Cancer: తల్లికి క్యాన్సర్ ఉన్న విషయాన్ని బయటపెట్టిన రొమ్ము పాల రంగు, ఇదో రకమైన బ్రెస్ట్ క్యాన్సర్
నిండు గర్భంతో ఉన్న మహిళకు ఆమె రొమ్ము పాలు రంగు ద్వారా క్యాన్సర్ ఉన్న విషయం బయటపడింది.
ఎప్పుడు ఎవరికి భయంకర క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందో అంచనా వేయడం చాలా కష్టం. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలయినా ఓ మహిళ నిండు గర్భంతో ఉంది. మరో రెండు వారాల్లో ఆమెకు ప్రసవం అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో రొమ్ము పాల ఉత్పత్తి మొదలైంది. ప్రసవం కావడానికి ముందు, ప్రసవం అయిన వెంటనే వచ్చే పాలను కొలెస్ట్రెమ్ అంటారు. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. వీటి రంగు లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ ఆమెకొచ్చిన పాలు పసుపు రంగులో కాకుండా, గులాబీ రంగులో ఉండడం గమనించింది. కానీ గర్భంతో ఉన్నప్పుడు ఎన్నో మార్పులు జరుగుతాయని, అలాంటిదే ఇది కూడా అయ్యి ఉంటుందని పెద్దగా పట్టించుకోలేదు. రెండు వారాల తర్వాత ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఆమె పాల రంగు గురించి వైద్యులకు చెప్పింది. వారిలో అనుమానం వచ్చి పరీక్షలు చేయగా ఆమెకు ‘ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్’ ఉన్నట్టు తెలిసింది. అదృష్టం కొద్దీ బిడ్డ మాత్రం ఆరోగ్యంగా ఉన్నాడు.
ఏంటీ క్యాన్సర్?
ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది క్యాన్సర్లో ఒక రకం. ఆ క్యాన్సర్ కణాలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ గ్రాహకాలు, HER2 అనే ప్రోటీన్ ఉండవు. అందుకే ఈ క్యాన్సర్ వచ్చినా కూడా త్వరగా బయటపడదు. మూడు రకాల పరీక్షలు చేసి దీన్ని నిర్ధారించాలి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం ఈ రకమైన క్యాన్సర్ 40 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న మహిళల్లోనే వస్తుంది. ముఖ్యంగా నల్లజాతీయుల్లో కనిపిస్తుంది.
దీని లక్షణాలు ఏమిటి?
ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళల రొమ్ములో వాపు, చర్మం ఆకారం, రంగు మారడం, నొప్పి పెట్టడం, చనుమొనల చుట్టూ ఉండే చర్మం పొడిబారడం, చర్మం రాలిపోవడం, చనుమొనల నుంచి స్రావాలు రావడం, చేయి కింద లేదా కాలర్ బోన్ దగ్గర కణుపులు రావడం వంటివి జరుగుతాయి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెప్పిన ప్రకారం ఈ క్యాన్సర్ శరీరంలో త్వరగా పెరుగుతుంది. అలాగే త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. చికిత్స తర్వాత కూడా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ. ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు జీవించే కాలం కూడా ఇతర రొమ్ము క్యాన్సర్లతో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. ప్రపంచంలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్లలో దాదాపు 10 నుంచి 15% ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులే.
మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ మహిళ కీమోథెరపీ చేయించుకోవడం మొదలుపెట్టింది. సి సెక్షన్ ద్వారానే ఆమెకి ప్రసవం చేశారు వైద్యులు. కాకపోతే బిడ్డకు పాలిచ్చే పరిస్థితి మాత్రం ఆమెకు లేదు.
Also read: అరటి పండును ఉడకబెట్టి తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ, సోషల్ మీడియాలో ఇది న్యూ ట్రెండ్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.