Heart Health: మండే ఎండల్లో గుండె జాగ్రత్త - గుండెపోటు కేసులు పెరిగే అవకాశం
వాతావరణంలో మార్పులు గుండెపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి.
వేసవికాలం ఇలా మొదలైందో లేదో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఒంట్లోని నీటిని, ముఖ్యమైన లవణాలను చెమట రూపంలో లాగేసుకుంటాయి వడగాలులు. దీనివల్ల శరీరం అంతటా అలసట ఆవహించేస్తుంది. జాగ్రత్త పడకపోతే వడదెబ్బ వల్ల కిడ్నీ జబ్బులు, గుండె సమస్యలు వంటివి పెరిగే అవకాశం ఉంది. మండే ఎండల్లో ఎక్కువగా ప్రభావితం అయ్యేది గుండె ,కిడ్నీలే అని చెబుతున్నారు వైద్యులు.
ప్రతి ఏటా ఎండలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు మార్చి నెలలోనే కనీసం అరగంట కూడా ఎండలో ఉండలేని పరిస్థితి. కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడి వడగాలులు తీవ్రంగా మారుతున్నాయి. ఈ మండే ఎండల్లో గుండె, కిడ్నీలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
కిడ్నీల కోసం
కిడ్నీ సమస్యలు ఉన్నవారు, కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు త్వరగా డిహైడ్రేషన్ బారిన పడతారు. అంతేకాదు డీహైడ్రేషన్ తట్టుకునే శక్తి కూడా వీరిలో తక్కువ ఉంటుంది. అందుకే శరీరంలో నీటిని కోల్పోకుండా జాగ్రత్త పడాలి. అధిక రక్తపోటు, మధుమేహం వంటివి అదుపులో ఉంచుకోవాలి. చెమటతో పాటు సోడియం కూడా బయటికి పోతుంది. అలాంటప్పుడు రక్తపోటు పడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల రక్తపోటు పడిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలోని నీటి శాతం తగ్గిందంటే రక్తంలో పొటాషియం కూడా తగ్గుతుంది. పొటాషియం అందకపోతే కండరాలు, కిడ్నీలు దెబ్బతింటాయి. కాబట్టి కొబ్బరి నీళ్లు రోజూ తాగడం అలవాటు చేసుకోవాలి. పుచ్చకాయ, అరటిపండు వంటివి కూడా రోజు తినడం వల్ల కిడ్నీలను కాపాడుకోవచ్చు.
గుండె కోసం...
మన శరీరంలో ప్రధాన అవయవం గుండె. కానీ ఇప్పుడు అది నీరసించిపోతుంది. చిన్న వయసులోనే గుండె పోటు బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. శీతాకాలంలోనే గుండెపోటు అధికంగా వస్తుందని అని చెబుతారు. అది నిజమే కానీ వేసవిలో శరీరంలో నీరు తగ్గుతూ ఉండటం వల్ల కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక వేడి, అతి శీతలం కూడా గుండెకు ప్రమాదమే. వేసవిలో చర్మానికి రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండె చాలా బలంగా పనిచేయాల్సి వస్తుంది. అతి శీతలం, అధిక వేడి ఈ రెండు పరిస్థితుల్లోనూ గుండె ఎక్కువగానే కష్టపడుతుంది. దానిపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల గుండెకు రక్తప్రసరణ తగ్గే ప్రమాదం కూడా ఉంది. బలహీనమైన గుండె గలవారు త్వరగా అధిక ఉష్ణోగ్రత వద్ద త్వరగా ఆరోగ్య సమస్యల బారిన పడతారు. అలాగే చెమట రూపంలో లవణాలు బయటికి వెళ్లిపోవడం వల్ల శరీరంలో సమతుల్యత తగ్గుతుంది. ఇది గుండె సమస్యల బారిన పడిన వారికి చాలా ఇబ్బంది. గుండె సమస్యలు కలవారు వేసవిలో వదులైన దుస్తులే వేసుకోవాలి. ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు, కూల్ డ్రింకులు వంటి వాటికి దూరంగా ఉండాలి. కాఫీ, మద్యం వదిలేయాలి. మజ్జిగ, పంచదార కలపని పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు వంటి వాటిని ఎక్కువగా తాగాలి.
Also read: డబ్బుతో ఆనందాన్ని కొనలేం అన్నది పచ్చి అబద్ధం అంటున్న అధ్యయనం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.