Cancer Symptoms: మీ నోరు ఇలా మారుతోందా? జాగ్రత్త, క్యాన్సర్ కావచ్చు
నోటి ఆరోగ్యం విషయంలో మొదటి పాత్ర పోషించేది దంత సంరక్షణ. కానీ నోటిలోకి అప్పుడప్పుడు క్రమం తప్పకుండా చూసుకోవడం వల్ల నోటిలో జరిగే చిన్నచిన్న మార్పులను కూడా గమనించేందుకు అవకాశం ఉంటుంది.
నోట్లో పుండ్లు రావడం, నోరు పొక్కుపోవడం వంటి సమస్యలు సర్వసాధారణమే. శరీరానికి వేడి చేసిందేమో అనే కారణంతో చాలామంది వాటిని పెద్దగా పట్టించుకోరు. అయితే, నోటిలో కనిపించే చిన్న మార్పులు క్యాన్సర్‌కు సూచనలు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
నాలుకపై తెల్లని మచ్చలు
నాలుక మీద తెల్లటి మచ్చలు ప్యాచ్ ల మాదిరిగా కనిపిస్తే ల్యూకోప్లాకీయా అంటారు. ఇది క్యాన్సర్ కు కూడా సంకేతం కావచ్చు. పొగతాగే అలవాటు నోటిలోని కణజాలం చాలా కాలంగా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఇది క్యాన్సర్ కు కారణం కావచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి చాలా వరకు బినైన్ కావచ్చు. అంటే క్యాన్సర్ కాని లక్షణాలే. కానీ, క్యాన్సర్‌కు సూచన కావచ్చు. ఇలాంటి మార్పులు నాలుక మీద గుర్తిస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలి.
నోటి క్యాన్సర్ వస్తే.. రూపురేఖలు మారిపోతాయట
పొగ తాగేవారు, అధికంగా మద్యం సేవించేవారు హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) కారణంగా నోటి క్యాన్సర్‌కు గురవ్వుతారు. నోటి క్యాన్సర్ వల్ల మాట్లాడే తీరు, తినే, తాగే విధానం అన్నింటి మీద చాలా నెగెటివ్ ప్రభావం చూపిస్తాయి. చాలా సందర్భాల్లో ముఖం రూపం కూడా భయంకరంగా మారిపోవచ్చు. ఈ క్యాన్సర్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి నాలుకపైన, ప్రతి నాలుగురిలో ఒకరికి టాన్సిల్స్‌పైనా లక్షణాలు కనిపిస్తాయట.
కచ్చితంగా పెదవులు, చిగుళ్లు, బుగ్గల లోపల, నోటిపై అంగిలి వంటి భాగాలన్నింటి మీద ఒక దృష్టి సారించాలి. ఈ మధ్యకాలంలో నోటి క్యాన్సర్ కేసులు చాలా పెద్ద మొత్తంలో పెరుగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదట్లో నోటిక్యాన్సర్ లక్షణాలు గుర్తించేంత పెద్దగా ఉండవు. నొప్పి కూడా ఉండదు. అందుకే నోటిలో జరిగే ప్రతి చిన్న మార్పును త్వరగా గుర్తించాలి.
నోటి క్యాన్సర్ కు సంబంధించిన నాలుగు లక్షణాలు
నోటిలో అల్సర్ ఏర్పడి.. అది మూడు వారాలుగా తగ్గడం లేదంటే కచ్చితంగా అనుమానించాల్సిందే. తప్పకుండా డెంటిస్ట్ ను కలిసి అభిప్రాయం తీసుకోవాలి. నోటిలో నాలుక మాత్రమే కాదు.. బుగ్గులు, నాలుక కింద, చిగుళ్లు, అంగిలి ఎక్కడైనా సరే తెలుపు లేదా ఎరుపు రంగు ప్యాచెస్ కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని గుర్తుంచుకోవాలి.
నోరు, తల, మెడ భాగాల్లో ఎక్కడైనా సరే అసాధారణంగా అనిపించే కణితులు కనిపిస్తే తప్పనిసరిగా అవి ఎలాంటివో నిర్ధారణ చేసుకోవడం తప్పనిసరి. అది ఎలాంటి ప్రమాదానికైనా సూచన కావచ్చు. అకస్మాత్తుగా స్వరంలో మార్పులు కనిపిస్తే గొంతు బొంగురు పోయిందంతే అని తేలికగా తీసుకోవద్దు. ఎందుకు స్వరం మారిందో కారణం తెలుసుకోవడం అవసరం అని గుర్తించాలి.
Also Read: కరివేపాకు ఇలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అసలు పెరగవు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.