రూ.31000, మూడో ఏడాది నెలకు రూ.34,000 చొప్పున వేతనం చెల్లిస్తామని వివరించింది.
దరఖాస్తు చేసుకోండిలా..
- Idbibank.in అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో కెరీర్ (career) అని ఉన్న ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఆన్ కాంట్రాక్టు -2021 అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- అప్లయ్ ఆన్‌లైన్‌ను క్లిక్ చేసి.. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కు వెళ్లండి.
- అభ్యర్థులు తమకు సంబంధించిన వివరాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి.
- ఇది పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నంబరు, పాస్ వర్డ్ (ఈమెయిల్, ఎస్ఎంఎస్ రూపంలో) వస్తాయి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
- దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు కాపీలను సేవ్ చేసుకోండి.