Heart Attack Risk Post Covid: కోవిడ్‌తో గుండెకు ముప్పు.. జర పైలం..
కోవిడ్ పాజిటివ్ వచ్చిన రెండు వారాల సమయంలో గుండె పోటు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ది లాన్సెట్ అనే అంతర్జాతీయ జర్నల్ ఈ అధ్యయన వివరాలను వెల్లడించింది.
కరోనా వైరస్ మనిషి ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది.. శ్వాస సంబంధిత రుగ్మతలకు కారణమవుతుందనే విషయం తెలిసిందే. ఈ వైరస్ తన ప్రతాపాన్ని ఇక్కడితోనే ఆపదని, ఇది ఒక్కసారి శరీరంలోకి ప్రవేశించాక.. ఇతర అవయవాలకు వ్యాపించి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే తాజాగా ఇదే అంశంపై మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఏంటా విషయం?
కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ధైర్యం చాలా ముఖ్యమనే విషయం తెలిసిందే. మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే ఆరోగ్యానికి పెనుముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన రెండు వారాల సమయంలో గుండె పోటు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ది లాన్సెట్ అనే అంతర్జాతీయ జర్నల్ ఈ అధ్యయన వివరాలను నివేదిక రూపంలో వెల్లడించింది.
Also Read: Covid 19 Mental Health: కోవిడ్‌తో మానసిక ఒత్తిడా? పొగొట్టుకోండిలా..
స్వీడన్‌లోని ఉమెయా యూనివర్సిటీ పరిశోధకులు కోవిడ్ కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు ఈ అధ్యయనం నిర్వహించారు. 2020 ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 14 మధ్య మధ్య కాలంలో నమోదైన కోవిడ్ కేసుల వివరాలను పరిశీలించారు. దీని కోసం పూర్తి ఆరోగ్యంగా ఉన్న 3,48,481 మందిని, కోవిడ్ పాజిటివ్ వచ్చిన 86,742 మంది ఆరోగ్య వివరాలపై పరిశోధన జరిపారు.
అధ్యయనంలో భాగంగా స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ, స్టాటిస్టిక్స్ స్వీడన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ సంస్థల నుంచి కోవిడ్ రోగుల సమాచారాన్ని సేకరించారు. గతంలో గుండె పోటు వచ్చిన వారి వివరాలను ఈ జాబితా నుంచి తొలగించారు. ఈ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా కోవిడ్ పాజిటివ్ వచ్చిన గుండె పోటు ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని పరిగణలోకి తీసుకుని అధ్యయన ఫలితాలను వెల్లడించారు.
కోవిడ్ సోకిన వారిలో మొదటి రెండు వారాల్లో గుండె పోటు వచ్చే అవకాశాలు మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు కనుగొన్నామని.. అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల్లో ఒకరైన ఓస్వాల్డో ఫాన్‌సికా వెల్లడించారు. పరిశోధనలో పాల్గొన్న వారి వయసు, జెండర్, సామాజిక ఆర్థిక పరిస్థితులు, వారికి గతంలో ఏమైనా అనారోగ్యం ఉందా అనే అంశాలను పరిగణలోకి తీసుకున్నా కూడా ఇవే ఫలితాలు వచ్చాయని తెలిపారు.
వ్యాక్సిన్ పాత్ర కీలకం..
కోవిడ్ చికిత్సలో వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనంలో పాల్గొన్న మరో పరిశోధకుడు ఇయోన్నీస్ కట్సౌలరీస్ పేర్కొన్నారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వృద్ధులకైతే వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె పోటు బారిన పడకుండా ఉండే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోని వారు వీలైనంత త్వరగా టీకా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
నిపుణులు ఏమంటున్నారు?
కోవిడ్ వ్యాధి కంటే అది వచ్చిందనే భయంతోనే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలను చూస్తునే ఉన్నాం. కోవిడ్ కంటే భయమే వారిని మానసికంగా కుంగదీస్తోందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది కోవిడ్ పేషెంట్లలో భయం కారణంగానే గుండె సంబంధిత సమస్యలు వస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. మానసికంగా ధైర్యంగా ఉంటూ సరైన మెడికేషన్ తీసుకుంటే దీనికి చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు.